AP Politics : టీడీపీ క్రమశిక్షణ కలిగిన పార్టీ. నేతలంతా కంట్రోల్‌లో ఉంటారు. గీతదాటే సాహసం చేయరు. కానీ, ఉమ్మడి కర్నూలు జిల్లా నేతలు అలా కాదు. సీమ పౌరుషం చూపిస్తున్నాడు. జిల్లా టీడీపీలో అంతర్గత పోరు పీక్స్‌కు చేరింది. మొన్న అఖిలప్రియ హాట్ కామెంట్లు చేయగా.. లేటెస్ట్‌గా కేఈ ప్రభాకర్ సీన్‌లోకి వచ్చారు. పబ్లిక్‌గానే మంత్రి టీజీ భరత్‌పై ఫైరయ్యారు.
భూమా.. కేఈ.. టీజీ..
కర్నూలు జిల్లాలో ఎండ వేడికంటే మహానాడు మంట పెరుగుతోంది. ఇటీవలే మినీ మహానాడు వేదికగా టీడీపీ అధిష్టానానికి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అల్టిమేటం జారీ చేశారు. తమకు తెలియకుండా ఎవరికైనా పదవులు ఇస్తే.. ఊర్లో అడుగు పెట్టనివ్వమంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు. భూమా కుటుంబం కోసం పనిచేసిన వారికి పదవులు ఇప్పిస్తామన్నారు. ఆమె మాటల మంట ఆరకముందే.. మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ మరో రచ్చ రాజేశారు. జిల్లా మహానాడుకు టీజీ భరత్ రాకపోవడం ఏంటని.. జిల్లా మంత్రి లేకుండా మహానాడు ఎలా నిర్వహిస్తారని నిలదీశారు. ఇక్కడి వరకూ ఓకే కానీ.. ఆ తర్వాతే మరింత హాట్ కామెంట్స్ చేశారు కేఈ. వైసీపీ నేతలతో కలిసి వ్యాపారాలు మానుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. రెండు నెలలు చూస్తామని, ఆ తర్వాత తానే సీన్‌లోకి దిగుతానన్నారు. తాను ఎంటరైతే ఎవరూ కాపాడలేరంటూ హెచ్చరించడం జిల్లా టీడీపీలో కలకలం రేపుతోంది.
పులి బిడ్డ అంటూ..
మాజీ మంత్రి టీజీ వెంకటేష్ బీజేపీలో చేరేటప్పుడు పులి వెళ్లిపోయింది.. పులిబిడ్డ టీజీ భరత్ టీడీపీలోనే ఉన్నారని సంతోషించాం.. ఆయన్ను గెలుపించుకున్నాం.. మంత్రిని చేసుకున్నాం.. ఆయనేమో మహానాడుకు కూడా రాలేదు అంటూ కేఈ ప్రభాకర్ డైలాగ్ వార్ స్టార్ట్ చేశారు. గతంలో తాము కూడా మంత్రులుగా పని చేశామని.. ఎప్పుడు ఎలా జరగలేదని చెప్పారు. కార్యకర్తలు నిరాశతో ఉన్నారు వారికి న్యాయం చేయాలని కోరారు.
వైసీపీతో వ్యాపారాలేంటి?
రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ మేయర్లను దించేస్తుంటే.. కర్నూలులో ఎందుకు అలా చేయలేకపోతున్నారని కేఈ ప్రశ్నించారు. టీజీకి వైసీపీ మేయర్‌కు ఒప్పందాలు ఉన్నాయా? అంటూ నిలదీశారు. అధికారంలో ఉండి, కార్పొరేటర్ల బలం కూడా ఉన్నా.. ఇంకా వైసీపీ మేయర్ కొనసాగతుండటం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి అన్నారు. మంత్రి టీజీ భరత్ తలుచుకుంటే.. మేయర్‌ను ఈజీగా పదవి నుంచి దించేయగలరని చెప్పారు. ఆయన వైసీపీ నాయకులతో కలిసి వ్యాపారాలు చేస్తున్నారని.. ప్రతిపక్ష నేతలను ఆర్థికంగా పైకి తేవద్దని హెచ్చరించారు. రెండు నెలలు చూస్తా.. ఆ తర్వాత సీన్‌లోకి దిగుతా.. మిమ్మల్ని ఎవరు కాపాడలేరంటూ వార్నింగ్ ఇచ్చారు కేఈ ప్రభాకర్. మహానాడుకు వచ్చిన టీజీ అభిమానులు వెళ్లి ఈ విషయం ఆయనకు చెప్పండంటూ సవాల్ కూడా చేశారు.
Also Read : ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు.. బీ అలర్ట్
సీమ మంటలు..
భూమా అఖిలప్రియ, కేఈ ప్రభాకర్‌ల మాటలు ఉమ్మడి కర్నూలు జిల్లాలో రాజకీయ మంటలు రేపుతున్నాయి. మేటర్ టీడీపీ అధిష్టానం దృష్టికి చేరింది. త్వరలోనే జిల్లా నేతలను పిలిపించుకుని మాట్లాడుతారని తెలుస్తోంది. సీమలో నేతల సంఖ్య ఎక్కువ. అందరూ బలమైన నాయకులే. అందుకే ఎవరికి వారే. తగ్గేదేలే.