CM Chandrababu: మంత్రుల పనితీరు గురించి సీఎం చంద్రబాబు చేసిన కామెంట్స్ పై కాస్త దుమారం రేగుతున్న విషయం తెలిసిందే. ఆ దుమారం కూడ వైసీపీకి చెందిన కొందరు నేతలు.. అదేపనిగా ట్రోలింగ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు కాస్త భిన్నంగా లోకేష్, పవన్ లకు అభినందనలు తెలిపారు. ప్రస్తుతం మంత్రులకు ఇచ్చిన పనితీరు ర్యాంకులు హాట్ టాపిక్ గా మారిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు స్పందించారు.
నిన్న కేబినెట్ భేటీ అనంతరం ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో మంత్రులకు ర్యాంకులు కేటాయించారు సీఎం చంద్రబాబు. తాను ఆరో స్థానంలో ఉన్నట్లు ప్రకటించిన సీఎం చంద్రబాబు, మిగలిన మంత్రుల ర్యాంకులను కూడ ఉన్నది ఉన్నట్లు చెప్పేశారు. పాఠశాల విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎనిమిదో స్థానంలో, డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ అటవీ శాఖ మంత్రి హోదా లో గల పవన్ కళ్యాణ్ పదో స్థానంలో ఉన్నట్లు చంద్రబాబు ప్రకటించారు. మొత్తం కేబినెట్ లో ఫైళ్ల క్లియరెన్స్ కు సంబంధించి రాష్ట్ర న్యాయశాఖ మంత్రి మహమ్మద్ ఫరూఖ్ మొదటి స్థానంలో ఉండగా, చివరి స్థానంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఉన్నారన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూఖ్ ను సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు.
అలా మంత్రులకు ర్యాంకులు కేటాయించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో తాజాగా చంద్రబాబు వివరించారు. శుక్రవారం చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రజలు అపారమైన నమ్మకంతో 2024 ఎన్నికల్లో 93 స్ట్రైక్ రేట్ తో చారిత్రాత్మక తీర్పును ఇచ్చి గెలిపించారన్నారు. వారి ఆశల్ని, ఆకాంక్షల్ని నెరవేర్చేందుకు తొలిరోజు, తొలిగంట నుంచి ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వ పాలనలో విధ్వంసమైన వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు శాయశక్తులా కష్టపడుతున్నామని, పింఛన్ల పెంపు, ఉచిత గ్యాస్, అన్న క్యాంటీన్లు వంటి పథకాలతో సంక్షేమం అమలు చేస్తూనే…మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల సాధనతో అభివృద్దివైపు అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. ఎదురవుతున్న సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొని సుపరిపాలనతో సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని, ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని పునరుద్ఘాటించారు.
అయితే ఈ లక్ష్యాలను వేగంగా చేరుకోవాలంటే ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరూ కష్టపడాలి. టీమ్ వర్క్‌గా పని చేసినప్పుడే ఉత్తమ ఫలితాలు సాధించగలమని తాను విశ్వసిస్తానన్నారు. అసాధారణ, వేగవంతమైన పనితీరు చూపితే తప్ప.. విధ్వంస రాష్ట్రంలో పునర్నిర్మాణ ఫలితాలను ప్రజలకు చూపలేం. అందుకే ఎప్పటికప్పుడు ప్రతి ఒక్కరు టీం స్పిరిట్ తో పనితీరుపై సమీక్షించుకుని పనిచేయాలన్నదే నా ఆలోచన. అందులో భాగంగానే ఫైళ్ల క్లియరెన్స్ లో మంత్రులకు ర్యాంకులు ఇచ్చినట్లు చంద్రబాబు ప్రకటించారు.
దస్త్రాల పరిష్కారంలో నిన్న విడుదల చేసిన ర్యాంకులు ఎవరినీ ఎక్కువ చేయడానికి కాదు.. ఎవరినీ తక్కువ చేయడానికి కాదు. ఎవరు ఏ స్థానంలో ఉన్నారనేది చెప్పడం ద్వారా తమతో తాము పోటీ పడటంతో పాటు, ఒకరితో ఒకరు పోటీ పడి పనిచేయడానికి, పాలనలో వేగం పెంచేందుకు చేసిన ప్రయత్నమే ఇది. ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో నేను కూడా నా స్థానాన్ని మరింత మెరుగుపరుచుకోవాల్సి ఉందని బాబు అభిప్రాయ పడ్డారు. ‘పీపుల్ ఫస్ట్’ విధానంతో తనతో పాటు కేబినెట్ సహచర మంత్రులంతా పనిచేస్తున్నామని, లక్ష్యాల సాధనకు అడుగులు వేస్తున్నామన్నారు. గ్రామ స్థాయిలో చిరు ఉద్యోగి నుంచి సీఎం వరకు అంతా కష్టపడి సమిష్టిగా పనిచేస్తేనే ప్రజల సమస్యలు, కష్టాలు తీర్చి… సమస్యల సుడిగుండంలో ఉన్న రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెడతామని బాబు అన్నారు. ప్రతి ఒక్కరూ సానుకూల దృక్పథంతో శాఖల్లో అత్యున్నత ప్రతిభ చూపిస్తారని ఆశిస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటన విడుదల చేశారు.