PawanKalyan counter: విజయవాడ వరదలపై జరిగిన, జరుగుతున్న పరిస్థితులపై వివరణ ఇచ్చారు డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్. బుడమేరు పరివాహక ప్రాంతం 90 ఆక్రమణలకు గురైందని, అదే విజయవాడకు శాపంగా మారిందన్నారు. నిర్మించిన ఇళ్ల డ్రైనేజీ వాటరు ఎక్కడకు వెళ్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొందన్నారు.
బుధవారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. వైసీపీ నేతలకు చురకలు అంటించారు. ఆర్థిక ఇబ్బందులు, చాలా సమస్యలున్న సమయంలో విపత్తు వచ్చిందన్నారు. ఇలాంటి విపత్తుల సమయంలో సీఎం చంద్రబాబు అనుభవం గురించి బలంగా తెలుస్తోందన్నారు.
మంగళవారం ఇంట్లో కూర్చొని విజయవాడలో జరుగుతున్న వరద సహాయచర్యలపై మాజీ మంత్రి రోజా విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో ఆమె పేరు ఎత్తకుండా తనదైనశైలిలో కౌంటర్ ఇచ్చారు డిప్యూటీ సీఎం. ఇంట్లో కూర్చొని ఎవరినైనా విమర్శించడం తేలికన్నారు. వైసీపీ నేతలు మాట తీరు మార్చుకోవాలని.. విమర్శించడం కంటే బయటకు వచ్చి సహాయక చర్యల్లో పాల్గొనాలని కోరారు.
ALSO READ: నిన్న విజయవాడ.. నేడు రాజమండ్రి.. పోటెత్తుతున్న గోదావరి
వైసీపీ అధికారంలో ఉండగా ఇరిగేషన్ ప్రాజెక్టులకు కనీసం నిధులు కేటాయించలేదని గుర్తు చేశారు డిప్యూటీ సీఎం. గేట్లు దానికి సంబందించిన లాక్ కూడా పని చేయలేదన్నారు. కనీసం వాటికి నిధులు కేటాయించలేదని తూర్పారబట్టారు.
ఈ వరదల్లో 29 మంది చనిపోయారని, ఇద్దరు గల్లంతు అయినట్టు తెలిపారు. లక్షా 60వేల హెక్టార్లలో పంట నష్టం, ఉద్యానవన పంటలు 18 వేల హెక్టార్లలో డ్యామేజ్ జరిగిందన్నారు. 200 జంతువులు చనిపోయాయని వీలైనంత త్వరగా హెల్త్ క్యాంపులు పెడుతున్నట్లు చెప్పుకొచ్చారు.
వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ అధికారులతో సమీక్షిస్తున్నారని, రెస్క్యూ టీమ్‌లు తమపనిలో నిమగ్నయ్యాయని తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో రోడ్లు, గట్లు తెగిపోయాయని పర్మినెంట్ రిపేర్లు కోసం బడ్జెట్‌లో కొంత కేటాయిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. హెలికాప్టర్లు, డ్రోన్ల ద్వారా బాధితులకు ఆహారం అందజేశామన్నారు.