KA Paul sensational comments on chandrababu, Pawan Kalyan: ఏపీలోని తిరుమల లడ్డూ ప్రసాదంపై దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. ఈ నేపథ్యంలో కల్తీ లడ్డూ వివాదం తాజాగా ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 740 మంది క్యాథలిక్స్ కోసం వాటికన్ ప్రత్యేక దేశంగా ఉందని, కోట్లాది మంది భక్తులు వచ్చే తిరుమల తిరుపతికి యూనియన్ టెర్రిటరీ ఉంటే తప్పేంటి అని అన్నారు. లడ్డూ కల్తీ వివాదంపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరారు.
ఏపీలో టీడీపీ కూటమి అధికారం చేపట్టి వంద రోజులు పూర్తయిందని, ఈ సమయంలో పాలన వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించేందుకు చంద్రబాబు ఈ లడ్డూ వివాదం తెరపైకి తీసుకొచ్చారని విమర్శలు చేశారు. జూలైలో నివేదిక వస్తే సెప్టెంబర్‌లో మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు వంటి నేతలు శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా మాట్లాడుతున్నారని విమర్శలు చేశారు.
లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో జరుగుతున్న కేసులో మధ్యంతర ఉత్తర్వులు కోరుతూ పిటిషన్ దాఖలు చేశానని, అలాగే బాబు, పవన్ టీటీడీ లడ్డూ విషయంపై మాట్లాడకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరినట్లు చెప్పారు. కల్తీ జరగకుండానే జరిగిందని చెబుతూ ప్రజలతోపాటు భక్తుల్లోనూ గందరగోళం సృష్టిస్తున్నారన్నారు.
నేను మొదట భారతీయుడిని అని, హిందువుగా పుట్టాను.. క్రైస్తవ మతాన్ని ఆచరిస్తానని వెల్లడించారు. నాకు మతాల కంటే ముందు మానవత్వం ముఖ్యమని, నిజానికి చంద్రబాబు హిందువు కాదని, ఆయన నాస్తికుడు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఆయన నేను ఏర్పాటు చేసిన ఎన్నో పీస్ మీటింగ్స్ కి హాజరయ్యారని, తాను దేవుడిని నమ్మనని కూడా చెప్పారని గుర్తు చేశారు.
అయితే, అలాంటి వ్యక్తి టీటీడీ గురించి మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా ఉందన్నారు. ఇక పవన్ కళ్యాణ్ గెంతమంటే గెంతుతున్నాడని, ఇటీవల ఆయన తను బాప్టిజం తీసుకున్నా.. ఇజ్రాయెల్ సందర్శించానని అంటున్నాడు. ఒకసారి ముస్లిం మతం మంచిది అన్నాడని, ఇప్పుడేమో సనాతన ధర్మం అంటూ ఊగిపోతున్నాడని ఆరోపణలు చేశాడు.
టీటీడీ లడ్డూ నేను తినను.. జిలేబీ తినను.. నేను ఎప్పుడూ వెళ్లి పూజ చేసింది లేదని, చర్చికి వెళ్ళలేదన్నారు. అలాగే మసీదుకు వెళ్ళలేదని, గుడికి సైతం వెళ్లనని. అన్ని మతాలను గౌరవిస్తానని కే ఏ పాల్ అన్నారు. చర్చిల మీద ప్రభుత్వ పెత్తనం లేదని, అలాంటి సమయంలో ఆలయాల మీద పెత్తనం దేనికి అని నేను ఎప్పుడూ ప్రశ్నిస్తూ ఉన్నానన్నారు.
ప్రజాస్వామ్య దేశమని, ఇక్కడ ప్రతి పౌరుడికి తనకు నచ్చిన మతాన్ని అనుసరించే స్వేచ్ఛ ఉందన్నారు. లడ్డు వివాదంతో టీటీడీ ప్రతిష్ఠ దెబ్బతిందని, రాష్ట్రానికి వచ్చే భక్తులు తగ్గిపోతున్నారని ఆందోళన చెందారు. లడ్డు వివాదం ద్వారా హిందువులకు, క్రైస్తవులకు మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నం జరుగుతుందని, దీనిని వెంటనే ఆపాలన్నారు. అందుకే సుప్రీంకోర్టు నుంచి గ్యాగ్ ఆర్డర్ కోరుతున్నానని వెల్లడించారు.
Also Read: ఏపీపీఎస్సీ న్యూ ఛైర్మన్, వారికే ఛాన్స్
ఇదిలా ఉండగా, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో రాత్రి ఢిల్లీలో కలిసి మాట్లాడానని కేఏ పాల్ చెప్పుకొచ్చారు. ప్రధానంగా హైడ్రా అంశంపై ఆయనతో చర్చించానని, వందల కొద్ది భవంతులను ఎలాంటి నిబంధనలు, పద్ధతులు పాటించకుండా కూల్చేస్తున్నారన్నారు.