AP News : పరువు కోసం ఓ టీడీపీ మహిళా కార్యకర్త ఆత్మహత్య చేసుకుంది. ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ రవితేజ ఆమెను నడిరోడ్డుపై అవమానించాడు. అందరూ చూస్తుండగానే ఆమెను అసభ్యకరంగా వేధించాడు. ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకో పోవే అంటూ అవమానించాడు. నీ అంతు చూస్తానని బెదిరించాడు. ఆ వేధింపులు తట్టుకోలేక పోయింది ఆ మహిళ. ఇంటికొచ్చి సూసైడ్ చేసుకుంది. చనిపోయే ముందు సెల్ఫీ వీడియోలో అనేక విషయాలు చెప్పింది. ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం సంగళ్లపాలెంలో జరిగిందీ విషాద సంఘటన.
పవన్ కల్యాణ్‌కు రిక్వెస్ట్
ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ రవితేజ వేధింపులు తట్టుకోలేక.. అబ్బూరి మాధురి ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. రవితేజ ఆమెను అసభ్యకరంగా, వ్యక్తిగతంగా దూషించడంతో ఆవేదనకు గురైంది. అవమానం తట్టుకోలేక పురుగులమందు తాగింది. ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందింది. సూసైడ్‌కు ముందు సెల్ఫీ వీడియోలో తీసుకుని.. తన చావుకు గల కారణాలు, రవితేజ వేధింపుల గురించి వివరించింది బాధితురాలు. ఫీల్డ్ అసిస్టెంట్ రవితేజను క్షమించవద్దని, అతనిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యను, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కోరింది.
టీడీపీ కార్యకర్త పౌరుషం
తాను గతంలో స్కూల్ టీచర్‌గా పని చేశానని.. ఆ తర్వత నెట్ సెంటర్ పెట్టుకున్నానని చెప్పింది. ఇంజినీరింగ్ చదువుతున్న కొడుక్కు ఖర్చుల కోసం అవసరం అవుతాయని.. ఇప్పుడు తాను రూ. 300 కోసం కరువు పనికి వెళ్తున్నానని తెలిపింది. అలాంటి తనను రవితేజ అందరిముందు ఘోరంగా అవమానించినా ఎవరూ పట్టించుకోలేదని వాపోయింది. కమ్మ పుట్టుక పుట్టిన తాను.. ఆ అవమానాన్ని భరించలేనని.. అందుకే చనిపోతున్నానని చెప్పింది. తాను టీడీపీకి వీరాభిమాని అని.. ఓ టీడీపీ కార్యకర్త పౌరుషానికి చనిపోయిందనే పేరు తనకు ఉండాలని కోరుకుంది. ఎమ్మెల్యే సౌమ్య డేరింగ్ అండ్ డ్యాషింగ్ అని.. తన చావుకు కారణమైన రవితేజ అంతు చూడాలి సౌమ్యక్క అంటూ వేడుకుంది. తన కూతురి బాధ్యత కూడా ఎమ్మెల్యే సౌమ్యనే చూసుకోవాలని కోరింది. కొంతమందికి బలుపు ఎక్కువైందని.. ఎవడేం పీకుతారులే అని అనుకుంటున్నారని.. అలాంటి వారిని పార్టీ గుర్తించాలంది. ఉపాధి హామీ పథకంలో అనేక అక్రమాలు జరుగుతున్నాయని.. రవితేజ లాంటి ఫీల్డ్ ఆఫీసర్లు డబ్బులు దొబ్బేస్తున్నారని.. అలాంటి వారిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దృష్టి పెట్టాలని కోరింది.
ఎమ్మెల్యే సౌమ్యక్క.. వాడి అంతు చూడాలి..
అందరి ముందు తన మీదకు వచ్చాడని.. తన అంతు చూస్తానని రవితేజ నడిరోడ్డుపై బెదిరించాడు.. వాడి అంతు తన భర్త, ఎమ్మెల్యే సౌమ్యక్క చూస్తారని చనిపోయేముందు సవాల్ చేసింది అబ్బూరి రాధిక. రావణాసురుడు, కౌరవులు ఆడదాని జోలికి వచ్చినందుకు కుక్క చావు చచ్చారని.. తన చావుతో రవితేజకు కూడా అలాంటి గతే పడుతుందని ఛాలెంజ్ చేసింది బాధితురాలు. అబ్బూరి రాధిక సెల్ఫీ వీడియో ఏపీలో సంచలనంగా మారింది.