Upcoming Electric Scooters in India: దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ పెరుగుతున్న వేళ.. మరో మూడు కొత్త మోడళ్లు భారత మార్కెట్‌లో సందడి చేసేందుకు రెడీ అవుతున్నాయి. వియత్నాంకు చెందిన విన్ ఫాస్ట్, దేశీయ సంస్థ అల్ట్రావయోలెట్, ప్రముఖ టూ వీలర్ కంపెనీ హోండా.. కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. వీటిలో ఒకటి సాధారణ వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని తయారు కాగా, మరో రెండు స్కూటర్లు ప్రీమియం, అర్బన్ మొబిలిటీపై ఫోకస్ చేయనున్నాయి.
భారత్ లో ఎలక్ట్రిక్ టూ వీలర్ సెగ్మెంట్ లోకి అడుగుపెట్టేందుకు విన్‌ఫాస్ట్ సిద్ధమవుతోంది. ఇందుకోసం దేశీయ సరఫరాదారులతో కలిసి భారతీయ వినియోగదారులకు అనుకూలంగా స్కూటర్లను అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది. విన్‌ఫాస్ట్ అమ్ముతున్న వైపర్ ఆధారంగా భారత్ కోసం ఓ మోడల్ వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన డిజైన్ పేటెంట్ లో పెద్ద వీల్స్, మందపాటి టైర్లు, హబ్ మోటార్ తో స్పోర్టీ లుక్ కనిపిస్తోంది. ట్విన్ పాడ్ హెడ్ ల్యాంప్ కూడా ప్రత్యేక ఆకర్షణగా ఉంది. అయితే పేటెంట్ పొందిన ఇదే మోడల్‌ను భారత్‌లో విడుదల చేస్తారా? లేదా? అనే విషయాన్ని కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.
అల్ట్రావయోలెట్ ఇప్పటికే పర్ఫార్మెన్స్ ఆధారిత ఎలక్ట్రిక్ బైకులతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు తొలిసారిగా స్కూటర్ విభాగంలోకి అడుగుపెట్టబోతోంది. ఫ్యూచరిస్టిక్ డిజైన్‌తో కనిపించే ఈ స్కూటర్‌ను 2027 ఫస్ట్ క్వార్టర్ లో భారత్‌లో విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. దీని కోసం కంపెనీ కొత్త 100V ఆర్కిటెక్చర్‌ను అభివృద్ధి చేసింది. వేగవంతమైన ఛార్జింగ్, మెరుగైన పనితీరుతో కట్టుకోనుంది. టెసరాక్ట్ ధర రూ.1.5 లక్షల లోపే ఉండొచ్చని అంచనా.
మరోవైపు హోండా రోజువారీ ప్రయాణాలను దృష్టిలో పెట్టుకుని QC3 ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తీసుకురానుంది. ఇది పర్ఫార్మెన్స్ కంటే ప్రాక్టికాలిటీకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే మోడల్‌గా ఉండనుంది. QC3లో 3 kWh బ్యాటరీ, సుమారు 150 కిలోమీటర్ల IDC రేంజ్ ఉంటుందని కంపెనీ వెల్లడించింది. 80 శాతం ఛార్జింగ్‌కు దాదాపు 2 గంటల 40 నిమిషాలు పడుతుందని తెలిపింది. సీటు కింద 32 లీటర్ల స్టోరేజ్, స్మార్ట్ కీ, కనెక్టెడ్ ఫీచర్లతో 5 అంగుళాల TFT డిస్‌ప్లే లాంటి సౌకర్యాలు ఇందులో ఉన్నాయి. దీని ప్రారంభ ధరను హోండా ఇంకా ప్రకటించలేదు. మార్కెట్ అంచనాల ప్రకారం రూ.1.2 లక్షల వరకు ఉండొచ్చని భావిస్తున్నారు. మొత్తంగా విన్‌ఫాస్ట్ సాధారణ మార్కెట్‌లో స్థానం సంపాదించేందుకు ప్రయత్నిస్తుండగా.. అల్ట్రావయోలెట్ టెసరాక్ట్ తో పనితీరు, టెక్నాలజీపై ఫోకస్ చేస్తోంది. హోండా QC3తో కుటుంబ వినియోగదారులను ఆకర్షించేందుకు సిద్ధమవుతోంది.
Read Also: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 3 బిగ్ బైక్స్.. 750 సీసీ పవర్‌తో రచ్చ రచ్చే!