October 2026 Bike Launches: పండుగ సీజన్ మొదలవుతుండటంతో భారత ఆటోమొబైల్ మార్కెట్ లో కొత్త కార్ల సందడి పెరగనుంది. ముఖ్యంగా అక్టోబర్ 2026లో బైక్ ప్రియులను ఆకట్టుకునేలా పలు కొత్త మోడళ్లు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. నేకెడ్ స్ట్రీట్ ఫైటర్ల నుంచి రెట్రో బైక్‌లు, డ్యూయల్ స్పోర్ట్స్ వరకు పలు రకాల మోడళ్లు ఈ జాబితాలో ఉన్నాయి. ఇందులో కొన్ని బైక్‌లు ఇప్పటికే ఇంట్రెస్ట్ పెంచుతుండగా, మరికొన్నింటి లాంచ్ తేదీలు ప్రస్తుతానికి క్లారిటీ లేకుండా ఉన్నాయి.
అక్టోబర్ 1న BMW F 450 R అధికారికంగా లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. BMW మోటోరాడ్‌కు చెందిన ఈ నేకెడ్ స్ట్రీట్‌ఫైటర్, F 450 GS అడ్వెంచర్ బైక్ కు మోడల్ గా రానుంది. 420cc ప్యారలల్ ట్విన్ ఇంజిన్‌తో పని చేసే ఈ బైక్ సుమారు 48 bhp పవర్, 43 Nm టార్క్ ను అందించనుంది. USD ఫ్రంట్ ఫోర్క్స్, TFT డిస్ ప్లే, రైడింగ్ మోడ్‌లు లాంటి ఫీచర్లు ఇందులో ఉండనున్నాయి. దీని అంచనా ధర రూ.4.10 లక్షలుగా ఉంది.
రాయల్ ఎన్ ఫీల్డ్ అక్టోబర్ లో రెండు కొత్త మోడళ్లను తీసుకురావచ్చని తెలుస్తోంది. వాటిలో స్క్రాంబ్లర్ 450 ఒకటి. అక్టోబర్ 14న తాత్కాలికంగా లాంచ్ కావచ్చని భావిస్తున్న ఈ బైక్, హిమాలయన్‌లో ఉపయోగించిన 452cc షెర్పా ఇంజిన్ ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకోనుంది. రెట్రో డిజైన్, మంచి గ్రౌండ్ క్లియరెన్స్ తో పాటు సిటీ ప్రయాణాలు, తేలికపాటి ఆఫ్‌రోడ్ రైడింగ్‌కు అనుకూలంగా ఉండే సెటప్ ఇందులో ఉండొచ్చని సమాచారం. దీని ధర రూ.2.60 లక్షల నుంచి రూ.2.80 లక్షల మధ్య ఉండొచ్చని అంచనా.
ఇదే సమయంలో కేఫ్ రేసర్ లుక్‌తో కాంటినెంటల్ GT 450 కూడా రావచ్చని తెలుస్తోంది. 452cc ఇంజిన్‌కు స్పోర్టీ డిజైన్‌ను జోడించి, క్లిప్ ఆన్ హ్యాండిల్స్, వెనుకకు అమర్చిన ఫుట్ పెగ్స్ తో ప్రత్యేకమైన రైడింగ్ పొజిషన్ అందించే అవకాశం ఉంది. దీని అంచనా ధర రూ.2.70 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఉండొచ్చని తెలుస్తోంది.
హోండా CB500F కూడా అక్టోబర్ 14న భారత మార్కెట్లోకి రావచ్చని తెలుస్తోంది. 471cc ట్విన్ సిలిండర్ ఇంజిన్‌తో వచ్చే ఈ బైక్ సిటీ ప్రయాణాలతో పాటు హైవే రైడింగ్‌కు సరిపోయేలా రూపొందించబడింది. స్మూత్ పవర్ డెలివరీ, ప్రీమియం నేకెడ్ డిజైన్ ఆకట్టుకోనున్నాయి. దీని ప్రారంభ ధర సుమారు రూ.4.79 లక్షలుగా ఉండే అవకాశం ఉంది.
అక్టోబర్ 30న యమహా ల్యాండర్ XTZ 250 పరిచయం కావచ్చని తెలుస్తోంది. ఎంట్రీ లెవల్ డ్యూయల్ స్పోర్ట్ విభాగాన్ని లక్ష్యంగా చేసుకున్న ఈ బైక్‌లో డ్యూయల్ పర్పస్ టైర్లు, లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్, తేలికైన ఫ్రేమ్ లాంటి అంశాలు ఉండనున్నాయి. సిటీ రోడ్లతో పాటు కఠినమైన భూభాగాల్లోనూ ఉపయోగించుకునేలా దీన్ని రూపొందించనున్నట్లు తెలుస్తోంది. దీని అంచనా ధర రూ.1.95 లక్షల నుంచి రూ.2.25 లక్షల మధ్య ఉండొచ్చు.
Read Also: అక్టోబర్ లో కొత్త స్కూటర్ల జాతర.. హోండా, యమహా నుంచి క్రేజీ మోడల్స్ వచ్చేస్తున్నాయ్!