Tirumala News: తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎంత చేసినా తక్కువే. ఎందుకంటే సుదూర ప్రాంతాల నుంచి నిత్యం స్వామి దర్శనానికి వస్తుంటారు. భక్తుల్లో ఆధ్యాత్మిక భావనలు పెంచడానికి హిందూ ధర్మం గురించి అవగాహన కల్పించడానికి తమవంతు ప్రయత్నం చేస్తోంది టీటీడీ. శ్రీవారిని దర్శించుకునే భక్తులకు స్వామి చరిత్రకు సంబంధించిన పుస్తకాలను ఉచితంగా ఇవ్వాలని భావిస్తోంది.
కీలక నిర్ణయం తీసుకుంది టీటీడీ. శ్రీవారిని దర్శించుకునే భక్తులకు స్వామికి సంబంధించిన పుస్తకాలను ఉచితంగా ఇవ్వాలని ఆలోచన చేసింది. హిందూ ధర్మప్రచార పరిషత్ ద్వారా ఈ కార్యక్రమం త్వరలో అమలుకానుంది. దీనివల్ల భక్తుల్లో ఆధ్యాత్మిక భావనలు పెంచడానికి బాగుంటుందని అంచనా వేస్తోంది. హిందూ ధర్మం గురించి అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తోంది.
వేంకటేశ్వర స్వామిపై పుస్తకాలు, దేవతల స్తోత్రాలు, భగవద్గీత, భజనలు వంటి పుస్తకాలు ఇవ్వనున్నారు. దాతల సహాయంతో వాటిని అందించాలని ఛైర్మన్ బీఆర్ నాయుడు ఆలోచన. తొలుత తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఆయా పుస్తకాలు ఇవ్వనున్నారు. ఆ తర్వాత రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల్లో వాటిని పంచనున్నారు.
ఇలాంటి కార్యక్రమాల వల్ల భక్తుల్లో ఆధ్యాత్మిక చింతన పెరుగుతుందని భావిస్తోంది. పుస్తకాలను ప్రసాదం రూపంలో భక్తులకు అందజేయనున్నారు. వాటిలో కర్తవ్యం దైవమాహ్నికమ్, శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్రం, శ్రీనివాసుని దివ్య కథ, భజ గోవిందం, లలితా సహస్రనామ స్తోత్రం, రథ సప్తమి విశేషత, కళ్యాణ తేజో దీపిక వంటి పుస్తకాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ALSO READ: శ్రీకాళహస్తిలో రెండు గ్రూపుల మధ్య అర్ధరాత్రి ఫైటింగ్
తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. మంగళవారం ఉదయం ఏడు గంటలకు స్వామి ఉచిత దర్శనానికి దాదాపు 20 గంటలు పడుతుంది. భక్తులతో కంపార్టుమెంట్లు దాదాపుగా నిండిపోయాడు. కొద్దిరోజులపాటు ఈ రద్దీ ఇలాగే కొనసాగవచ్చని టీటీడీ వర్గాలు భావిస్తున్నాయి.
మరోవైపు తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో జ్యేష్ఠాభిషేకంలో కవచ ప్రతిష్ట ఘనంగా జరిగింది. సోమవారం ఉదయం 8 గంటల నుంచి 10 వరకు శతకలశ స్నపనం, మహాశాంతి హోమం చేపట్టారు. 10 గంటల తర్వాత కల్యాణ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజ స్వామివారి ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం, సమర్పణ, ఆరగింపు, అనుగ్రహం, బ్రహ్మోఘోషలను కార్యక్రమాలు నిర్వహించారు.
సాయంత్రం ఐదున్నర గంటలకు ఉభయ నాంచారులతో ఆలయ నాలుగు మాఢ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలలో సోమవారం నుండి మొదలయ్యాయి. మంగళవారం ఉదయం ఉదయం గ్రంథి పవిత్ర సమర్పణ, సాయంత్రం యాగశాల పూజ, హోమం చేపట్టనున్నారు. జూలై 9న మహా పూర్ణాహుతి, కలశోధ్వాసన, పవిత్ర సమర్పణ జరగనుంది. సాయంత్రం ఆరు గంటలకు కపిలేశ్వరస్వామి- కామాక్షి అమ్మవారుతోపాటు వినాయకుడు, సుబ్రమణ్యస్వామి పుర వీధుల్లో విహరించి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.