Turakapalem mystery: ఆ ఊరికి ఏమైంది? వరుసగా 20 మంది ప్రాణాలు ఎలా కోల్పోయారు? అంతుచిక్కని వ్యాధి బారిన పడిన తురకపాలెం గ్రామం ఇప్పుడు మిస్టరీగా మారిపోయింది. 2 నెలలుగా ఒక్కొక్కరిని మృత్యువు బలి తీసుకుంటుండటంతో స్థానికులు భయంతో వణికిపోతున్నారు. అసలేం జరుగుతోంది అక్కడ? వ్యాధి ఏంటి? దానికి నివారణ ఏమిటి? అనుమానాలు, భయాలు, గుసగుసల మధ్య రంగంలోకి దిగారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. శుక్రవారం అత్యవసరంగా వైద్యారోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి, తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. తురకపాలెం గ్రామం ఇప్పుడు వైద్యరంగానికి సవాలుగా మారింది.
గుంటూరు జిల్లా తురకపాలెం గ్రామంలో వరుసగా జరుగుతున్న మరణాలు రాష్ట్రాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. గత రెండు నెలల్లోనే 20 మంది ప్రాణాలు కోల్పోవడంతో అక్కడి ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ పరిస్థితిని సీఎం నారా చంద్రబాబు నాయుడు అత్యంత గంభీరంగా తీసుకున్నారు. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో వైద్యారోగ్య శాఖ అధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించిన ఆయన, దీనిని హెల్త్ ఎమర్జెన్సీగా పరిగణించాలని స్పష్టం చేశారు.
సమావేశంలో ముఖ్యమంత్రి ఇచ్చిన మార్గదర్శకాలు స్పష్టంగా ఉన్నాయి. శని, ఆది వారాల్లోనే ప్రత్యేక వైద్య బృందాలు తురకపాలెం గ్రామంలోకి వెళ్లాలని ఆదేశించారు. ప్రతి ఒక్కరికి 42 రకాల వైద్య పరీక్షలు తప్పనిసరిగా చేయించి, సోమవారం కల్లా హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేయాలని సూచించారు. కొత్త కేసులు ఏవీ నమోదు కాకూడదని, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నవారిని వెంటనే ఆస్పత్రుల్లో చేర్పించాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమస్యను ఏకపక్షంగా చూడకుండా, అవసరమైతే ఎయిమ్స్ నిపుణులు సహా కేంద్ర వైద్య బృందాలను రప్పించుకోవాలని సీఎం ఆదేశించారు. అంతర్జాతీయ వైద్యుల సాయం కూడా తీసుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు. పీల్చే గాలి, తాగే నీరు, తినే ఆహారం, భూమి.. అన్నింటినీ పరిశీలించాలని సూచించారు. ప్రజల్లో భయం తొలగించి, నమ్మకం కలిగించడం ఇప్పుడు ప్రధాన కర్తవ్యం అని సీఎం అన్నారు.
వైద్యాధికారుల వివరాల ప్రకారం, తురకపాలెం గ్రామంలో ప్రస్తుతం ఉన్న కేసులు మెలియోయిడోసిస్ అనే వ్యాధి లక్షణాలకు దగ్గరగా ఉన్నాయన్న అనుమానం వ్యక్తమవుతోంది. ఇప్పటికే రక్త నమూనాలు ల్యాబ్‌లకు పంపించారని, 72 గంటల్లో రిపోర్టులు వస్తాయని అధికారులు సీఎం కి తెలియజేశారు. ఇంకా పరిశోధనలో మరో కోణం కూడా ఉంది. తురకపాలెంలో చాలా మంది పశుపోషణపై ఆధారపడుతున్నారు. అందువల్ల పశువుల నుంచి వ్యాధి వ్యాప్తి జరిగిందా? అనే అనుమానం కూడా వైద్య నిపుణుల్లో కలుగుతోంది.
తురకపాలెంలో డయాబెటిస్, హైపర్‌టెన్షన్, కార్డియాక్ సమస్యలు, బ్రెయిన్ స్ట్రోక్ వంటి వ్యాధులు ఎక్కువగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. అదనంగా, గ్రామంలో ఆల్కహాల్ వినియోగం అధికంగా ఉండటం, అలాగే స్టోన్ క్రషర్లు వాతావరణ కాలుష్యాన్ని పెంచడం వంటి అంశాలు కూడా ఆరోగ్య సమస్యలకు కారణమయ్యే అవకాశముందని నిపుణులు హెచ్చరించారు.
మొదట జ్వరం, దగ్గు, తర్వాత ఊపిరితిత్తులు దెబ్బతినడం వంటి లక్షణాలు బాధితుల్లో కనిపిస్తున్నాయి. యాంటిబయోటిక్స్ ను 6 వారాలు నిరంతరాయంగా వాడితే వ్యాధి నియంత్రణలోకి వస్తోందని వైద్యులు చెప్పారు. మైక్రోబయాలజీ విభాగం కూడా దీని మీద లోతుగా పరిశోధన చేస్తోంది.
Also Read: Metro news 2025: ఆ నగరానికి బూస్ట్.. రూ.15,906 కోట్ల భారీ మెట్రో ప్రాజెక్ట్.. ఇక జర్నీ చాలా సింపుల్!
ఈ వ్యాధి సాధారణంగా భూమిలో, నిల్వ నీటిలో, తడి నేలలో విస్తరిస్తుంది. ముఖ్యంగా వర్షాకాలం, వరదల సమయంలో ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. డయాబెటిస్, కిడ్నీ, లివర్ సమస్యలు ఉన్నవారు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ఈ వ్యాధికి ఎక్కువగా గురయ్యే అవకాశం ఉంటుంది. రైతులు, నీటిలో ఎక్కువగా పనిచేసే వారు కూడా రిస్క్‌లో ఉంటారు. మట్టిలో, నీటిలో ఉన్న బ్యాక్టీరియా చర్మ గాయాల ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. కాలుష్య నీరు తాగడం, ఒక్కోసారి శ్వాస ద్వారా కూడా ఈ వ్యాధి వ్యాపించవచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
గ్రామంలో వరుస మరణాలతో స్థానికులు భయంతో వణికిపోతున్నారు. ‘‘ఇంకా ఎవరెవరు బలవుతారో’’ అనే ఆందోళన ప్రతి ఇంట్లో వినిపిస్తోంది. పరిస్థితులను త్వరగా అదుపులోకి తేవాలని, ప్రజల ప్రాణాలను రక్షించాలని సీఎం ఆదేశించినందుకు కొంత ఉపశమనం కలిగింది.
మొత్తం మీద, తురకపాలెం గ్రామం 20 మరణాల మిస్టరీని ఛేదించేందుకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన కృషి చేస్తోంది. అన్ని వైద్య పరీక్షలు, రోగుల ప్రొఫైల్స్, అంతర్జాతీయ నిపుణుల సలహాలు.. ఇవన్నీ కలిపి త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం కనుగొనే ప్రయత్నం జరుగుతోంది. స్థానికులు కూడా ప్రభుత్వంపై విశ్వాసం ఉంచి, వైద్యుల సూచనలను పాటించాలని నిపుణులు చెబుతున్నారు.