Advance Tip Ban: సాధారణంగా క్యాబ్ లేదా బైక్ బుక్ చేసుకునే సమయంలో చాలామందికి ఈ సమస్య ఎదురయ్యే ఉంటుంది. ఫోన్ నుంచి రైడ్ బుక్ చేసేటప్పుడు ‘త్వరగా డ్రైవర్ రావాలంటే టిప్ యాడ్ చేయండి’ అని కొన్ని యాప్‌లు సూచనలు చూపిస్తుంటాయి. సర్వీస్ నచ్చిన తర్వాత ఇష్టపూర్వకంగా ఇచ్చే టిప్‌ను, బుకింగ్ సమయంలోనే డిమాండ్ చేయడంపై ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
గమ్యస్థానం చేరుకున్నాక డ్రైవర్ అందించిన సేవలకు మెచ్చి ప్రయాణికుడు తన ఇష్టంతో టిప్ ఇస్తుంటాడు. కానీ బుకింగ్ సమయంలోనే ‘అడ్వాన్స్ టిప్’ ఆప్షన్ చూపించడం వల్ల యూజర్లపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. టిప్ ఇస్తేనే డ్రైవర్ రైడ్‌ను త్వరగా యాక్సెప్ట్ చేస్తాడనే భావనను కలిగించడం పూర్తిగా తప్పుదోవ పట్టించడమేనని మోటార్ వాహన అగ్రిగేటర్ మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి.
Also Read: యాపిల్ లవర్స్‌కు షాక్.. iPhone 18 Proతో పాటు పాత ఫోన్ల ధరలూ పెరుగుతున్నాయా?
ఇలాంటి ఫీచర్లు వినియోగదారులను మభ్యపెట్టేలా ఉన్నాయని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ స్పష్టం చేసింది. గతంలో ఉబెర్ వంటి సంస్థలకు దీనిపై నోటీసులు ఇచ్చినా.. ఇలాంటి ఆప్షన్లు మళ్లీ ప్రత్యక్షమవుతుండటంతో రవాణా మంత్రిత్వ శాఖ గట్టి హెచ్చరికలు జారీ చేసింది. కస్టమర్ల ప్రమేయం లేకుండా వారి నిర్ణయాలను ప్రభావితం చేసేలా యాప్ డిజైన్‌ను రూపొందించడం ‘డార్క్ పాటర్న్స్’ కిందకే వస్తుందని స్పష్టం చేసింది.
కొత్త నిబంధనల ప్రకారం ప్రయాణం ప్రారంభమవ్వడానికి ముందు లేదా ప్రయాణ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ టిప్ ఆప్షన్ కనిపింకకూడదు. కేవలం రైడ్ విజయవంతంగా పూర్తయిన తర్వాత మాత్రమే కస్టమర్ స్క్రీన్‌పై టిప్ ఇచ్చే సౌకర్యం అందుబాటులో ఉండాలి. అదనపు డబ్బులు చెల్లిస్తేనే త్వరగా వాహనం వస్తుందనేలా వినియోగదారులను భయపెట్టే సమస్యలకు ఇకపై చెక్ పడనుంది.
కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో ప్రయాణికులకు అనవసరపు ఆర్థిక భారం తప్పినట్లయింది. బలవంతపు లేదా ప్రలోభపెట్టే చెల్లింపుల నుంచి కస్టమర్లకు రక్షణ లభించడంతో పాటు, రైడ్ హాస్పిటాలిటీలో పారదర్శకత పెరుగుతుంది. ఇకపై కస్టమర్లు ఎటువంటి ఆందోళన లేకుండా.. అదనపు చెల్లింపుల భయం లేకుండా స్వేచ్ఛగా రైడ్స్ బుక్ చేసుకోవచ్చు.
Also Read: ఇక OTTల పని ఖేల్ ఖతం.. గూగుల్ టీవీలో ఉచితంగా 10,000 సినిమాలు, షోలు!