World’s Strangest Motorcycles: సాధారణంగా బైక్ అంటే రెండు చక్రాలు, ఇంజిన్, సీటు, హ్యాండిల్ ఉంటాయని మనకు తెలుసు. కానీ, ప్రపంచంలోని కొంతమంది ఇంజనీర్లు, బైక్ తయారీదారులు మాత్రం ఈ సంప్రదాయ ఆలోచనలకు పూర్తిగా భిన్నంగా ప్రయోగాలు చేశారు. కొత్త టెక్నాలజీ, వినూత్న డిజైన్, భారీ ఇంజిన్లతో రూపొందించిన కొన్ని వాహనాలు అసలు బైక్‌లేనా? అనే డౌట్ కలిగేలా చేస్తాయి. అలాంటి వింతైన మోటార్ సైకిళ్లలో ఐదు ప్రత్యేకమైన మోడళ్ల గురించి తెలుసుకుందాం.
బైక్‌ల జాబితాలో డాడ్జ్ టోమహాక్ పేరు చెప్పకుండా ఉండటం కష్టం. సాధారణ మోటార్ సైకిళ్లకు భిన్నంగా ఇందులో మొత్తం నాలుగు చక్రాలు ఉంటాయి. ముందు రెండు, వెనుక రెండు చక్రాలు ఒకదానికొకటి దగ్గరగా అమర్చబడి ఉంటాయి. మరింత ఆశ్చర్యకరమైన విషయం దీని ఇంజిన్. డాడ్జ్ వైపర్ కారులో ఉపయోగించిన 8.3 లీటర్ V10 ఇంజిన్‌ను ఇందులో అమర్చారు. భారీ ఇంజిన్ కారణంగా టోమహాక్ ప్రపంచంలోనే అత్యంత విభిన్నమైన మోటార్‌సైకిల్ కాన్సెప్ట్లలో ఒకటిగా నిలిచింది.
Y2K టర్బైన్ సూపర్‌బైక్ పేరు వినగానే దీని ప్రత్యేకత ఏంటో అర్థమవుతుంది. సాధారణ పెట్రోల్ ఇంజిన్‌కు బదులుగా ఇందులో గ్యాస్ టర్బైన్ ఇంజిన్‌ను ఉపయోగించారు. ఇలాంటి ఇంజిన్లను హెలికాప్టర్లలో కూడా ఉపయోగిస్తారు. అందువల్ల ఈ బైక్ శబ్దం సాధారణ మోటార్ సైకిల్‌లకు పూర్తిగా భిన్నంగా ఉంటుంది. అత్యంత వేగంగా దూసుకెళ్లే సామర్థ్యం కలిగిన ఈ బైక్, టర్బైన్ టెక్నాలజీని రోడ్డు వాహనంలో ఉపయోగించడం అత్యంత అరుదుగా భావించాల్సి ఉంటుంది.
ఆఫ్‌రోడ్ ప్రయాణాల కోసం రూపొందించిన రోకాన్ ట్రెయిల్ బ్రేకర్ మరో క్రేజీ బైక్. ఇందులో టూ వీల్ డ్రైవ్ సిస్టమ్ ఉండటం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ముందు, వెనుక రెండు చక్రాలకు డ్రైవ్ అందుతుంది. వెడల్పాటి చక్రాల కారణంగా బురద, మంచు, ఇసుక వంటి కఠినమైన ప్రాంతాల్లోనూ ఇది ముందుకు సాగగలదు. కొన్ని పరిస్థితుల్లో నీటిపై తేలే సామర్థ్యం కూడా ఈ బైక్‌ను ఇతర మోడళ్లకు భిన్నంగా నిలబెడుతుంది.
ఆస్ట్రియాకు చెందిన జోహామర్ J1ను చూస్తే ఆశ్చర్యపోక తప్పదు. దీని బాడీ ఆకారం ప్రత్యేకంగా ఉండటంతో ఫ్యూచరిస్టిక్ వెహికల్ గా కనిపిస్తుంది. అయితే, దీని అసలు ప్రత్యేకత డిజైన్ తో పాటు టెక్నాలజీలో ఉంది. సాధారణ బైక్ లలో కనిపించే డాష్ బోర్డ్ కు బదులుగా వేగం, బ్యాటరీ లాంటి సమాచారం సైడ్ మిర్రర్లలోనే డిజిటల్‌గా చూపించే విధానాన్ని ఇందులో ఉపయోగించారు.
పెరావెస్ మోనోట్రేసర్ మోటార్‌సైకిల్, కారు రెండింటి లక్షణాలను కలిపిన వాహనం. డ్రైవర్ సాధారణ బైక్‌పై కూర్చున్నట్టుగా కాకుండా పూర్తిగా మూసివేసిన క్యాబిన్‌లో ప్రయాణిస్తారు. దీంతో బయట నుంచి చూస్తే ఇది చిన్న కారు లాగా కూడా కనిపిస్తుంది. మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. వాహనం ఆగినప్పుడు బ్యాలెన్స్ కోసం చిన్న సపోర్టింగ్ వీల్స్ బయటకు వస్తాయి.
Read Also: అక్టోబర్‌లో దుమ్మురేపనున్న కొత్త ఈవీలు.. స్కూటర్లు, బైక్స్ లిస్ట్ ఇదే!