Pastor Praveen Pagadala death : పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మృతి కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమైన చర్చకు దారితీసింది. ఆయన వాస్తవంగా రోడ్డు ప్రమాదంలో మృతిచెందారా? లేక మరెవరైనా ఆయనను హత్య చేశారా? అనే అనుమానాల దృష్ట్యా పోలీసులు తీవ్రంగా దర్యాప్తు చేపట్టారు.
శనివారం (ఏప్రిల్ 12) ఉదయం 10.30 గంటలకు రాజమండ్రిలో పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సమావేశంలో ఐజీ అశోక్ కుమార్, ఎస్పీ నరసింహ కిషోర్ పాల్గొని ఈ కేసులోని ముఖ్యమైన అంశాలను వెల్లడించనున్నారు.
అయితే గత నెల 24న రాజమండ్రి సమీపంలో మృతి చెందిన పాస్టర్ ప్రవీణ్ పగడాల ఘటనపై క్రిస్టియన్ సంఘాలు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశాయి. హైదరాబాద్ నుండి బుల్లెట్ బైక్‌పై విజయవాడ నుంచి రాజమహేంద్రవరానికి ప్రయాణిస్తున్న ప్రవీణ్, మార్చి 24న అర్ధరాత్రి అనుమానాస్పదంగా మృతిచెందిన విషయం తెలిసిందే. మొదటినుంచి పోలీసులు ఇది రోడ్డు ప్రమాదమేనని చెబుతుండగా, క్రైస్తవ సమాజం మాత్రం ఈ వాదనను తిరస్కరిస్తూ, ఆయనను ఎవరైనా హత్య చేసి రోడ్డు ప్రమాదంగా మలిచారని ఆరోపిస్తోంది.
నిందితులను పట్టుకుని నిజాలను వెలికితీయాలని క్రైస్తవ సంఘాలు డిమాండ్ చేశాయి. దీనిపై ఆంధ్ర ప్రదేశ్ సీఎం చంద్రబాబు స్పందించి పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని, నిజాలు వెలికితీయాలని పోలీసులకు ఆదేశించారు. సీఎం ఆదేశాల ప్రకారం.. పోలీసులు ఈ కేసును అనుమానాస్పద మృతిగా నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.
Also Read: తిరుమల గోశాల.. ఆఖరికి ఆవులపై కూడా అబద్ధాలేనా..?
ఈ కేసు సంబంధించి, మాజీ ఎంపీ హర్ష్ కుమార్ గతంలో సంచలన ఆరోపణలు చేశారు. “పాస్టర్ ప్రవీణ్‌ను హత్య చేసి రోడ్డు పక్కన పడేసి, దాన్ని రోడ్డు ప్రమాదంలా చూపించేందుకు ప్రయత్నించారు” అని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. పోలీసులు విచారణను తప్పుదోవ పట్టిస్తున్నారనీ, తన వద్ద ఆధారాలు ఉన్నాయని తెలిపారు. దీనిపై స్పందించిన పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. హర్ష్ కుమార్ విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. కానీ ఆయన రాకపోవడంతో ఆయనపై కేసు నమోదు చేశారు.
కేసులో కీలక విషయాలను వెల్లడించిన తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ
ఎస్పీ నరసింహ కిషోర్ ఇంతకుముందు మీడియాతో మాట్లాడుతూ.. ఈ కేసును అనుమానాస్పద మృతిగా దర్యాప్తు చేస్తున్నామని, రెండు సీసీ కెమెరాల ఫుటేజీలు లభ్యమయ్యాయని చెప్పారు. సోమవారం రాత్రి 11:42కి ప్రవీణ్ బుల్లెట్ బైక్‌ను ఐదు వాహనాలు, ఒక రెడ్ కలర్ కారు దాటినట్టు గుర్తించామని చెప్పారు. పాస్టర్ ప్రవీణ్ మృతదేహం రాజమహేంద్రవరం శివారులోని కొంతమూరులో కనిపించింది. ప్రమాదం రాత్రి 11:31 నుంచి 11:42 సమయంలో జరిగింది. ఆ 12 నిమిషాలు ఈ కేసులో కీలకమని ఎస్పీ తెలిపారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌తో ఆధారాలు సేకరించి, పోస్టుమార్టం కూడా నిర్వహించారని చెప్పారు.