AP To Roll Out 750 Electric Buses: పెట్రో ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. గ్రీన్ మొబిలిటీని బలోపేతం చేయాలని భావిస్తోంది. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నపీఎం ఈ-బస్ సేవా స్కీమ్ కింద రాష్ట్ర వ్యాప్తంగా ఛార్జింగ్ స్టేషన్లు, విద్యుత్ కనెక్టివిటీ వ్యవస్థలు, డిపో మౌలిక వసతులను అభివృద్ధి చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ప్రజా రవాణాలో ఏపీ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని అధికారులు భావిస్తున్నారు.
పొల్యూషన్ కంట్రోల్, గ్రీన్ ఎనర్జీ వినియోగం, ఆధునిక రవాణా సేవల విస్తరణపై ఏపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఎలక్ట్రిక్ బస్సులు పెరగడం వల్ల డీజిల్ వినియోగం తగ్గడమే కాకుండా సిటీలో గాలి కాలుష్యం కూడా తగ్గుతుందని భావిస్తున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ APSRTC ఇన్ ఛార్జ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం.టి. కృష్ణబాబుతో కలిసి ఎలక్ట్రిక్ బస్సుల కోసం నిర్మిస్తున్న ఛార్జింగ్ స్టేషన్లు, విద్యుత్ మౌలిక సదుపాయాల పనుల పురోగతిని వర్చువల్ సమావేశంలో సమీక్షించారు. పెండింగ్ లో ఉన్న పనులను ఆలస్యం చేయకుండా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం ఇ-బస్ సేవా పథకం టెండర్-II కింద ఆంధ్రప్రదేశ్‌కు 750 ఎలక్ట్రిక్ బస్సులు మంజూరు అయ్యాయి. ఇవి రాష్ట్రంలోని 11 నగరాలు, 12 డిపోలలో నడపనున్నారు. అదనంగా, CESL టెండర్-III కింద తిరుపతికి మరో 300 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించారు. దీంతో రాష్ట్రంలో భారీ స్థాయిలో ఎలక్ట్రిక్ ప్రజా రవాణా వ్యవస్థ అభివృద్ధి చెందనుంది.
ఈ 750 బస్సుల్లో 621 బస్సులు 12 మీటర్ల పొడవు కలిగినవి కాగా, 129 బస్సులు 9 మీటర్ల పొడవు ఉన్నాయి. వీటిని విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, కాకినాడ, కడప, తిరుపతి, రాజమహేంద్రవరం, అమరావతి, అనంతపురం లాంటి ప్రధాన నగరాల్లో నడపనున్నారు. ఈ బస్సులు ప్రయాణికులకు సౌకర్యవంతమైన, కాలుష్యరహిత ప్రయాణాన్ని అందించనున్నాయి.
ఎలక్ట్రిక్ బస్సులు సజావుగా నడవాలంటే అవసరమైన ఛార్జింగ్ స్టేషన్లు, విద్యుత్ నెట్ వర్క్ లు, హైటెన్షన్ కనెక్టివిటీ, డిపో స్థాయి పవర్ మేనేజ్ మెంట్ సిస్టమ్ ను ఒకేసారి అభివృద్ధి చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ. 89.9 కోట్లుగా అంచనా వేయగా, ఇందులో రూ. 79.9 కోట్ల ఆర్థిక సహాయాన్ని కేంద్రం మంజూరు చేసింది. సింహపురి, గాజువాక, కాకినాడ, కర్నూలు, అనంతపురం ప్రాంతాల్లో విద్యుత్ మౌలిక సదుపాయాల పనుల కోసం ఇప్పటికే రూ. 17.8 కోట్లు విడుదల చేశారు. ఈ నిధులను APTRANSCO, సంబంధిత డిస్కామ్ లకు బదిలీ చేసి పనులు ప్రారంభించారు. ప్రస్తుతం హైటెన్షన్ విద్యుత్ కనెక్టివిటీ పనులు వేగంగా కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఏపీ దేశంలోనే ఎలక్ట్రిక్ ప్రజా రవాణాలో అగ్రగామి రాష్ట్రాల్లో ఒకటిగా నిలుస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
Read Also: కొత్త రంగుల్లో TVS జూపిటర్ 125.. ధర పెంపు లేకుండానే లాంచ్!