CM Chandrababu: ఐటీ రంగం తిండి పెడుతుందా అంటూ తనను అవహేళన చేశారని, సెల్ ఫోన్లను ప్రమోట్ చేస్తే, ఏదైనా ఉపయోగం ఉందా అంటూ తనపై విమర్శలు చేశారని సీఎం చంద్రబాబు అన్నారు. నేడు ఐటీ రంగం రాణిస్తున్న తీరును చూసి తనపై ప్రశంసలు కురిపిస్తున్నారని, తన ముందు చూపును నాడు అర్థం చేసుకోలేకపోయారంటూ చంద్రబాబు నాటి రోజులను గుర్తు చేసుకున్నారు.
హైదరాబాద్ లోని హెచ్ఐసీసీలో ప్రపంచ తెలుగు మహాసభలను శుక్రవారం సాయంత్రం నిర్వహించారు. ఈ తెలుగు మహాసభలకు సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలను తొలిసారిగా ప్రారంభించిన ఘనత దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావుకే దక్కుతుందన్నారు. అనంతపురం నుండి ఆదిలాబాద్ వరకు, శ్రీకాకుళం నుండి పాలమూరు వరకు ఎక్కడ ఉన్న తెలుగు వారంతా ఒక్కటే అన్నారు. తెలుగుజాతి గొప్పదనం ప్రపంచం గుర్తించిందని, అందుకే తెలుగు వారికి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ ఉందన్నారు.
ఏ విషయం పైనైనా ముందుచూపు ఉండాల్సిన అవసరం ఉందని, ఒక నిర్దిష్టమైన ఆలోచనతో భవిష్యత్తులో జరగబోయే విషయాలను తెలుగు వారందరూ ముందుగానే ఆలోచించాలని చంద్రబాబు కోరారు. అనుకున్న లక్ష్యాన్ని చేరేందుకు తగిన కృషి అవసరమని, తెలుగు వారు తలుచుకుంటే ఏదైనా సాధ్యమేనంటూ చంద్రబాబు తెలుగుజాతి గొప్పతనాన్ని వర్ణించారు. దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం గల రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందిందని, 25 సంవత్సరాల్లో ఆ గుర్తింపుకు తగిన ప్రాధాన్యత లభించిందన్నారు. తెలంగాణ, ఏపీ, ఆస్ట్రేలియా, అమెరికా ప్రపంచ నలుమూలల నుండి తెలుగు మహాసభలకు ప్రతినిధులు రావడం తనకు ఎంతో ఆనందంగా ఉందంటూ చంద్రబాబు మహాసభ నిర్వాహకులను అభినందించారు.
Also Read: YCP vs TDP: ఈ తెలివి అప్పుడేమైంది.. కూటమిపై మాజీ మంత్రి ఫైర్
ఇక ఐటీరంగంపై మాట్లాడిన చంద్రబాబు, కీలక వ్యాఖ్యలు చేశారు. 1996లో ఐటీ రంగానికి అత్యంత ప్రాధాన్యతను తమ పాలనలో ఇవ్వడం జరిగిందని, నాడు ఐటిరంగం తిండి పెడుతుందా అంటూ తనను అవహేళన చేశారన్నారు. సెల్ ఫోన్లు ప్రమోట్ చేస్తే అందరూ నవ్వారని, నేడు అవే ప్రపంచంలా మనుగడ సాగుతుందని చంద్రబాబు అన్నారు. నాలెడ్జ్ ఎకానమీలో తెలుగు వారందరూ దూసుకెళ్తున్నారని, అధునాతన టెక్నాలజీని తెలుగు వారందరూ అందిపుచ్చుకోవాలని చంద్రబాబు కోరారు.