Sajjala Ramakrishna: మావిగన్ అనగానే సీఎం చంద్రబాబు ఉలిక్కి పడుతున్నారని వైసీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. మావిగన్ స్టాండ్ తోనే వచ్చే ఎన్నికల్లో వైసీపీ బరిలోకి దిగుతుందని వైసీపీ అధినేత జగన్ ప్రకటించిన నేపథ్యంలో సజ్జల మీడియాతో మాట్లాడారు. అమరావతిపై కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు చెప్తున్న అమరావతి అసాధ్యమైందని సజ్జల అన్నారు. దాంట్లో 10 శాతం ఖర్చుతోనే మావిగన్ ను అభివృద్ధి చేసే వీలుంటుందని పేర్కొన్నారు.
అమరావతి కోసం చంద్రబాబు పెట్టాలనుకుంటున్న రూ.2 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టే ప్రాంతంలో విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం ఉన్నాయా? అని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. కానీ మావిగన్‌లో విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం ఉన్నాయన్నారు. ఇప్పటికే వెస్ట్రన్ బైపాస్ రావడంతో.. సహజంగానే అమరావతి అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ భూమి అయితే రాజధాని నిర్మాణం బెటరని వైఎస్. జగన్ గతంలో చెప్పారని సజ్జల గుర్తుచేశారు. అయితే అమరావతిలో అవినీతి, దోపిడి ఎక్కువ కావడంతో పాటు రాష్ట్రానికి ఆర్థికభారం అయినందున మావిగన్ ప్రతిపాదన జగన్ తీసుకొచ్చారని స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రజల డబ్బును వృథా చేయొద్దన్నందుకు ప్రస్తుతం జగన్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారని సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మాట మార్చింది జగన్ కాదు, కూటమి నాయకులే’ అని దుయ్యబట్టారు. గతంలో జగన్ చేసిన 3 రాజధానుల ప్రతిపాదనలో అమరావతి అలాగే ఉందని గుర్తుచేశారు. అమరావతి ప్రాధాన్యతను వైసీపీ ప్రభుత్వం ఏమాత్రం తగ్గించలేదని పేర్కొన్నారు. రాజధాని విషయంలో చంద్రబాబుకే స్థిరత్వం లేదన్న సజ్జల.. అవినీతి కోసమే రాజధానిని ముందుకు తీసుకెళ్తాన్నారని ఆరోపించారు. అమరావతి పేరిట చంద్రబాబు చేస్తున్న ఖర్చులు బాధ్యతారాహిత్యమైనవని మండిపడ్డారు. రాష్ట్రం పట్ల స్పృహలేని వారు మాత్రమే ఇలా చేస్తారని దుయ్యబట్టారు.
మరోవైపు గతంలో అమరావతికి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్, సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహరావు, దగ్గుబాటి పురంధేశ్వరి చేసిన వ్యాఖ్యలను సజ్జల వినిపించారు. మాటలు మారుస్తోంది ఎవరు? అంటూ ప్రశ్నించారు. అమరావతిలో రూపాయి అయ్యే చోట వంద రూపాయలు ఎందుకు ఖర్చు చేస్తున్నారని నిలదీశారు. ఏ పనీ చేయకపోయినా రూ.47 వేల కోట్ల అప్పులు తెచ్చారని ఆరోపించారు. రూ.60 వేల కోట్ల పనులు అప్పగించేశారని పేర్కొన్నారు. ఈ అప్పులతో పోర్టులు, రాయలసీమ లిఫ్ట్, మెడికల్ కాలేజీలు, వెలిగొండ నిర్వాసితుల సమస్య, పోలవరం నిర్వాసితుల సమస్య, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవన్నీ కూడా పూర్తి చేయవచ్చని సజ్జల పేర్కొన్నారు.
Also Read: నాసా తెచ్చిన వింత కాఫీ కప్పు.. బోర్లించినా, తలకిందులు చేసినా.. చుక్క కూడా వేస్ట్ కాదు!
అమరావతి గురించి ప్రస్తావించడమే తప్పు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నిస్తే, దాడులు చేస్తున్నారని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజల వాయిస్‌నే తాము వినిపిస్తున్నట్లు సజ్జల అన్నారు. ఆ హక్కును చంద్రబాబు ఎలా కాదంటారని ప్రశ్నించారు. మావిగన్ తో ఏకీభవించనివారు కూడా వైసీపీలో ఉన్నారని సజ్జల అన్నారు. కానీ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో తమ అధినేత రాజీపడటం లేదన్నారు. మరోవైపు వైసీపీకి వ్యతిరేకంగా ఫేక్ సైన్యాన్ని కూటమి నేతలు నడుపుతున్నారని సజ్జల ఆరోపించారు. అసభ్యంగా మాట్లాడటంలో వారి తర్వాతే ఎవరైనా అంటూ విమర్శలు చేశారు.
Also Read: రూ.16,350 కోట్ల పెట్టుబడి.. రెండేళ్లలో ఉత్పత్తి.. స్టీల్ ప్లాంట్‌పై చంద్రబాబు గ్యారంటీ!