Visakhapatnam: విశాఖలో వాటర్ ఎమర్జెన్సీ ఏర్పడింది. GVMC పరిధిలో వాటర్ సప్లై నిలిచిపోవడంతో నగర ప్రజలు, పరిశ్రమలు నీటి కోసం అల్లాడుతున్నాయి. ఆప్కాస్ కార్మికులు సమ్మె బాట పట్టడమే దీనికి కారణం. దీంతో 3 లక్షల ఇంటి కులాయిలు సహా పలు కీలక పరిశ్రమలకు మంచి నీటి సరఫరా నిలిచిపోయింది. ఉదయం 5 గంటల నుంచి కులాయిలు రావాల్సి ఉన్నప్పటికీ నీటి సరఫరాకు బ్రేక్ పడింది. ఈ నేపథ్యంలో పలు కాలనీల ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
తాత్కాలికంగా నిలిపిన ప్రధాన నీటి మూలాలు:
ప్రముఖంగా ఏలేరు, తాటిపూడి, గోస్తని, గంభీరం, రైవాడ వంటి ప్రధాన జలాశయాల నుంచి.. వచ్చే నీటి సరఫరాను ఉద్యోగులు నిలిపివేశారు. జీవీఎంసీ పరిధిలోని ట్యాంకులు ఇప్పటికే ఖాళీ అయ్యాయి. ట్యాంకులను తిరిగి నింపాలంటే కనీసం.. 10 గంటల సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఉద్యోగుల నిరసన – సాంకేతిక సమస్యల హెచ్చరిక:
జీవీఎంసీ ఉద్యోగులతో కలిసి ట్యాంకులను నింపే ప్రయత్నం చేసినా, వాటర్ సప్లై శాఖ ఉద్యోగులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. తగిన అనుభవం లేని వారితో పంపింగ్ చేపడితే సాంకేతిక లోపాలు తలెత్తే ప్రమాదం ఉందని వారు పేర్కొన్నారు. నిన్న రాత్రి వరకు ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల మధ్య జరిగిన చర్చలు విఫలమవడంతో సమ్మె కొనసాగుతోంది.
ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో:
ఉదయం నుంచే ప్రజలు బకెట్లతో గుంపులుగా నీటి కోసం ఎదురుచూస్తున్నారు. పాఠశాలలు, ఆసుపత్రులు, హోటళ్లు కూడా నీటి కొరతతో బాధపడుతున్నాయి. మంచి నీళ్ళు లేక గ్రేటర్ విశాఖ జనం గగ్గోలు పెడుతున్నారు. ప్రజల ఆరోగ్య భద్రత దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తక్షణమే సమస్యకు పరిష్కారం తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే టైంలో మేయర్‌తో మరోసారి చర్చలకు వెళ్ళనున్నారు వాటర్ సప్లై ఎంప్లాయిస్ యూనియన్ నేతలు. చర్చలు సఫలం అయితేనే నీటిని విడుదల చేస్తామంటున్న ఉద్యోగులు చెబుతున్నారు.
తాత్కాలిక భద్రతా చర్యలు:
GVMC తరఫున ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నా, అవసరాన్ని దృష్టిలో ఉంచుకుంటే ఇది తక్కువగా మారే అవకాశం ఉంది. ప్రభుత్వ అధికారి స్థాయిలో సమావేశాలు జరిగి, ఉద్యోగుల డిమాండ్లపై సానుకూలంగా స్పందించేందుకు కసరత్తులు జరుగుతున్నాయి.
Also Read: ఆ స్పీడ్ లేదు, ఆ ఫైర్ లేదు.. గుడివాడలో కొడాలి సైలెంట్ ఎంట్రీ
విశాఖ నగరం ప్రస్తుతం నీటి విషయంలో.. అత్యవసర పరిస్థితిని ఎదుర్కొంటోంది. త్వరితగతిన నిర్ణయాలు తీసుకుని, ప్రజల ప్రాథమిక అవసరమైన నీటి సమస్యకు.. శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది.