AP Govt on Tomato Prices: బిగ్ టీవీ కథనం వారికి మేలు చేకూర్చింది. ప్రభుత్వం దృష్టికి సమస్య వెళ్ళింది. సమస్యకు పరిష్కారం దొరికింది. అసలేం జరిగిందంటే.. టమాటా రైతుల కష్టాలపై బిగ్ టీవీ కథనాన్ని ప్రచురించింది. ఈ కథనంపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. టమాటా ధర అమాంతం తగ్గిపోవడంతో, బిగ్ టీవీ మీ వద్ద రూపాయి ఉందా.. ఈ మార్కెట్ కు వెళ్లండి అంటూ టమాటా రైతుల కన్నీటి వ్యథను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళింది. స్పందించిన ప్రభుత్వం, టమాటా రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది.
కర్నూల్ జిల్లా పత్తికొండ మార్కెట్ వద్ద టమాటా కేజీ ధర 50 పైసలు పలికింది. దీనితో రైతుల ఆవేదన అంతా ఇంతా కాదు. అధిక దిగుబడి వచ్చినా, పెట్టుబడులు రాక రైతులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. కేజీ అర్ధ రూపాయి అంటే, తమకు లోడు తీసుకువచ్చిన ఆటో బాడుగ కూడా రాదని బిగ్ టీవీతో రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. అలాగే స్థానిక ప్రజలకు కొందరు రైతులు ఉచితంగా కూడా టమాటాలను అందజేశారు. ఇదే విషయాన్ని బిగ్ టీవీ వరుస కథనాలను ప్రచురించింది.
ఇలా బిగ్ టీవీ కథానాలపై స్పందించిన ప్రభుత్వం వెంటనే సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టింది. కర్నూలు పత్తికొండ మార్కెట్ యార్డులో టమాటా కిలో రూపాయి కంటే తక్కువకు ధర పడిపోయిందనే కథనంపై మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష నిర్వహించారు. లాభ నష్టాలు లేకుండా కిలో టమాటా రూ.8/- కి పత్తికొండ మార్కెట్ యార్డులో కొనుగోలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా మార్కెట్లలో అదే ధరకు విక్రయించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఇతర రాష్ట్రాల నుంచి టమాటా దిగుమతి, నాసిరకం టమాటా మార్కెట్లో అందుబాటులో ఉండడంతో, సాధారణ టమాటా ధరపై ప్రభావం పడిందని అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అటు రైతులకు ఇటు వినియోగదారులకు మేలు జరిగే విధంగా మార్కెటింగ్ శాఖ టమాటా కొనుగోళ్లు విక్రయాలు చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
మొన్నటి వరకు కేజీ రూపాయి, అర్ధ రూపాయి ధర పలికిన టమాటా, ప్రభుత్వం చొరవతో కేజీ రూ. 8 లు పలకనుంది. దీనితో రైతులకు కొంతైనా మేలు జరుగుతుందని ప్రభుత్వ అంచనా. అందుకే వెంటనే రాష్ట వ్యాప్తంగా ఈ ధర అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. అసలు ధర లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు ఇదొక శుభవార్తగా చెప్పవచ్చు. కాగా మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటనపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే తమ సమస్యపై పలు కథనాలను ప్రచురించిన బిగ్ టీవీ, బిగ్ టీవీ లైవ్ వెబ్ సైట్ కు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.