ఎన్నికలైపోయి, కూటమి ప్రభుత్వం కొలువుదీరి ఏడాదిన్నర అవుతోంది. కానీ వైసీపీకి జనంలోకి వెళ్లేందుకు సరైన అవకాశం దొరకడం లేదు. రెడ్ బుక్ పేరుతో హడావిడి చేయాలని చూసినా జనం అస్సలు పట్టించుకోలేదు. సూపర్ సిక్స్ అమలుతో జనం ప్రభుత్వాన్ని సూపర్ హిట్ అంటున్నారు. ఈ దశలో కనీసం కూటమిలో అయినా లుకలుకలు పెట్టేందుకు వైసీపీ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ప్రశ్నిస్తానంటూ రాజకీయాల్లోకి వచ్చిన పవన్, సీఎం చంద్రబాబుని ప్రశ్నించడం లేదనేది వైసీపీ బాధ, ఆవేదన. అసలు డిప్యూటీసీఎంగా ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న పవన్ ప్రభుత్వాన్ని ఎలా ప్రశ్నిస్తారు. కావాలంటే సలహా ఇస్తారు, సరైన విధానంలో కలసి వెళ్దామంటారు. మరిక్కడ వైసీపీ లాజిక్ ఏంటి.. టీడీపీని, జనసేనని వేరు చేస్తే కానీ తమ పాచిక పారదు అని జగన్ బలంగా డిసైడ్ అయినట్టుంది. అందుకే ఈ అక్కసు రాజకీయాలు మొదలయ్యాయి.
కూటమితో కష్టం..
జెండాలు జత కట్టడమే మీ అజెండా అంటూ 2024 ఎన్నికల ముందు వైసీపీ శ్రేణులు హుషారుగా పాటలు పాడుకున్నాయి. కానీ జత కట్టిన జెండాలే విజయం సాధించాయి. సోలో సింహం, సింగిల్ సింహం, యుద్ధానికి సిద్ధం, వైనాట్ 175, వైనాట్ కుప్పం, వైనాట్ మంగళగిరి, వైనాట్ పిఠాపురం.. అంటూ స్లోగన్లు ఇచ్చుకోడానికే జగన్ పరిమితం అయ్యారు. అంటే ఇక్కడ వైసీపీకి ఒక విషయంలో క్లారిటీ వచ్చింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటుని కూటమి చీలిపోనివ్వలేదు, అందుకే వారికి ఘన విజయం దక్కింది. ఒకవేళ టీడీపీతో జనసేన-బీజేపీ పోటీపడినా.. సమీకరణాలు కుదరక టీడీపీ, జనసేన, బీజేపీ విడివిడిగా పోటీ చేసినా ఫలితాలు మరోలా ఉండేవేమో. పోనీ వైసీపీ ఎవరితో అయినా కలుస్తుందా అంటే జగన్ ని దగ్గరకుతీసే పార్టీ ఏదీ ఏపీలో లేదు. కమ్యూనిస్ట్ పార్టీలు కూడా కాంగ్రెస్ తో ఉంటాయి కానీ, వైఎస్సార్ కాంగ్రెస్ కి దగ్గరవ్వాలనుకోవడంలేదు. దీంతో జగన్ అనివార్యంగా సింగిల్ గా మిగిలిపోయారు. అయితే తనతోపాటు అన్ని పార్టీలు సింగిల్ గా పోటీ చేయాలని జగన్ కోరుకోవడం ఇక్కడ వింత, విడ్డూరం కూడా. అందుకే ఇప్పుడు మళ్లీ కూటమిలో లుకలుకలు పెట్టేందుకు జగన్ టీమ్ బాగా ప్రయత్నిస్తోంది.
టార్గెట్ బాబు వయా పవన్..
వైసీపీ అసలు టార్గెట్ చంద్రబాబు. అయితే ఆయన్ని టార్గెట్ చేసేందుకు పవన్ భుజంపై తుపాకీ పెట్టాలని చూస్తున్నారు జగన్. టీడీపీ-జనసేన మధ్య విభేదాలు సృష్టించేందుకు సాక్షి మీడియా, వైసీపీ అనుకూల సోషల్ మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయి. పవన్ వైఖరి వల్ల జనసేన నేతలు ఇబ్బంది పడుతున్నారని, నామినేటెడ్ పోస్టుల్లో జనసైనికులకు అన్యాయం జరుగుతోందని వారికంటే ఎక్కువగా వైసీపీ బాధపడుతోంది. అసలు పవన్ కల్యాణ్ కూడా చంద్రబాబు ముందు సాగిలపడిపోయారని అంటున్నారు. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ చంద్రబాబుతో సఖ్యతగా ఉండక పవన్ విభేదాలు కొని తెచ్చుకోవాలని ఎందుకు అనుకుంటారు? ఆ లాజిక్ వైసీపీకి తెలియక కాదు, కానీ రెచ్చగొట్టాలి కాబట్టి రెచ్చగొడుతోంది. పవన్ రెచ్చిపోయే వరకు రెచ్చగొట్టాలనే చూస్తోంది.
వేరే ఆప్షన్ లేదా?
ఏపీలో తిరిగి వైసీపీ బలపడాలంటే కచ్చితంగా కూటమి విడిపోవాలి. కూటమిలో మూడు పార్టీలు సఖ్యతతో ఉంటే వైసీపీకి మరో మార్గం లేనే లేదు. వచ్చే ఎన్నికల నాటికి ఎలాగైనా వారి మధ్య గొడవలు పెట్టాలనేది వైసీపీ మాస్టర్ ప్లాన్. కానీ పవన్ మాత్రం మరో 15 ఏళ్లు కూటమి కొనసాగాలని బలంగా కోరుకుంటున్నారు. మరి వైసీపీ పాచిక పారుతుందా? పవన్ అంత అమాయకంగా వైసీపీ మాయలో పడతారా? వేచి చూడాలి.