CM Chandrababu: గత వైసీపీ పాలనపై మరోమారు సీఎం చంద్రబాబు సీరియస్ కామెంట్స్ చేశారు. కూటమి ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణ ఉందని, గత ప్రభుత్వానికి క్రమశిక్షణ అనే మాటే తెలియదంటూ చంద్రబాబు అన్నారు. చిత్తూరు జిల్లాలో శనివారం పర్యటించిన సీఎం చంద్రబాబు.. పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో చంద్రబాబు ప్రసంగించారు.
చిత్తూరు జిల్లా జీడి నెల్లూరు బీసీ కాలనీలో మార్చి ఒకటో తేదీని పురస్కరించుకుని ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. స్థానికంగా పెన్షన్ లబ్దిదారుడైన కల్లుగీత కార్మికుని ఇంటి వద్దకు వెళ్లిన చంద్రబాబు, కుటుంబ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తన ఇద్దరు మనవరాళ్ల గురించి ఆ కుటుంబ సభ్యులు తెలిపి ఆదుకోవాలని కోరగా.. ఒకొక్కరికి రూ. 2 లక్షల చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ చేసేలా సీఎం ఆదేశాలు జారీ చేశారు.
అంతేకాకుండా మిషన్ వాత్సల్య పథకం కింద ఒకొక్కరికి ప్రతినెల రూ. 4000 చొప్పున ఇద్దరు ఆడపిల్లలకు మొత్తం రూ. 8000 లను 18 సంవత్సరాలు నిండే వరకు అందించాలని అధికారులకు సీఎం ఆదేశించారు. తమ ఇంటికి వచ్చిన సీఎం పెన్షన్ అందించడమే కాక, తమకు ఆర్థిక భరోసా కల్పించడంపై కల్లుగీత కార్మికుని కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం నిర్వహించిన సభలో సీఎం మాట్లాడుతూ.. ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంటుందని మరో మారు సభలో ప్రస్తావించారు. ప్రతినెలా ఒకటో తేదీనే తాము పెన్షన్లను అందజేస్తున్నామని, ఈ ఏడాది మూడు లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టామన్నారు. రాష్ట్రంపై 10 లక్షల కోట్ల అప్పు ఉన్నప్పటికీ ఒకవైపు అప్పుల పై వడ్డీ చెల్లిస్తూనే రాష్ట్ర అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని కొనసాగించే పరిస్థితి ప్రస్తుతం ఉందన్నారు. దేశ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున పెన్షన్లను పంపిణీ చేసిన ఘనత ఏ రాష్ట్రానికి లేదన్నారు.
గత వైసీపీ ప్రభుత్వం పెన్షన్లను రూ. 3000 చేసిందని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రూ. 4000 పెంచామన్నారు. దివ్యాంగుల పెన్షన్ ను రెట్టింపు చేసి వారికి తమ ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. గడిచిన ఐదేళ్లు ప్రజలు అనేక బాధలు పడ్డారని, అందుకే కూటమికి ఎన్నికల్లో బ్రహ్మరథం పట్టారన్నారు. తమ ప్రభుత్వం అప్పు కోసం ప్రయత్నిస్తే రుణాలు ఇచ్చే పరిస్థితి కూడా ప్రస్తుతం లేదన్నారు. మాజీ సీఎం జగన్ అధికారంలో ఉన్న సమయంలో ఇష్టా రీతిన ఆర్థిక క్రమశిక్షణ పాటించకుండా పాలన సాగించారని, అందుకే రాష్ట్ర ప్రభుత్వం అప్పుల కుప్పగా మారిందన్నారు.
Also Read: Posani Health issue: పోసానికి సీరియస్.. జైలు అధికారులు ఏం చేశారంటే?
ఏపీ బడ్జెట్ లో అన్ని రంగాలకు ప్రాధాన్యత ఇచ్చామని, ప్రజా సంక్షేమం కోసం కూటమి పాటుపడుతుందన్నారు. కేంద్రం ఇస్తున్న సహకారంతో రాష్ట్రం మరింతగా అభివృద్ది పథంలో నడుస్తుందన్నారు. రాష్ట్రానికి ఎన్నో పరిశ్రమలు రానున్నాయని, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయన్నారు. అలాగే యువతకు నైపుణ్యత పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, త్వరలో తల్లికి వందనం, ఆత్మీయ రైతు భరోసా వంటి పథకాలను అమలు చేస్తామన్నారు. సీఎం చంద్రబాబు తమ కాలనీకి రావడంతో ఆయనతో మాట్లాడేందుకు కాలనీ వాసులు పోటీపడ్డారు. ఆ తర్వాత స్థానిక సమస్యలను సీఎం అడిగి తెలుసుకొని, వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. సీఎం రాక సంధర్భంగా పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు.
దేశంలోనే అతి పెద్ద సంక్షేమ కార్యక్రమం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ: చంద్రబాబు
రూ.200 పెన్షన్ని రూ.2000 చేశాం
ఇప్పుడు వచ్చీ రాగానే మొదటి నెలలోనే వెయ్యి పెంచి రూ.4 వేలు పెన్షన్ ఇస్తున్నాం
దివ్యాంగుల పెన్షన్ రెట్టింపు చేసి రూ.6 వేలు ఇస్తున్నాం
– సీఎం చంద్రబాబు pic.twitter.com/ZNFcbgyZxm
— BIG TV Breaking News (@bigtvtelugu) March 1, 2025