Car Shark Fin Explained: ఇండియన్ మార్కెట్ లోకి అడుగు పెట్టే అత్యాధునిక కార్ల రూఫ్ మీద వెనుక వైపు ఒక చిన్న నల్లటి భాగం ఉంటుంది. ఇది చూడటానికి షార్క్ చేప రెక్కలా ఉండటంతో దీనిని షార్క్ ఫిన్ యాంటెన్నా అని పిలుస్తారు. చాలా మంది దీన్ని కారుకు అందం కోసం ఏర్పాటు చేస్తారని అనుకుంటారు. కానీ, దీని వల్ల బోలెడు లాభాలున్నాయి. గతంలో కార్లపై పొడవాటి రాడ్ లేదంటే వైర్‌లా కనిపించే యాంటెన్నాలు ఉండేవి. కాలక్రమేణా కార్ల డిజైన్ మారడంతో పాటు యాంటెన్నా టెక్నాలజీ కూడా అభివృద్ధి చెందింది. ఇప్పుడు అదే పనిని మరింత కాంపాక్ట్ గా చేయడానికి షార్క్ ఫిన్ ఆకారంలోని యూనిట్లను ఉపయోగిస్తున్నారు.
షార్క్ ఫిన్ యాంటెన్నా కేవలం రేడియో సిగ్నల్స్ కోసం మాత్రమే పనిచేయదు. కారులో అందుబాటులో ఉన్న ఫీచర్లను బట్టి ఇది చాలా రకాల సిగ్నల్స్ ను రిసీవ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. FM, AM రేడియో సిగ్నల్స్ తో పాటు కొన్ని కార్లలో GPS నావిగేషన్, సెల్యులార్ కమ్యూనికేషన్, కనెక్టెడ్ కార్ సర్వీసులు లాంటి ఫీచర్లకు సంబంధించిన యాంటెన్నాలను కూడా ఈ యూనిట్ లో కలిపి ఏర్పాటు చేస్తారు. అంటే బయటకు ఒక చిన్న పరికరంలా కనిపించినా, దాని లోపల ఒకటి కంటే ఎక్కువ యాంటెన్నా వ్యవస్థలు ఉంటాయి. అయితే, అన్ని కార్లలోనూ ఒకే రకమైన షార్క్ ఫిన్ యాంటెన్నా ఉండదు. వాహనం మోడల్, అందులోని టెక్నాలజీ, కంపెనీ డిజైన్ ఆధారంగా దాని పనితీరు మారుతుంది.
ఒకప్పుడు కార్లకు అమర్చిన పొడవాటి యాంటెన్నాలు బయటకు ఎక్కువగా కనిపించేవి. కారును వాష్ చేసే సమయంలో అవి దెబ్బతినే అవకాశం ఉండేది. కొన్నిసార్లు చెట్ల కొమ్మలు, ఇతర వస్తువులు తగిలినా సమస్యలు వచ్చేవి. షార్క్ ఫిన్ యాంటెన్నా మాత్రం కార్ బాడీకి దగ్గరగా, క్లోజ్డ్ యూనిట్‌లా ఉంటుంది. సాధారణంగా బలమైన ప్లాస్టిక్ పదార్థాలతో తయారు చేస్తారు. అందువల్ల బయటకు పొడవుగా ఉండే యాంటెన్నాలతో పోలిస్తే దెబ్బతినే ప్రమాదం తక్కువగా ఉంటుంది.
కారు మీద ఉండే యాంటెన్నా ఆకారం గాలి ప్రవాహంపై ప్రభావం చూపుతుంది. షార్క్ ఫిన్ డిజైన్ కారు బాడీతో కలిసిపోయేలా ఉండటం వల్ల బయటకు పొడుచుకుని ఉండే పాత యాంటెన్నాలతో పోలిస్తే గాలి తాకిడి వల్ల ఏర్పడే ప్రభావాన్ని తగ్గించేలా డిజైన్ చేయవచ్చు. అయితే, కారులో వినిపించే మొత్తం విండ్ నాయిస్ ను ఈ ఒక్క డివైజ్ నియంత్రించదు. వెహికల్ బాడీ డిజైన్, అద్దాలు, డోర్ సీల్స్ లాంటి అనేక అంశాలు క్యాబిన్‌లోకి వచ్చే గాలి శబ్దాన్ని ప్రభావితం చేస్తాయి. కారుపై కనిపించే చిన్న షార్క్ ఫిన్ కేవలం అలంకరణ కోసం పెట్టింది కాదు. రేడియో, నావిగేషన్, కమ్యూనికేషన్ వంటి సిగ్నల్ అవసరాలను నిర్వహించడంతో పాటు ఆధునిక కార్ల డిజైన్‌కు సరిపోయేలా రూపొందించిన కీలక యాంటెన్నా వ్యవస్థగా చెప్పుకోవచ్చు.
Read Also: ఈ కార్లు ఒకప్పుడు భారత్‌లో తిరిగేవని తెలుసా? ఇప్పుడు రోడ్లపై కనిపిస్తే షాక్ అవ్వాల్సిందే!