మాట తప్పను, మడమ తిప్పను అంటే ఏమో అనుకున్నాంగానీ, ఏపీ సీఎం జగనన్న అన్నంత పని చేశారని అంతా అనుకుంటున్నారు. ఎంత నష్టమైనా జరగనీ, రాజధాని మాత్రం విశాఖలో ఉండాల్సిందేని పట్టుపట్టి మరీ కార్యాలయాలన్నీ తరలించేస్తున్నారు. ఇప్పటికి 35 శాఖలకు సంబంధించి కార్యాలయాలకు భవనాలను సిద్ధం చేశారని అంటున్నారు గానీ నికరంగా మాత్రం 16 శాఖలకు మాత్రమే రెడీ అయ్యాయని చెబుతున్నారు.
మిగిలిన వాటికి భవనాలున్నాయి గానీ, ఆఫీసు అవసరాలకు తగినట్టుగా మరమ్మతులు చేస్తున్నారని సమాచారం. అవెప్పటికి పూర్తవుతాయో తెలీదు. ఎందుకంటే ప్రభుత్వం నుంచి నిధులు రావాలంటే సవాలక్ష ఫార్మాల్టీస్ పూర్తి కావాలి. అవి జరగాలంటే ఈ నెలరోజులు సరిపోవని అంటున్నారు.
అయితే 35 శాఖలకు సంబంధించి మిలీనియం టవర్లు ఏ, బీలో సీనియర్ అధికారులు, ప్రజా ప్రతినిధులకు ముందుగా వసతి కల్పించాలని నిర్ణయించారు. ఈ మేరకు అక్కడ మరమ్మతులుంటే చేయాలని ఏపీ సాధారణ పరిపాలనా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో 1.75 లక్షల చదరపు అడుగులను వినియోగించుకోవాలని ఉత్తర్వుల్లో సూచించింది.
రుషికొండ, ఇంకా ఆంధ్రా యూనివర్సిటీలో పలు భవనాలను 35 శాఖల విభాగాధిపతులు, వారి కార్యాలయాలు, ఇంకా విడిది అవసరాలకు కేటాయించింది. చినగదిలి, ఎండాడ, హనుమంతవాక ప్రాంతాల్లో ఇతర శాఖలకు భవనాలు కేటాయించారు. జీఏడీ, ఆర్థిక, గ్రామవార్డు సచివాలయ, ఇంధన శాఖలకు ఇంకా ఎక్కడనేది తెలియజేయలేదు. అధికారుల కమిటీ సిఫార్సుల మేరకు ప్రభుత్వ శాఖలకు భవనాలు కేటాయించినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే సీఎం క్యాంపు కార్యాలయం ఎక్కడనేది ఆ ఉత్తర్వుల్లో పేర్కొనలేదు.
ఇప్పుడు కేవలం 16 శాఖలకు సంబంధించి మాత్రమే వసతిని గుర్తించారు. మిగిలిన శాఖలకు, ఇంకా మంత్రులు, కార్యదర్శులు, విభాగాధిపతులకు ఆయా శాఖల భవనాలకు 2, 27,287 చదరపు అడుగుల స్ధలం అవసరమని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉన్నత విద్య, హౌసింగ్, మౌలిక వసతులు, పెట్టుబడులు, కార్మిక, న్యాయశాఖ, మైనార్టీ సంక్షేమం, ప్లానింగ్, ప్రభుత్వ రంగ సంస్థలు, సాంఘిక సంక్షేమం, ఆర్టీజీలకు కావల్సిన భవనాలను వెతుకుతున్నట్టు తెలిపింది.
వీటితోపాటు బీసీ వెల్ఫేర్, పౌర సరఫరాలు, విద్యుత్, ఆర్థిక, సాధారణ పరిపాలనా శాఖలకు వసతి సమకూర్చాల్సి ఉంది. అయితే సీఎం జగన్ తొందర పెట్టడం వల్లే ఏదో కొన్ని శాఖలను తీసుకెళ్లి మమ అనిపిస్తున్నారని అంటున్నారు. అయితే ఇక్కడ కూడా సెక్రటేరియట్ గట్టిగా కడితేనేగానీ, అన్ని శాఖలు రాలేవని చెబుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు అనేసరికి అద్దెలు కూడా గట్టిగానే అడుగుతున్నారని అంటున్నారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎప్పుడో పాతికేళ్ల నాటి అద్దెలు చెల్లిస్తామంటే కుదరదు కదా.. అని పబ్లిక్ అంటున్నారు. ఒకవేళ ఎక్కువ ఇద్దామన్నా, దానికి సవాలక్ష రూల్స్, అగ్రిమెంట్స్, పాన్ కార్డు, ఐటీ లెక్కలు వీటన్నింటితో భయపడి ఎవరూ కూడా విశాఖలో ప్రభుత్వాఫీసులకి భవనాలు అద్దెకివ్వడానికి ఇష్టపడటం లేదు. ఇది అధికారులకి మూలిగే నక్కపై తాటి పండు పడినట్టయ్యింది. అటు కక్కలేక, మింగలేక, సీఎంకి చెప్పలేక ఉన్నతాధికారులు నలిగిపోతున్నారనే టాక్ బహిరంగంగా వినిపిస్తోంది. మరేం చేస్తారో చూడాల్సిందే.