తరగతి గదిలో ఓ విద్యార్థిని మహిళా ప్రొఫెసర్ పెళ్లి చేసుకున్నట్లు చూపించిన వీడియో గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఈ ఘటన బెంగాల్ లోని మౌలానా అబుల్‌కలాం ఆజాద్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీలో జరిగింది. ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. అయితే, ఇదంతా ఓ స్కిట్ అని సదరు మహిళా ప్రొఫెసర్ చెప్పినప్పటికీ, వర్సిటీ అధికారులు మాత్రం విచారణకు ఆదేశించారు.
క్లాస్ రూమ్ లో విద్యార్థిని పెళ్లి చేసుకున్న మహిళా ప్రొఫెసర్
ఈ ఘటన వర్సిటీలోని సైకాలజీ డిపార్ట్ మెంట్ లో జరిగింది. మహిళా ప్రొఫెసర్ పెళ్లికూతురిలా ముస్తాబు కాగా, ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థి పెళ్లి కొడుకులా తయారయ్యాడు. ఇద్దరు పూల దండలు మార్చుకుని, కుంకుమ పెట్టుకున్నారు. హిందూ సంప్రదాయంలో పెళ్లి చేసుకున్నారు. ఇతర అధ్యాపకులు, విద్యార్థులు ఈ పెళ్లిని ఎంజాయ్ చేస్తూ, వారిని ఉత్సాహపరిచారు. ఈ ఘటనకు సంబంధించి జనవరి 9న హల్దీ వేడుక జరగగా, జనవరి 14న మెహందీ, సంగీత్ నిర్వహించారు. ఈ పెళ్లి వేడుకకు సంబంధించి ఇన్విటేషన్ కూడా తయారు చేశారు. ఈ పెళ్లి తంతు వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
అసలు ఏం జరిగిందో చెప్పిన ప్రొఫెసర్
అటు ఈ వీడియో వ్యవహారంపై మహిళా ప్రొఫెసర్ స్పందించారు. ఇదంతా ఫ్రెషర్స్ వేడుక కోసం చేసిన స్కిట్ అన్నారు. ఇది నిజమైన పెళ్లి కాదన్నారు. ఈ వీడియోలు ఇన్ హౌస్ డాక్యుమెంటేషన్ కోసం తీయబడ్డాయన్నారు. సైకాలజీ విభాగాన్ని చెడుగా చూపించడానికి ఎవరో ఈ వీడియోను లీక్ చేశారని ఆమె వెల్లడించారు. తన ఇమేజ్ ను దెబ్బతీయడానికి చేసిన పనిగా ఆమె అభివర్ణించారు. ఇందులో ఎటువంటి అనుచితం, అనైతిక ప్రవర్తన లేదన్నారు. పూర్తిగా ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ మాత్రమేనన్నారు. తనను చెడుగా చూపించే ప్రయత్నం చేసిన వ్యక్తిని గుర్తించినట్లు ఆమె తెలిపారు. సదరు వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
ক্লাসের ভিতরে দিদিমণির সঙ্গে বিয়ে সারলেন ছাত্র! ভাইরাল ভিডিও pic.twitter.com/bDYOyh2fk3
— Bangla Jago Tv (@BanglaJagotv) January 29, 2025
Read Also: రైల్వేకు ఝలక్.. రూ.50 లక్షల పరిహారం చెల్లించాలంటూ ప్రయాణీకుడు డిమాండ్!
ముగ్గురు సభ్యులతో విచారణ కమిటీ
అటు ఈ వీడియో పెద్ద వివాదానికి కారణం కావడంతో యూనివర్సిటీ ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ ఘటనపై ఈ కమిటీ దర్యాప్తు చేస్తుందని వెల్లడించింది. అయితే, కమిటీ తన నివేదిక ఇచ్చే వరకు సదరు ప్రొఫెసర్ ను సెలవుపై వెళ్లాలని సూచించారు. విద్యార్థిని తరగతులకు హాజరుకాకూడదన్నారు. దర్యాప్తు కమిటీ ప్రస్తుతం ఈ ఘటనపై పూర్తి విచారణ చేస్తున్నది. ఈ పెళ్లి తంతువెనుక అసలు కథ ఏంటని ఆరా తీస్తున్నది. పెళ్లి జరిగిన రోజు అక్కడ ఉన్న విద్యార్థులను, అధ్యాపకులను అడిగి పూర్తి వివరాలను సేకరిస్తున్నది. త్వరలో ఈ నివేదికను వర్సిటీ వైస్ ఛాన్స్ లర్ కు అందించే అవకాశం ఉంది. ఈ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని వర్సిటీ వెల్లడించింది.
Read Also: టైబుల్ మీద 70 కోట్లు, కావలసినంత తీసుకోండి.. కానీ, ఓ కండీషన్.. ఉద్యోగులకు బంపర్ ఆఫర్!