New Skoda Slavia Facelift Launched: భారత మార్కెట్లో స్కోడా స్లావియా సరికొత్తగా అడుగుపెట్టింది. కంపెనీ తాజాగా స్లావియా ఫేస్ లిఫ్ట్ ను రూ.10 లక్షల ఎక్స్ షోరూమ్ ప్రారంభ ధరతో విడుదల చేసింది. మొత్తం ఆరు ట్రిమ్‌లలో ఈ సెడాన్ అందుబాటులోకి వచ్చింది. ఇందులో మూడు పవర్ ట్రెయిన్ కాంబినేషన్లను అందిస్తున్నారు. ఎంట్రీ లెవల్ ధరలో పెద్దగా మార్పు చేయకపోయినా.. టాప్ వేరియంట్ ధర మాత్రం రూ.55,000 వరకు పెరిగింది.
ఫేస్‌లిఫ్ట్‌లో వచ్చిన ప్రధాన మార్పుల్లో కొత్త ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. స్లావియాలోని 1.0-లీటర్ TSI పెట్రోల్ ఇంజిన్‌కు ఇప్పుడు 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అందిస్తున్నారు. ఇప్పటివరకు ఈ ఇంజిన్‌తో ఉన్న 6-స్పీడ్ ఆటోమేటిక్ స్థానంలో కొత్త 8-స్పీడ్ AT వచ్చింది. ఈ ఇంజిన్ 118bhp పవర్, 178Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఆటోమేటిక్‌తో పాటు 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్ కూడా కొనసాగుతుంది. పెర్ఫార్మెన్స్ కోరుకునే కస్టమర్ల కోసం 1.5-లీటర్ TSI పెట్రోల్ ఇంజిన్‌ను కూడా అందిస్తున్నారు. ఇది 148bhp పవర్, 250Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 7-స్పీడ్ DSG గేర్‌బాక్స్‌తో మాత్రమే లభిస్తుంది. 1.0-లీటర్ TSI ఇంజిన్‌ను అన్ని వేరియంట్లలో ఎంచుకునే అవకాశం ఉండగా.. దాని ఆటోమేటిక్ వెర్షన్ Classic+ ట్రిమ్ నుంచి అందుబాటులో ఉంటుంది. 1.5-లీటర్ TSI మాత్రం టాప్ ఎండ్ Prestige, Monte Carlo వేరియంట్లకు మాత్రమే పరిమితం చేశారు.
స్లావియా ఫేస్‌లిఫ్ట్ లో డిజైన్‌కు కూడా కొన్ని మార్పులు చేశారు. కొత్తగా డిజైన్ చేసిన హెడ్ ల్యాంప్స్, కొత్త అల్లాయ్ వీల్స్, రీడిజైన్ చేసిన టెయిల్ ల్యాంప్స్‌తో కారు మరింత ఫ్రెష్‌గా కనిపిస్తుంది. కొత్త కలర్ ఆప్షన్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. క్యాబిన్‌లో టెక్నాలజీకి ప్రాధాన్యత ఇచ్చారు. అప్‌డేట్ చేసిన టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో పాటు 360 డిగ్రీ కెమెరా, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, వెనుక సీట్లకు మసాజ్ ఫంక్షన్ లాంటి ఫీచర్లు కూడా వచ్చాయి.
స్కోడా స్లావియా ఫేస్ లిఫ్ట్ లో భద్రతా ఫీచర్ల విషయంలోనూ కంపెనీ ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. అన్ని వేరియంట్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్స్, EBDతో కూడిన ABS, స్టెబిలిటీ ప్రోగ్రామ్ లాంటి ఫీచర్లు స్టాండర్డ్ గా అందిస్తున్నారు.
ప్రస్తుతం భారత్ లో సెడాన్ విభాగంలో వరుసగా కొత్త అప్‌డేట్లు వస్తున్నాయి. హ్యుందాయ్ వెర్నా, హోండా సిటీ వంటి మోడళ్లకు కూడా ఫేస్‌లిఫ్ట్ అప్‌డేట్లు వచ్చాయి. మరోవైపు స్కోడాకు చెందిన స్లావియా సోదర మోడల్ వోక్స్ వ్యాగన్ విర్టస్ కూడా త్వరలో అప్‌డేట్ కానుంది. రూ.10 లక్షల ప్రారంభ ధర, కొత్త 8-స్పీడ్ AT, క్రేజీ ఫీచర్లతో ఫేస్‌లిఫ్ట్ స్లావియా.. భారత సెడాన్ మార్కెట్లో తన పోటీని మరింత పెంచుకునేలా కనిపిస్తోంది.
Read Also: BE 07 TO విజన్ T.. మహీంద్రా నుంచి రాబోతున్న పవర్‌ఫుల్ ఎలక్ట్రిక్ SUVలు ఇవే!