Vangalapudi Anitha: అక్కడి వరకు వస్తే నా బిడ్డను కూడ పక్కన పెడతా.. మీకు నా స్వభావం తెలుసు.. నేనేంటో తెలుసు.. నా రాజకీయ చరిత్ర కూడ తెలుసంటూ ఏపీ హోమ్ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఇటీవల అనిత ప్రవేట్ గా ఏర్పాటు చేసుకున్న పీఏ జగదీష్ పై విమర్శలు రావడంతో, స్పందించిన మంత్రి వెంటనే అతడిని తొలగించారు. ఈ సంధర్భంగా ఇదే విషయంపై వైసీపీ కూడ విమర్శలు చేసింది. ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.
తన పీఏ వ్యవహారం కావడంతో మంత్రి అనిత కూడ స్పందించాల్సి వచ్చింది. అయితే ఆదివారం ఈ విషయంపై మంత్రి క్లారిటీ ఇచ్చారు. విశాఖపట్నం సెంట్రల్ జైల్ లో ఆదివారం మంత్రి తనిఖీలు నిర్వహించారు. జైల్లో పరిస్థితులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. విశాఖ సెంట్రల్ జైల్లో గంజాయి సరఫరా, సెల్ ఫోన్లు బయటపడ్డాయన్న వార్తలపై వెంటనే విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా అధికారులను ఆదేశించారు. విధుల్లో అలసత్వం వహించిన వారిపై నివేదిక రాగానే చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి అన్నారు.
ఈ సంధర్భంగా మంత్రి అనిత తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. మంత్రి పీఏ వ్యవహారం గురించి మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు మంత్రి క్లారిటీ ఇచ్చారు. మంత్రి మాట్లాడుతూ.. తాను ఎప్పుడు కూడ నిజాయితీ రాజకీయాలకు తావిస్తానన్నారు. తన పీఏ వ్యవహారం వెలుగులోకి రాకముందే, తాను అతనిని తొలగించినట్లు మంత్రి తెలిపారు. ప్రవేట్ పీఏ కావడంతో నిర్ధాక్షిణ్యంగా తొలగించానన్నారు. గతంలో తనకు కూడ ఫిర్యాదులు వచ్చాయని, పలుమార్లు హెచ్చరించినట్లు మంత్రి తెలిపారు.
Also Read: Nara Lokesh: ఆ అప్పులతోనే మాకు పెద్ద తంట.. లోకేష్ కామెంట్
చివరికి ఏ మాత్రం మార్పు రాకపోవడంతో తొలగించానన్నారు. అలాగే తన బిడ్డ కూడ అవినీతికి పాల్పడితే తప్పక పక్కన పెట్టేందుకు కూడ వెనుకడుగు వేయనన్నారు. ప్రజా సంక్షేమం కోసం రాజకీయాలలోకి వచ్చినట్లు, సీఎం చంద్రబాబు లక్ష్యానికి అనుగుణంగా తాము అహర్నిశలు శ్రమిస్తున్నామన్నారు. మొత్తం మీద గత కొద్దిరోజులుగా వివాదంగా మారిన తన పీఏ వ్యవహారానికి సంబంధించి మంత్రి అనిత ఫుల్ స్టాప్ పెట్టారని చెప్పవచ్చు.