Upcoming Electric Two Wheelers: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. పెరుగుతున్న ఇంధన ధరలు, తక్కువ నిర్వహణ ఖర్చులు, కొత్త టెక్నాలజీ కారణంగా చాలామంది ఇప్పుడు ఈవీల వైపు చూస్తున్నారు. దీంతో టూ వీలర్ కంపెనీలు కూడా కుటుంబ అవసరాలకు సరిపోయే స్కూటర్లతో పాటు మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చే ఎలక్ట్రిక్ బైక్స్ పై దృష్టి పెడుతున్నాయి. 2026 అక్టోబర్ నాటికి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉన్న కొన్ని కొత్త మోడళ్లు ఇప్పుడు బైక్ లవర్స్ లో ఆసక్తిని పెంచుతున్నాయి.
సింపుల్ ఎనర్జీ నుంచి కొత్త ఫ్యామిలీ-ఫోకస్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చే అవకాశం ఉంది. కంపెనీ ఇటీవల చూపించిన మోడల్ ఆధారంగా చూస్తే, ఇది ఎక్కువ హంగామా లేని ప్రాక్టికల్ డిజైన్‌తో ఉండే అవకాశం కనిపిస్తోంది. సింగిల్ పీస్ సీట్, రోజువారీ అవసరాలకు సరిపోయే బాడీ డిజైన్, TFT కన్సోల్ వంటి ఫీచర్లు ఇందులో ఉండొచ్చని అంచనా. కుటుంబ వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందిస్తున్న ఈ స్కూటర్ అక్టోబర్ 2026 నాటికి లాంచ్ లేదా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
TVS జూపిటర్ ఇప్పటికే పెట్రోల్ స్కూటర్ విభాగంలో పరిచయమైన పేరు. ఇప్పుడు అదే ఫ్యామిలీ నుంచి ఎలక్ట్రిక్ వెర్షన్ వస్తుందనే అంచనాలు వినిపిస్తున్నాయి. 2026 చివరి నాటికి జూపిటర్‌ను EVగా తీసుకురావాలని TVS చూస్తున్నట్లు చర్చ జరుగుతోంది. అక్టోబర్, నవంబర్ సమయంలో ఈ మోడల్ కు సంబంధించి కీలక ప్రకటన, లేదంటే లాంచ్ ఉండొచ్చని తెలుస్తోంది. సుమారు 100 నుంచి 120 కిలోమీటర్ల రేంజ్‌ను లక్ష్యంగా పెట్టుకుని, రోజువారీ ఆఫీస్, మార్కెట్, కుటుంబ ప్రయాణాలకు అనుకూలంగా దీనిని రూపొందించే అవకాశం ఉంది.
ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్లతో గుర్తింపు తెచ్చుకున్న ఏథర్ ఎనర్జీ కూడా మరింత విస్తృతమైన మార్కెట్‌పై దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా కొత్త ‘EL’ ప్లాట్‌ఫామ్‌పై కుటుంబ అవసరాలకు సరిపోయే మోడళ్లను అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం. పేటెంట్ ఫైలింగ్స్, ప్రివ్యూ ఈవెంట్ల తర్వాత ఈ ప్లాట్‌ఫామ్ ఆధారంగా మోడళ్లను దశలవారీగా తీసుకురావచ్చని అంచనాలు ఉన్నాయి. ధరను అందుబాటులో ఉంచడంతో పాటు, రోజువారీ వినియోగానికి అవసరమైన ఫీచర్లపై కంపెనీ దృష్టి పెట్టే అవకాశం ఉంది.
స్కూటర్లతో పాటు ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ విభాగంలోనూ TVS అడుగు పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కంపెనీ గతంలో ప్రదర్శించిన eFX కాన్సెప్ట్ ఆధారంగా ఒక మెయిన్‌స్ట్రీమ్ ఎలక్ట్రిక్ బైక్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ బైక్‌లో మిడ్ డ్రైవ్ మోటార్ సెటప్ ఉండొచ్చని, సుమారు 140 నుంచి 160 కిలోమీటర్ల రేంజ్ ఉంటుందని సమాచారం. అక్టోబర్ 2026లో దీనికి సంబంధించిన ప్రివ్యూ లేదంటే లాంచ్ జరిగే అవకాశం ఉంది.
సింపుల్ ఎనర్జీ, TVS, ఏథర్ వంటి కంపెనీలు కొత్త మోడళ్లతో విభిన్న కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఒకవైపు కుటుంబ అవసరాలకు సరిపోయే సౌకర్యవంతమైన స్కూటర్లు వస్తుండగా, మరోవైపు ఎక్కువ రేంజ్, మంచి పర్ఫార్మెన్స్ కోరుకునే వినియోగదారుల కోసం ఎలక్ట్రిక్ బైక్స్ కూడా సిద్ధమవుతున్నాయి.
Read Also: కారుపై ఏకంగా 20 టన్నుల రాళ్లు.. టాటా ఏరిస్ బలం చూపించేందుకు మైండ్ బ్లోయింగ్ టెస్ట్!