Bajaj Pulsar N160 Launch: బజాజ్ ఆటో పల్సర్ N160 బైక్ శ్రేణిని మరింత విస్తరించింది. ఇందులో భాగంగా కొత్తగా పల్సర్ N160 S, పల్సర్ N160 SS వేరియంట్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. వీటి ధరలు రూ.1.34 లక్షలు, రూ.1.43 లక్షలు (ఎక్స్ షోరూమ్)గా నిర్ణయించింది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న స్టాండర్డ్ పల్సర్ N160 కూడా అందుబాటులో ఉంటుంది. కొత్త S, SS వేరియంట్లలో ఇంజన్ తో పాటు టెక్నాలజీ పరంగా కూడా పలు మార్పులు చేశారు. ముఖ్యంగా కొత్త 4 వాల్వ్ ఇంజన్, ఎలక్ట్రానిక్ థ్రాటిల్, రైడ్ మోడ్స్ లాంటి ఫీచర్లు ఈ బైక్‌లకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
పల్సర్ N160 S, N160 SS రెండింటిలోనూ కొత్త 164.5cc సింగిల్ సిలిండర్, ఆయిల్ కూల్డ్, 4 వాల్వ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 9,500rpm వద్ద గరిష్టంగా 18.5hp పవర్‌ను, 8,000rpm వద్ద 14.5Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇప్పటి వరకు ఉన్న N160లోని 2 వాల్వ్ ఇంజన్ 16hp పవర్, 14.65Nm టార్క్ అందించేది. దీంతో కొత్త మోడళ్లలో పవర్ 2.5hp మేర పెరిగింది. అయితే, టార్క్ మాత్రం 0.25Nm తగ్గింది. ఇంజన్ లో మరో కీలక మార్పు కూడా చేశారు. పాత మెకానికల్ థ్రాటిల్ స్థానంలో కొత్త మోడళ్లలో ఎలక్ట్రానిక్ థ్రాటిల్ ను తీసుకొచ్చారు.
ఎలక్ట్రానిక్ థ్రాటిల్ కారణంగా బైక్‌లో రైడింగ్ కు అనుగుణంగా మోడ్ లను మార్చుకునే అవకాశం లభిస్తుంది. కొత్త N160 S, N160 SSలో రోడ్, రెయిన్, స్పోర్ట్, ఆఫ్ రోడ్ అనే నాలుగు రైడ్ మోడ్స్ ఉన్నాయి. రోడ్డు పరిస్థితులకు అనుగుణంగా వీటిని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇదే కాకుండా తక్కువ క్లచ్ ఇన్ పుట్ తో, హై గేర్ లో తక్కువ వేగంతో బైక్‌ను నడిపేందుకు ఉపయోగపడే ప్రత్యేక టెక్నాలజీని కూడా బజాజ్ అందించింది. KTM బైక్‌లలో కనిపించే క్రావల్ టెక్నాలజీని పోలిన వ్యవస్థగా చెప్పొచ్చు. ఇక టాప్ ఎండ్ N160 SSలో ట్రాక్షన్ కంట్రోల్ కూడా అందించారు. జారుడు రోడ్లపై బైక్ ను కంట్రోల్ చేయడంలో ఇది ఉపయోగపడుతుంది.
N160 SS మరింత ప్రీమియం వేరియంట్ గా కొనసాగనుంది. ఇందులో 5 అంగుళాల TFT డిస్ ప్లేను అందించారు. గూగుల్ మ్యాప్స్ మిర్రరింగ్ కు కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. బజాజ్ మోటార్ సైకిల్ లో ఈ ఫీచర్ అందుకున్న తొలి మోడల్ గా N160 SS నిలిచింది. N160 Sలో మాత్రం LCD ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ ఉంటుంది. SS వేరియంట్‌లో అడ్జస్టబుల్ లివర్లు, బ్లూటూత్, వై ఫై కనెక్టివిటీ లాంటి అదనపు ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇవి అట్లాంటిక్ బ్లూ, పెర్ల్ మెటాలిక్ వైట్, బ్రూక్లిన్ బ్లాక్ అనే మూడు రంగుల్లో అందుబాటులో ఉన్నాయి. కొత్త ఇంజన్, రైడ్ మోడ్స్, మెరుగైన హార్డ్ వేర్, అదనపు టెక్నాలజీతో పల్సర్ N160ను ప్రీమియం బైక్‌గా తీసుకొచ్చింది బజాజ్.
Read Also: రిలీజ్ కు ముందే కొత్త పల్సర్ 150 లీక్.. డిజైన్ అదిరింది భయ్యా!