అహ్మదాబాద్ విమాన ప్రమాదం విషయంలో రాజకీయ నాయకుల పరామర్శ వ్యవహారంపై సోషల్ మీడియా భగ్గుమంటోంది. విమాన ప్రమాదం జరిగిన రోజు హోం మంత్రి అమిత్ షా, విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు సంఘటనా స్థలానికి వెళ్లారు. ఇతర నేతలు కూడా అక్కడికి వెళ్లి సహాయక చర్యల్ని పర్యవేక్షించారు. అయితే రామ్మోహన్ నాయుడిపై సోషల్ మీడియాలో సెటైర్లు పడ్డాయి. ఆయన సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసిన వీడియో వల్లే ఆ విమర్శలు వచ్చాయి. ఇక ఆ తర్వాత అంతకంటే ఎక్కువగా సెటైర్లు, ట్రోలింగ్ ఎదుర్కొన్నారు ప్రధాని నరేంద్రమోదీ. దీనికి కారణం ఒకే ఒక్క ఫొటో. ఆ పొటో కూడా ఏఎన్ఐ కెమెరామెన్ తీయడం విశేషం.
అసలేంటి ఆ ఫొటో..
మోదీ ఘటనా స్థలానికి వెళ్లారు. అక్కడ ఆల్రడీ విమానం శిథిలాల తరలింపు పూర్తయింది. మిగిలిన విమానం తోక భాగాన్ని ఆయన పరిశీలిస్తున్నట్టుగా ఆ ఫొటో ఉంది. అయితే ఆ ఫొటో యాంగిల్ మాత్రం అందర్నీ ఆకట్టుకుంటోంది. కింద మోదీ, ఆయన పైన బిల్డింగ్ పై పడిపోయిన విమానం చివరి భాగం.. ఇదీ ఆ ఫొటో. అయితే ఇక్కడ కెమెరామెన్ ఎక్కడున్నారనేదే అసలు విషయం. కెమెరామెన్ పూర్తిగా కింద పడుకుని తీస్తేనే ఆ ఫొటో అలా వస్తుందని అంటున్నారు నెటిజన్లు. కెమెరామెన్ ప్రతిభను వారు సెటైరిక్ గా మెచ్చుకున్నారు. అంతలా కెమెరామెన్ మోదీకోసం కష్టపడాలా అని అడుగుతున్నారు. అంతే కాదు, శిథిలాలను పరీశీలించడానికి వచ్చిన మోదీ ఇలా డ్రమటిక్ గా ఫొటోలు తీసుకోవడమేంటని మండిపడుతున్నారు.
ANI: Saar, please stand here looking up at the plane debris — we’ll click a photo from a low angle! 📸 pic.twitter.com/NjsZRPjirW
— Jawaharlal Nehru (Satire) (@The_Nehru) June 13, 2025
మోదీ స్టైలే వేరు..
ప్రధాని నరేంద్రమోదీ ఫొటోలకు బాగానే ఫోజులిస్తారు. ఆయన పర్యటనలను నిశితంగా పరిశీలించిన ఎవరికైనా ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది. మోదీ పర్యటనల్లో కెమెరా లుక్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. కెమెరామెన్ ఎక్కడున్నారు, ఏ యాంగిల్ లో ఫొటో తీస్తారనే విషయాలపై మోదీకి స్పష్టమైన అవగాహన ఉంటుంది. చాలా సార్లు సభలలో, వేదికలపై కెమెరాకు అడ్డుగా వచ్చే చాలామందిని మోదీనే స్వయంగా పక్కకు తప్పించిన ఉదాహరణలు కూడా ఉన్నాయి. అలాంటి మోదీ ఇప్పుడు అహ్మదాబాద్ విమాన ప్రమాద సంఘటన వద్ద కూడా సరిగ్గా కెమెరాకు మంచి స్టిల్ ఇచ్చారు. ఆ స్టిల్ ఇప్పుడు వైరల్ గా మారింది.
Ahmedabad | PM Modi visited the AI-171 plane crash site and took stock of the situation pic.twitter.com/gFN3ezzvtQ
— ANI (@ANI) June 13, 2025
ఎయిరిండియా విమాన ప్రమాదంలో అందులో ప్రయాణించిన 242 మందిలో 241 మంది మృతి చెందారు. ఒక్కరు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. మృతుల్లో 229 మంది ప్రయాణికులు కాగా.. 12 మంది విమాన సంస్థ సిబ్బంది. ప్రయాణికుల్లో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ పౌరులు కాగా, ఏడుగురు పోర్చగీస్ వాసులు ఉన్నారు. ఒకరు కెనడా జాతీయుడు. ఈ ప్రమాదంలో విమానం ఆస్పత్రికి అనుబంధంగా ఉన్న హాస్టల్ భవనంపై పడింది. దీంతో 24 మంది మెడికోలు చనిపోయారు. దీంతో ఈ ప్రమాదంలో మొత్తం మృతుల సంఖ్య 265కి చేరింది. ఈ భారీ ప్రమాదంతో ఒక్కసారిగా యావత్ భారత్ ఉలిక్కిపడినట్టయింది. విమాన యాన సంస్థలు కూడా అలర్ట్ అయ్యాయి. విమానయాన సంస్థలకు డీజీసీఏ కీలక ఆదేశాలు జారీ చేసింది.