BYD Denza Z9 GT India: ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ లో మరింత సత్తా చాటేందుకు BYD ప్లాన్ చేస్తోంది. అందులో భాగంగానే.. భారత్ లో మరో ప్రీమియం మోడల్ ను తీసుకురావడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కంపెనీకి చెందిన లగ్జరీ బ్రాండ్ డెంజా (Denza) ద్వారా Z9 GTని భారత మార్కెట్లోకి తీసుకురావచ్చని టాక్ వినిపిస్తోంది. ఈ కారు సాధారణ ఎలక్ట్రిక్ వెహికల్ లా కాకుండా.. భారీ పవర్, అత్యాధునిక టెక్నాలజీతో హై పెర్ఫార్మెన్స్ కార్లకు పోటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
Z9 GT నాలుగు డోర్ల లగ్జరీ షూటింగ్ బ్రేక్. ఫాస్ట్ బ్యాక్ తరహా డిజైన్ తో కనిపించే ఈ కారుకు పొడవైన బాడీ, తక్కువ ఎత్తు, ఫ్రేమ్ లెస్ విండోస్, 21 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. వెనుక భాగంలో పెద్ద డిఫ్యూజర్ కూడా ఉంటుంది. భారత్ లో ఈ మోడల్ పై చర్చకు ప్రధాన కారణాల్లో ఒకటి దాని డిజైన్. 2025 మార్చిలో BYD, Z9 GT డిజైన్ కు భారత్ లో పేటెంట్ తీసుకుంది. దీంతో ఈ కారును దేశీయ మార్కెట్లోకి తీసుకురావచ్చనే అంచనాలు మొదలయ్యాయి. అయితే, ఇప్పటి వరకు కంపెనీ అధికారికంగా లాంచ్ తేదీని ప్రకటించలేదు.
ప్రపంచ మార్కెట్లలో Z9 GT ఎలక్ట్రిక్, ప్లగ్ ఇన్ హైబ్రిడ్ వెర్షన్లలో లభిస్తోంది. భారత్‌కు మాత్రం పూర్తి ఎలక్ట్రిక్ వెర్షన్ వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఈ EVలో 122.5kWh బ్యాటరీ ప్యాక్ తో పాటు మూడు ఎలక్ట్రిక్ మోటార్లు ఉంటాయి. ఇవి 1,156bhp పవర్, 1,210Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తాయి. ఇంతటి పవర్ కారణంగా ఈ కారు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 2.7 సెకన్లలో అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 270 కిలోమీటర్లు. అంటే ఇది కుటుంబ అవసరాల కోసం మాత్రమే రూపొందించిన లగ్జరీ EV కాకుండా, వేగాన్ని కోరుకునే వినియోగదారులకు అనుకూలంగా ఉంటుంది.
Z9 GTలో పవర్‌తో పాటు కొత్త తరహా డ్రైవింగ్ టెక్నాలజీ కూడా ఉంది. ఇందులో యాక్టివ్ రియర్-వీల్ స్టీరింగ్ సిస్టమ్ ఉంటుంది. దీని వల్ల కారు చిన్న ప్రదేశాల్లో సులభంగా తిరగడమే కాకుండా, ప్రత్యేకమైన సైడ్ వేస్ మూవ్‌మెంట్ చేస్తుంది. అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్, సెల్ఫ్ పార్కింగ్, డ్యూయల్ ఛాంబర్ ఎయిర్ సస్పెన్షన్ లాంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. డిజిటల్ రియర్ వ్యూ కెమెరా స్క్రీన్లు కూడా ఈ కారులో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.
భారత్ లో డెంజా బ్రాండ్‌ను ముందుగా D9 లగ్జరీ MPVతో పరిచయం చేసే అవకాశం ఉంది. ఈ మోడల్ దీపావళి సమయంలో మార్కెట్లోకి రావచ్చని అంచనాలు ఉన్నాయి. ఇది MG M9, Mercedes-Benz V-Class, Toyota Vellfire, Lexus LM వంటి ప్రీమియం MPVలకు పోటీగా నిలవనుంది. అయితే, లాంచ్ తేదీ, ధర, భారత స్పెసిఫికేషన్లపై కంపెనీ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.
Read Also: హ్యుందాయ్ కొత్త SUV పేరు ఇదే.. త్వరలో మార్కెట్లోకి ఎంట్రీ!