Wular Lake Lotus| జమ్మూ కశ్మీర్‌లోని వులార్ సరస్సు ఒడ్డున, 60 ఏళ్ల రైతు అబ్దుల్ రషీద్ దార్ ఉదయం మంచులో నడుస్తూ, నీటిపై గులాబీ రంగు తామర పువ్వులు (కమలం -Lotus) ఆడుతున్న దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. “నా కళ్లను నమ్మలేకున్నాను,” అని అతను చిన్నగా చెప్పాడు. “ఇది చిన్నప్పటి కలలా ఉంది, మళ్లీ సజీవమైంది.” అతను ఇలా చెప్పడానికి కారణం.. ఆ సరస్సులో 30 ఏళ్లుగా ఆ అందమైన పువ్వులు పూయలేదు.
కశ్మీర్ లోని బందిపొర జిల్లాలో ఉన్న వులార్ లేక్ (సరస్సు) ఆసియాలోనే అతిపెద్ద స్వచ్ఛమైన నీటి సరస్సు. ఈ సరస్సులో దాదాపు మూడు దశాబ్దాలుగా తామర పువ్వులు అదృశ్యమయ్యాయి. ఈ గులాబీ తామరలు ఒకప్పుడు ఇక్కడి జీవనం, సంస్కృతి, జీవనాధారం. కానీ 1992లో వచ్చిన భారీ వరద తర్వాత, ఈ తామరలు బురదమట్టి వల్ల మళ్లీ పూయలేదు. దీంతో అక్కడి స్థానికులు, ఈ తామర పువ్వుల ఆధారంగా జీవనం గడిపే రైతులు ఎప్పుడు ఈ పువ్వులు పూస్తాయా? అని ఎదురుచూస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు, వులార్ సరస్సు మళ్లీ సజీవంగా మారింది, తిరిగి పూసిన తామరలతో కథలు, ఆశలు మళ్లీ చిగురించాయి.
30 ఏళ్లుగా తామర పువ్వులు ఎందుకు పూయలేదు..
వులార్ సరస్సు 200 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది, బండిపోరా, సోపోర్ పట్టణాల మధ్య ఉంది. ఒకప్పుడు ఇది చేపలు, వలస పక్షులు, తామరలతో నిండుగా కళకళ లాడేది. ఈ తామరల కాండాలను కశ్మీరీ భాషలో నాద్రు అని పిలుస్తారు. దీంతో వంటలు కూడా చేస్తుంటారు. కశ్మీరీలు ఈ నాద్రు వంటకాలను బాగా ఇష్టపడి తింటారు. నాద్రు యాఖ్నీ అనే పెరుగుతో చేసే వంటకం లేదా చేపలతో కలిపి వండే వంటకం, ఇది ఆహారం మాత్రమే కాదు కశ్మీరీల సంస్కృతిలో ఓ భాగం, స్థానిక రైతులకు ఒక జీవనాధారం.
“నా చిన్నప్పుడు, నేను నాన్నతో కలిసి సరస్సులోతులోకి వెళ్లి నీటిలో నుంచి నాద్రును సేకరించేవాణ్ణి,” అని అబ్దుల్ రషీద్ అనే రైతు చెప్పాడు. “మెడ వరకు నీటిలోకి దిగి, మట్టిలో నుండి కాండాలను తీసేవాళ్లం. అది కష్టమైన పని, కానీ అది మాకు జీవనాధారం ఇచ్చింది.” కానీ 1992 సెప్టెంబర్‌లో వచ్చిన భారీ వరద వులార్ సరస్సును ముంచెత్తింది. మట్టి పేరుకుపోవడంతో తామరలు అదృశ్యమయ్యాయి. దాంతో పాటే మా జీవనాధారం కూడా.
నిశ్శబ్దంగా మారిన జీవితాలు
వరద తర్వాత సరస్సు నిశ్శబ్దంగా మారింది. గ్రామస్తులు తామర విత్తనాలను నీటిలో వేసి, మళ్లీ పూస్తాయని ఆశించారు, కానీ ఏమీ జరగలేదు. చాలామంది తామరలు ఇక శాశ్వతంగా అంతరించిపోయాయని అనుకున్నారు.
అనూహ్య పునరాగమనం
2020లో.. వులార్ కన్జర్వేషన్ అండ్ మేనేజ్‌మెంట్ అథారిటీ (WUCMA) సరస్సును శుభ్రం చేసే పెద్ద ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. మట్టిని తొలగించడంతో, తామరలు తిరిగి పూయడం ప్రారంభమైంది. “మేం తామరలను తిరిగి తీసుకురావాలని ప్రత్యేకంగా ప్రయత్నించలేదు,” అని WUCMA అధికారి ముదాసిర్ అహ్మద్ చెప్పాడు. “కానీ ఇది అసలు మేం ఊహించలేదు. ఆ పువ్వులు మాకు ఒక బహుమతిలా పూసాయి.”
గత ఏడాది, లంక్రేషిపోరా గ్రామం దగ్గర తొలి తామర పుష్పాలు కనిపించాయి. ఈ సంవత్సరం, WUCMA మరిన్ని విత్తనాలు వేయడంతో, సరస్సు తామరలతో నిండిపోయింది.
పుష్పం కంటే ఎక్కువ
తామరల తిరిగి రాక సౌందర్యం గురించి మాత్రమే కాదు. ఇది కశ్మీర్‌లో ఉపాధి లేని సమయంలో అంటే సెప్టెంబర్ నుండి మార్చి వరకు.. ఆదాయ వనరుగా మారింది. “ఇది దాదాపు అద్భుతం,” అని అబ్దుల్ రషీద్ చెప్పాడు. WUCMA ఇప్పటికే 79 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తొలగించింది, జీలం నది ద్వారా మట్టి రాకుండా నిరోధించే చర్యలు తీసుకుంటోంది.