BGauss C12 MaxR Launched in India: ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో పోటీ రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో BGauss కొత్త ఫ్లాగ్‌షిప్ మోడల్ C12 MaxRను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇప్పటి వరకు తాము తయారు చేసిన స్కూటర్లలో ఇదే అత్యంత సామర్థ్యం కలిగిన మోడల్ అని కంపెనీ వెల్లడించింది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.1.60 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. అయితే, ప్రారంభ ఆఫర్ లో భాగంగా దీన్ని రూ.1.46 లక్షల ఎఫెక్టివ్ ఎక్స్ షోరూమ్ ధరకు అందిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ ధరలు PM E-DRIVE సబ్సిడీని మినహాయించి ఉన్నాయి.
C12 MaxRలో 3.8kWh LFP బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగించారు. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 178 కిలోమీటర్ల IDC రేంజ్ వస్తుందని BGauss వెల్లడించింది. LFP బ్యాటరీ టెక్నాలజీని ఉపయోగించడం వల్ల దీర్ఘకాలిక వినియోగానికి అనుకూలంగా ఉంటుంది. బ్యాటరీ లైఫ్ టైమ్ సుమారు 1.5 లక్షల కిలోమీటర్ల వరకు ఉంటుందని కంపెనీ వెల్లడించింది. ఈ స్కూటర్ లో 4.2kW గరిష్ఠ శక్తిని ఉత్పత్తి చేసే హబ్ మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్ ను అందించారు. దీని సాయంతో C12 MaxR గరిష్ఠంగా గంటకు 75 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. రోజువారీ అవసరాలకు అనుగుణంగా ఇందులో ఎకో, రైడ్, స్పోర్ట్ అనే మూడు రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి. అదనంగా రివర్స్ మోడ్, క్రూయిజ్ కంట్రోల్ కూడా లభిస్తాయి. దీంతో నగర ప్రయాణాల్లో అవసరానికి తగ్గట్టుగా రైడింగ్ మోడ్‌ను మార్చుకోవచ్చు.
ఫీచర్ల విషయంలో కూడా C12 MaxRపై BGauss ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఇందులో 5 అంగుళాల TFT డిస్ ప్లే ఉంది. కాల్ అలర్ట్స్, రైడ్ వివరాలు, ఛార్జింగ్ స్టేటస్ లాంటి సమాచారాన్ని ఇందులో చూడవచ్చు. డాక్యుమెంట్లను స్టోర్ చేసుకునే సదుపాయం కూడా ఉంది. కనెక్టెడ్ ఫీచర్లలో పేరెంటల్ లాక్, స్పీడ్ మోడ్ ఎంపిక, వెహికల్ హెల్త్ మానిటరింగ్ లాంటి ఆప్షన్లు ఉన్నాయి. ఇవి స్కూటర్‌ను స్మార్ట్ గా మానిటరింగ్ చేయడానికి ఉపయోగపడతాయి.
స్టోరేజ్ విషయానికి వస్తే C12 MaxRలో మొత్తం 38 లీటర్ల స్పేస్ ఉంది. అండర్‌సీట్ కంపార్ట్ మెంట్ లో రెండు హెల్మెట్లు పెట్టుకోవచ్చని కంపెనీ చెబుతోంది. అయితే అవి ఫుల్ ఫేస్ హెల్మెట్లా, హాఫ్ ఫేస్ హెల్మెట్లా అనే విషయాన్ని మాత్రం స్పష్టం చేయలేదు. అదనంగా పాప్ అవుట్ అంబ్రెల్లా హోల్డర్, డాక్యుమెంట్లు, వాలెట్‌ను భద్రంగా ఉంచేందుకు లాక్ చేయగల ప్రత్యేక కంపార్ట్ మెంట్‌ను కూడా అందించారు.
హార్డ్ వేర్ పరంగా 12-అంగుళాల అల్లాయ్ వీల్స్, ట్యూబ్ లెస్ టైర్లను ఉపయోగించారు. ముందు భాగంలో 220mm డిస్క్ బ్రేక్, వెనుక డ్రమ్ బ్రేక్ ఉన్నాయి. సస్పెన్షన్ కోసం ముందు టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక మోనోషాక్ సెటప్ ఇచ్చారు. C12 MaxRను మొత్తం నాలుగు రంగుల్లో కొనుగోలు చేయవచ్చు.
Read Also: అక్టోబర్‌లో కొత్త కార్ల జాతర.. హోండా నుంచి హ్యుందాయ్ వరకు అదిరిపోయే మోడళ్లు ఇవే!