
Ganta Srinivas Rao : ఏపీలో పొలిటికల్ హీట్ మరింత పెరుగుతోంది. ఒకవైపు వై ఏపీ నీడ్స్ జగన్ అంటూ వైసీపీ ప్రచారం చేస్తోంది. సామాజిక సాధికార బస్సు యాత్ర చేస్తోంది. మరోవైపు టీడీపీ-జనసేన ఉమ్మడి కార్యాచరణతో ముందుకెళ్లేందుకు సిద్ధమయ్యాయి. ఇప్పటికి మేనిఫెస్టోపై కసరత్తు చేసేందుకు ఇరుపార్టీల నేతలు సమావేశమయ్యారు. రాజధానిగా అమరావతిని కొనసాగించాలని నిర్ణయించారు. దీంతోపాటు మొత్తం 11 అంశాలతో మేనిఫెస్టోలో చేర్చాలని తీర్మానించారు.
మరోవైపు వైసీపీ-టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.ఈ క్రమంలోనే ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విమర్శలు గుప్పించారు. ‘వై ఏపీ హేట్స్ జగన్’ అంటూ ఓ పోస్టర్‌ను ట్వీట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల ఇవే అంటూ చాలా అంశాలను ఫోటోలో పొందుపర్చారు.
నాలుగేళ్ల ఎనిమిది నెలల కాలంలో చేసిన ఘన కార్యాలను చెప్పడానికి ఈ ఒక్క చిత్రం సరిపోతుందని జగన్ మోహన్ రెడ్డి.. అంటూ గంటా ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. ‘ఏపీ హేట్స్ జగన్’, ‘వద్దు వద్దు.. ఈ జగన్’ ‘మళ్లీ మా కొద్దు ఈ జగన్’ అని ప్రజలు ఎందుకంటున్నారో ఇప్పటికైనా అర్థమైందా జగన్ ?’’ అని సెటైర్ వేశారు.వైసీపీ నేతలు ఏపీకి జగనే ఎందుకు కావాలి అంటూ ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో దానికి కౌంటర్ గా గంటా శ్రీనివాసరావు ఈ పోస్టర్‌ను ట్విటర్ లో ఫోటో షేర్ చేశారు.