Cm Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో కీలక పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయి. పోలీసు వ్యవస్థను గాడిన పెట్టడానికి స్వయంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగుతున్నారు. నెల రోజుల్లో మొత్తం సీన్ మారిపోనుంది. రోజురోజుకు రాష్ట్రంలో నేరాలు, ఘోరాలు ఎక్కువ అవుతుండటం, ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు, శాంతిభద్రతలు అదుపు తప్పాయని ఆరోపణలు వస్తున్న వేళ, స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ఇక లాభం లేదని భావించిన చంద్రబాబు తానే రంగంలోకి దిగుతున్నారు. బుధవారం సీఎం అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. భేటీ అనంతరం రాజకీయ అంశాలపై అమాత్యులతో చంద్రబాబు సుదీర్ఘంగా చర్చించారు. శాంతిభద్రతలు, లా అండ్ ఆర్డర్ విషయంలో ఇక కఠినంగా వ్యవహరించాల్సిందేనని నిర్ణయించారు.
ఆ అధికారుల తీరుతోనే!
రాష్ట్రంలో ఏం జరుగుతోంది? అని కొందరు మంత్రులను అడిగి తెలుసుకున్న చంద్రబాబుకు కొన్ని ఆసక్తికర విషయాలు తెలిశాయి. వైసీపీ హయాంలో క్రియాశీలంగా వ్యవహరించిన కొందరు అధికారులు, ఇప్పుడు కీలక పదవుల్లో ఉన్నారు అనే అంశంపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ అధికారుల వల్లనే కూటమి ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని ముఖ్యమంత్రి దృష్టికి మంత్రులు తీసుకెళ్లారు. ‘పలు జిల్లాల ఎస్పీలు సరిగ్గా స్పందించడం లేదు. మేం ఫోన్లు చేస్తున్నా సరే పట్టించుకోవట్లేదు. కింది స్థాయిలో ఉన్న డీఎస్పీ, సీఐ, ఎస్సైలపై నెపం నెట్టి తప్పించుకుంటున్నారు’ అని మంత్రులు సీఎంకు వివరించారు. ఈ సమయంలో కలుగజేసుకున్న పవన్ కల్యాణ్ తాను కూడా అందుకే ఇంత తీవ్రంగా స్పందించాల్సి వచ్చిందని సీఎంతో అన్నారు. సోషల్ మీడియాలో నడుస్తున్న అసభ్య, అవాస్తవ పోస్టులపైనా చర్చ జరిగింది. ఈ విషయంలో కూడా కొందరు పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పవన్ ప్రస్తావించారు. దీంతో ఒకింత ఆగ్రహానికి లోనైన చంద్రబాబు మొత్తం వాళ్లే చేస్తున్నారు, గత ప్రభుత్వం నుంచే పోలీసులు ఇలా తయారయ్యారన్నారు. ఇలాంటి సమస్యలపై ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూ నెల రోజుల్లోనే పోలీసు వ్యవస్థను గాడిన పెడదామని మంత్రులతో ముఖ్యమంత్రి అన్నారు.
Also read: గత ప్రభుత్వం వల్లే రోడ్డున పడ్డాం.. బీఆర్ఎస్‌కు సర్పంచుల షాక్
ప్యాలెస్‌ను ఏం చేద్దాం?
కేబినెట్ భేటీలో రుషికొండపై వైసీపీ హయాంలో కట్టిన రుషికొండ ప్యాలెస్‌పై సుదీర్ఘ చర్చ జరిగింది. ఇటీవల గంటన్నర పాటు ప్యాలెస్‌ను పరిశీలించిన చంద్రబాబు ఆ వివరాలను మంత్రులకు వెల్లడించారు. తన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ అటువంటి ఇంద్ర భవనాన్ని చూడలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కేవలం ఒక్క కబోర్డ్ కోసమే రూ.60 లక్షలు ఖర్చు చేయడం, ఫర్నిచర్, ఫ్లోరింగ్, ఆర్కిటెక్చర్ వంటి పనుల కోసం వందల కోట్లు ప్రజా ధనాన్ని ఇంతలా వృథా చేయడమా? అంటూ సమావేశంలో బాబు ఆగ్రహించారు. ఇందుకు మంత్రులు స్పందిస్తూ పేదలు, ఇల్లు లేని వారు, పల్లెల నుంచి రైతులను తీసుకువెళ్లి రుషికొండ భవనాన్ని వారికి చూపించాలని సీఎంకు సూచించారు. అప్పుడే జగన్ అంటే ఏంటి? ప్రజాధనాన్ని ఎలా దుర్వినియోగం చేశాడు? అనే విషయం ప్రజలకు తెలుస్తుందని సీఎంకు వివరించారు. అందరి మాటలను విన్న చంద్రబాబు ఈ ప్యాలెస్‌ను ఏం చేద్దాం? ఎలా వాడుకుందాం? అనేదానిపై సలహాలు ఇవ్వాలని మంత్రులను కోరారు.
మీరు మారరా?
ఇప్పటికే పలు సందర్భాల్లో కొందరు మంత్రులను చంద్రబాబు గట్టిగానే హెచ్చరించారు. ఇంకొందరికి స్వయంగా ఫోన్లు చేసి మరీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బుధవారం కేబినెట్ భేటీ ముగిసే ముందు కూడా కొందరు మంత్రులపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. ‘ మంచిగా ఉండొచ్చు కానీ మెతకగా ఉండకూడదు. పనితీరును మెరుగుపరచుకోవాలి. చాలా మంది మంత్రులకు ఇంకా సీరియస్‌నెస్ రావడం లేదు. కొంత మంది మంత్రులకు ఎన్నిసార్లు చెప్పినా తీరు మార్చుకోవడం లేదు’ అని కోపంతోనే చంద్రబాబు మాట్లాడారు. ఇందులో యంగ్ మినిస్టర్లే ఎక్కువగా ఉన్నారని తెలిసింది.
ఆమోదం ఇలా..
కేబినెట్ భేటీ అనంతరం కీలక నిర్ణయాలను మంత్రి పార్థసారథి మీడియాకు వెల్లడించారు. ‘ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ ముసాయిదా బిల్లు, ఏపీ జీఎస్టీ 2024 చట్ట సవరణ, 2014-18 మధ్య నీరు, చెట్టు పెండింగ్ బిల్లుల చెల్లింపులకు ఆమోదం తెలిపింది. ఏపీ డ్రోన్ పాలసీ ఆమోదం, రూ.వెయ్యి కోట్ల పెట్టుబడుల సాధనే లక్ష్యంగా ఈ పాలసీ తీసుకొచ్చాం. డ్రోన్ రంగంలో 40 వేల ఉద్యోగాల కల్పన దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. డ్రోన్ రంగంలో పరిశోధన చేసే విద్యా సంస్థలకు రూ.20 లక్షల ప్రోత్సాహం ఇవ్వాలని నిర్ణయించాం. ప్రపంచ డ్రోన్ డెస్టినేషన్‌గా ఆంధ్రప్రదేశ్, డ్రోన్ హబ్‌గా ఓర్వకల్లును అభివృద్ధి చేయబోతున్నాం. మొత్తం 300 ఎకరాల్లో డ్రోన్ తయారీ, టెస్టింగ్, ఆర్‌అండ్‌డీ ఫెసిలిటీ ఏర్పాటు చేస్తాం. 25 వేల మందికి డ్రోన్ పైలట్లుగా శిక్షణ ఇస్తాం. 50 డ్రోన్ నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నాం’ అని మంత్రి వివరించారు. దీంతో పాటు ఎక్సైజ్ చట్ట సవరణ ముసాయిదా, కుప్పం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ లక్ష్యాల సాధన, పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటు, సీఆర్డీఏ పరిధిని 8,352 చదరపు కిలోమీటర్లకు పెంపు, సీఆర్డీఏ పరిధిలోకి పల్నాడు, బాపట్ల అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ నుంచి 154 గ్రామాలు, 11 మండలాల్లోని 154 గ్రామాలను తిరిగి సీఆర్డీఏ పరిధిలోకి తీసుకురావడం, జ్యుడిషియల్ అధికారుల ఉద్యోగ విరమణ వయసు 61కి పెంపు, 2024 నవంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చేలా చట్ట సవరణ బిల్లులకు కేబినెట్ ఆమోదం లభించిందని మంత్రి మీడియాకు వివరించారు.