
TDP 3rd List: ఏపీలో టీడీపీ శుక్రవారం మూడో జాబితా రిలీజ్ చేసింది. ఈ జాబితాలో కూడా పలువురు సీనియర్లకు మొండి చేయి చూపింది. ముఖ్యంగా మాజీ మంత్రులు కళా వెంకట్రావు, గంటా శ్రీనివాసరావు, పీతల సుజాత, దేవినేని ఉమా, ఆలపాటి రాజాలకు ఈ జాబితాలో చోటు దక్కలేదు. సీనియర్ నేతల సీట్లు ఫైనల్ చేసే ముందు నేతలతో ముందుగా చంద్రబాబు మంతనాలు జరిపినట్టు చెబుతున్నారు. కళా వెంకట్రావు, సుజాతకు నచ్చజెప్పారని అంటున్నారు. గంటా శ్రీనివాసరావు మొదటి నుంచి భీమిలి కోరుతున్నారు. ఆయన్ని చీపురుపల్లి నుంచి బరిలోకి దింపాలని హైకమాండ్ ఆలోచన చేస్తోంది.
మైలవరం నుంచి వసంత కృష్ణప్రసాద్ కు టికెట్ కేటాయించడంతో మాజీ మంత్రి దేవినేని ఉమా సందిగ్ధంలో పడిపోయారు. మరో రెండు రోజుల్లో జాబితా విడుదల అవుతుందనగా తన ఆవేదనను సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అప్పటికే టికెట్ కష్టమనే భావన దేవినేని ఉమాలో కనిపించింది. శుక్రవారం సాయంత్రం లేదా శనివారం దేవినేని ఉమామహేశ్వరరావు, ఆలపాటి రాజాలపై దృష్టి పెట్టనున్నారు. వీళ్లను బుజ్జగించేందుకు ఇప్పటికే పలువురు సీనియర్లు రంగంలోకి దిగారు. ఇంకా టీడీపీ తరపున ఐదు అసెంబ్లీ, నాలుగు పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సివుంది. ఓవరాల్ గా చూస్తే.. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి నుంచి 31 అసెంబ్లీ, 11 పార్లమెంట్ సీట్లకు ప్రకటన రావాల్సివుంది.
జనసేన ఇప్పటికే ఆరు అసెంబ్లీ, ఒక పార్లమెంట్ సీటును ప్రకటించింది. తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్, విజయనగరం జిల్లా నెల్లిమర్ల నుంచి లోకం మాధవి, అనకాపల్లి నుంచి కొణతాల రామకృష్ణ, తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నుంచి బత్తుల బలరామకృష్ణ, కాకినాడ రూరల్ నుంచి పంతం నానాజీ, వెస్ట్ గోదావరిలోని నిడదవోలు నుంచి కందుల దుర్గేశ్ బరిలో ఉన్నారు. ఇప్పటికే ఆయా నేతలు ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఇంకో ఎంపీ, 15 అసెంబ్లీ సీట్లను పెండింగ్ లో పెట్టింది.
Also Read: Vontimitta Crime : భార్య, కూతురిని చంపి చేనేత కార్మికుడి ఆత్మహత్య.. అతనే కారణమంటూ..
ఇక బీజేపీ విషయానికొస్తే ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. అందులో ఆరు పార్లమెంట్, 10 అసెంబ్లీ సీట్లను ప్రకటించాల్సి ఉంది. ముఖ్యంగా బీజేపీ పోటీ చేయబోయే ఎంపీ స్థానాల్లో అనకాపల్లి, రాజమండ్రి, అరకు, తిరుపతి, నరసాపురం, విజయనగరం ఉన్నట్లు తెలుస్తోంది. విశాఖ ఉత్తర, పి. గన్నవరం, తాడేపల్లిగూడెం, కైకలూరు, ధర్మవరం, జమ్మలమడుగు, విజయవాడ వెస్ట్, తిరుపతి, మదనపల్లె, కదిరి, పాడేరు నియోజకవర్గాలు కోరుతోంది.
టీడీపీ-బీజేపీల కీలకంగా మారిన సీట్లలో గన్నవరం, గుంటూరు వెస్ట్, శ్రీకాళహస్తి, తిరుపతి, విశాఖ సిటీ ఉన్నాయి. వీటిపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. బీజేపీ-జనసేన మధ్య విజయవాడ వెస్ట్, తాడేపల్లిగూడెం సీట్ల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. అంతా సజావుగా సాగితే వచ్చేవారంలో ప్రకటన రావచ్చని అంటున్నారు.