Vasireddy Padma on YS Jagan: మీ చేతుల్లో పార్టీ ఉంటే, ఒక్క కార్యకర్త ఉండలేడు. మీ స్థానంలో మీరు ఇక వద్దు. మీ మంచికే చెబుతున్నా.. ఇప్పటికైనా మీ తల్లి విజయమ్మకు భాద్యతలు అప్పగించండి. వెళుతూ.. వెళుతూ నేనిచ్చిన సలహా స్వీకరించండి జగన్ అంటూ తీవ్రస్థాయిలో కామెంట్స్ చేశారు మాజీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ.
వైసీపీ ప్రభుత్వ హయాంలో వాసిరెడ్డి పద్మ అంటే తెలియని వారుండరు. ఈమె తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైసీపీకి రాజీనామా చేశారు. రాజీనామా అలా చేశారో లేదో.. ఇలా జగన్ పై వివాదాస్పద కామెంట్స్ చేశారు. తాజాగా టీడీపీలో చేరేందుకు ఆమెకు లైన్ క్లియర్ కాగా, విజయవాడలో మీడియా ముఖంగా మాట్లాడుతూ సంచలన కామెంట్స్ చేశారు. ఈసారి ఆమె కామెంట్స్ కాస్త హీటెక్కించాయని చెప్పవచ్చు.
వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ.. తాజాగా జరిగిన ఎన్నికల ఫలితాలను చూస్తే మాజీ సీఎం జగన్.. ప్రజలలోనే కాదు పార్టీ నేతల మదిలో కూడా విశ్వాసాన్ని కోల్పోయారన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో జగన్ పార్టీ బాధ్యతలు చేపట్టడం సమంజసం కాదని, తన తల్లి విజయమ్మకు పార్టీ బాధ్యతలు అప్పగించాలని వాసిరెడ్డి పద్మ సూచించారు. ఇప్పటికే పార్టీ సర్వనాశనమైందని, విజయమును అధ్యక్షురాలి హోదాలో ఉంచితే కాస్తైనా పార్టీ బ్రతుకుతుందని కూడా జగన్ కు హితవు పలికారు.
అంతేకాదు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి లక్ష్యంగా వాసిరెడ్డి పద్మ సంచలన కామెంట్స్ చేశారు. మాజీ సీఎం జగన్ ను తప్పుదోవ పట్టించిన ఘనత విజయసాయిరెడ్డి కే దక్కుతుందన్నారు. ఇటీవల సీఎం చంద్రబాబును ఉద్దేశించి వయసు పైబడిందని విజయసాయిరెడ్డి ట్వీట్ చేయడంపై స్పందిస్తూ.. చిల్లర రాజకీయాలు చేయడంలో ఎవరైనా విజయసాయిరెడ్డి తర్వాతేనంటూ విమర్శించారు. జగన్ ప్రవేశపెట్టిన ప్రతి స్కీం వెనుక ఒక స్కాం ఉందని, త్వరలోనే ఒక్కొక్కటిగా బయటకు వస్తాయని జోస్యం చెప్పారు. అందుకే విజయసాయిరెడ్డి ముందస్తు జాగ్రత్తగా డైవర్షన్ పాలిటిక్స్ కు శ్రీకారం చుట్టి, వైయస్సార్సీపి ప్రతిష్టను పూర్తిగా దిగజారుస్తున్నారని విమర్శించారు.
ఇక గత ఎన్నికల ఫలితాలపై స్పందించిన ఆమె.. పార్టీ కోసం కష్టపడ్డ నేతలకు గుర్తింపు లేకుండా చేసి, కొత్తవారిని అందలం ఎక్కిస్తే విజయం ఎలా వరిస్తుందన్నారు. వైసీపీ ఓటమికి జగన్ కారణమని, అలాగే జగన్ చుట్టూ ఉన్న కోటరీ కూడా ఓటమిలో ప్రధాన పాత్ర పోషించిందన్నారు. తాను త్వరలోనే టీడీపీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు సూచనప్రాయంగా చెప్పారు. మరి ఈ కామెంట్స్ పై వైసీపీ రియాక్షన్ ఎలా ఉంటుందో వేచి చూడాలి.