AP New Scheme:ఏపీ ప్రభుత్వం పాలనాపరమైన అంశాలపై పట్టు సాధించడంతో, ఇక పథకాల అమలుపై దృష్టి సారించింది. ప్రధానంగా రైతన్నలను ఆదుకొనేందుకు సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. అయితే కేంద్రం అందించే సాయంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా అదనపు నగదు కలిపి రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. తాజాగా మంత్రి అచ్చెన్నాయుడు ఈ పథకానికి సంబంధించి కీలక ప్రకటన చేశారు. అయితే ఆ పథకం ఏమిటి? రైతులకు ఏ మేరకు మేలు జరుగుతుంది? అందుకు ప్రాథమికంగా ఏ అంశాలను తీసుకుంటారో తెలుసుకుందాం.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వరుసగా వరదలు పలకరించాయి. ఈ వరదలు రాష్ట్రంలోని రైతన్నల పాలిట శాపాలేనని చెప్పవచ్చు. పంట చేతికి అందివచ్చిన వెంటనే వరదలు రావడంతో రైతన్నలకు నష్టం తప్పలేదు. దీనితో అన్నదాతలను వరదసాయం పేరిట ప్రభుత్వం ఆదుకుంది. వారి ఖాతాల్లో వరదసాయాన్ని జమ చేయడంతో రైతన్నలకు కాస్తైనా ఆర్థిక భరోసా కల్పించినట్లయింది. అటువంటి రైతన్నల కోసం కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ అనే కొత్త పథకాన్ని ప్రవేశ పెట్టనుంది.
ఈ పథక ముఖ్య ఉద్దేశం.. రైతన్నలకు ఏడాది కాలానికి పెట్టుబడి అవసరం. పంట వేసిన సమయం నుండి చేతికి అందేవరకు రైతన్నకు పెట్టుబడి ఖర్చు అధికమే. అందుకే ఈ పథకం ప్రవేశపెట్టి రైతన్నలను ఆదుకోవాలన్నదే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. ఈ పథకం అమలుకు కేంద్రం ఏడాదికి ఒక్కొక్క రైతుకు రూ. 6 వేలు అందిస్తుంది. ఈ డబ్బుతో పాటు రాష్ట్ర ప్రభుత్వం మరో రూ. 14 వేలు కలిపి మొత్తం రైతుల ఖాతాల్లో రూ. 20 వేలు జమ చేయనుంది. అంటే పెట్టుబడి సాయం కింద రైతుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సహకారం అందిస్తున్నాయన్నమాట.
Also Read: TTD News: తిరుమలలో కొత్త తరహా అన్యమత ప్రచారం.. ఫిర్యాదు చేసిన భక్తుడు.. ఆ తర్వాత?
ప్రాథమికంగా తెలిసిన సమాచారం మేరకు ఈ పథకం ద్వారా లబ్ది పొందేందుకు రైతు పాసు పుస్తకం కలిగి ఉండాలి. అలాగే ప్రతి పంటను ఈ క్రాప్ లో నమోదు చేసుకోవాలి. దీనితో ప్రకృతి వైపరీత్యాల సమయంలో పంట నష్టం జరిగితే, ఆ సాయాన్ని కూడా పొందే వీలు రైతన్నలకు ఉంటుంది. త్వరలోనే ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. మరెందుకు ఆలస్యం రైతన్నా.. ఈ పథకం ద్వారా లబ్ది పొందేందుకు సిద్దం కండి.. రైతులకు ఇంత మంచి నిర్ణయం తీసుకున్న ప్రభుత్వానికి థ్యాంక్యూ చెప్పాల్సిందే.