Posani Arrest: ఇటీవల రాజకీయాలకు గుడ్ బై చెప్పిన పోసాని కృష్ణమురళి అరెస్ట్ కు అందమే కారణమని టీడీపీ సోషల్ మీడియా కోడై కూస్తోంది. వాస్తవంగా పోసాని మాటల కంటే, ఆయన చాలా అందంగా ఉంటారట. ఇలా టీడీపీ సోషల్ మీడియా చెప్పడం వెనుక పెద్ద కారణమే ఉంది. ఇటీవల జగన్ చేసిన కామెంట్స్ ను బట్టి, టీడీపీ కార్యకర్తలు పోసాని గురించి కామెంట్స్ చేస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
వైసీపీ మాజీ నేత పోసాని కృష్ణమురళిని అన్నమయ్య జిల్లా పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. రాయదుర్గంలోని మైహోం భుజ అపార్ట్‌మెంట్‌లో ఉన్న పోసానిని పోలీసులు అరెస్ట్ చేసి అన్నమయ్య జిల్లాకు తరలించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను ఓ టీడీపీ నాయకుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైనట్లు తెలుస్తోంది. క్రైమ్ నంబర్ 65/2025 అండర్ సెక్షన్ 196, 353(2),111 రెడ్ విత్ 3(5) బీఎన్ఎస్ యాక్ట్ 2033 నాన్ బెయిలబుల్ కింద పోసాని సతీమణికి నోటీసు అందించిన పోలీసులు రాత్రికి రాత్రి ఏపీకి తరలించారు.
ఇప్పటికే ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ కు పోసాని కృష్ణమురళిని పోలీసులు తీసుకెళ్లి విచారించారు. ఎవరైనా రాసిన స్క్రిప్ట్ చదివారా? లేక సొంతంగా మీరు కామెంట్స్ చేశారా అంటూ పోలీసులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. మొత్తం మీద పోసాని అరెస్ట్ రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం కలిగించింది. అయితే పోసాని అరెస్ట్ తో కొందరు మద్దతుగా సోషల్ మీడియాలో స్పందిస్తుండగా, మరికొందరు పోసాని గతంలో చేసిన కామెంట్స్ ను పోస్ట్ చేస్తూ తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
వైసీపీ హయాంలో పోసాని లైన్ దాటి విమర్శలు చేశారన్న అపవాదును కూడగట్టుకున్నారు. డిప్యూటీ సీఎం పవన్ పై కామెంట్స్ చేయడమే కాకుండా, ఆయన కుటుంబ సభ్యుల పేరెత్తి మరీ విమర్శలు చేశారు. అంతేకాకుండా సీఎం చంద్రబాబును అరెస్ట్ చేసిన సమయంలో పోసాని మాట్లాడుతూ.. జైలుకు వెళితే దోమలు కుట్టక ఏం కుడతాయని కామెంట్స్ చేశారు. ఇలా పలుమార్లు లైన్ దాటి పోసాని చేసిన కామెంట్స్ ఇప్పుడు అరెస్ట్ కు కారణంగా ప్రచారం సాగుతోంది. అయితే సోషల్ మీడియాలో ఓ కామెంట్ వైరల్ గా మారింది. ఇటీవల వంశీని పరామర్శించిన జగన్ మాట్లాడుతూ.. గన్నవరం మాజీ ఎమ్మేల్యే వంశీ అందంగా ఉన్నారని, ఆ అందాన్ని చూసి ఓర్వలేక అరెస్ట్ చేశారన్నారు.
జగన్ చేసిన కామెంట్స్ ను ఇప్పుడు టీడీపీ సోషల్ మీడియా వైరల్ చేస్తోంది. పోసాని అందంగా ఉండడమే అరెస్ట్ కు కారణమా? లేక ఆయన మాటలు కారణమా అంటూ జగన్ ను ప్రశ్నిస్తున్నారు. పోసాని ఎంత అందంగా ఉన్నా, ఆయన మాటలు సభ్యసమాజం తలదించుకొనేలా ఉన్నాయని, ఆ మాటలు ఒకసారి వినాలని కోరుతున్నారు. రాజకీయాలలో విమర్శలు, ప్రతి విమర్శలు సర్వసాధారణమని కానీ అలాంటి కామెంట్స్ ఎవరూ సహించరని టీడీపీ అంటోంది.
Also Read: Posani vs Pawan: పవన్ భార్యపై దారుణమైన వ్యాఖ్యలు.. ఆ కామెంట్సే పోసాని కొంప ముంచాయా?
వైసీపీ నేతలు మాత్రం ఇది ఖచ్చితంగా కక్షపూరిత అరెస్ట్ అంటూ ఖండిస్తున్నారు. ఇప్పటికే పోసానికి వైద్య పరీక్షలు నిర్వహించగా బీపీ, షుగర్ లెవెల్ నార్మల్ గా ఉన్నాయని, కానీ గుండె సంబంధిత వ్యాధి లక్షణాలు ఉన్నాయని నిర్ధారించినట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఎవరూ ఊహించని రీతిలో పోసాని అరెస్ట్ కాగా, ఏపీలో రాజకీయం హీటెక్కింది.