Car ADAS vs Aircraft Autopilot: కారు రోడ్డు మీద పరుగులు తీస్తోంది. డ్రైవర్ స్టీరింగ్‌పై చేతులు ఉంచి ఉన్నప్పటికీ.. కారు తన లేన్‌ను గుర్తించి అదే మార్గంలో కొనసాగుతోంది. ముందున్న వాహనం వేగం తగ్గిస్తే, దానికి అనుగుణంగా తన వేగాన్ని కూడా మార్చుకుంటోంది. అవసరమైతే ప్రమాదాన్ని గుర్తించి బ్రేకులు వేస్తోంది. మరోవైపు వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న విమానం.. తన రూట్ ను అనుసరిస్తూ, తన ఎత్తు, వేగం, దిశను నియంత్రించుకుంటూ ముందుకు సాగుతోంది. వినడానికి రెండూ వేర్వేరు ప్రపంచాల్లా అనిపించినా.. వీటి వెనుక పనిచేస్తున్న సాంకేతికతలో కొన్ని క్రేజీ పోలికలు ఉన్నాయి.
లేటెస్ట్ కార్లలో కనిపిస్తున్న ADAS అంటే అడ్వాన్స్ డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్. ఇవి డ్రైవర్ స్థానాన్ని పూర్తిగా భర్తీ చేయడానికి కాకుండా, డ్రైవింగ్ సమయంలో అతడికి సహాయం చేయడానికి రూపొందించబడ్డాయి. హ్యుందాయ్ వెన్యూ లాంటి కార్లలో కెమెరాలు, రాడార్ లాంటి సెన్సర్ల ద్వారా రోడ్డు మీద ఉన్న పరిస్థితులను గమనిస్తాయి. లేన్ మార్కింగ్‌లు ఎక్కడున్నాయి? ముందున్న వాహనం ఎంత దూరంలో ఉంది? దాని వేగం ఎంత? రోడ్డుపై ప్రమాదం ఏమైనా ఉందా? లాంటి సమాచారాన్ని సిస్టమ్ కంట్రోల్ చేస్తోంది.
ఆ డేటాను కంప్యూటర్ ప్రాసెస్ చేసి, పరిస్థితికి తగ్గట్టుగా స్పందిస్తుంది. లేన్ నుంచి కారు బయటకు వెళ్లే అవకాశం ఉంటే స్టీరింగ్ లో చిన్న మార్పు చేయడానికి సహాయపడుతుంది. ముందున్న వాహనం వేగం తగ్గిస్తే అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ ద్వారా కారు వేగాన్ని తగ్గించవచ్చు.
బోయింగ్ 737 మ్యాక్స్ లాంటి ప్రయాణికుల విమానాల్లో ఆటో పైలట్ వ్యవస్థ మరింత సంక్లిష్టమైన స్థాయిలో పనిచేస్తుంది. విమానం ఎక్కడ ఉంది? ఎంత వేగంతో వెళ్తోంది? ఏ ఎత్తులో ఉంది? ఏ దిశలో ప్రయాణిస్తోంది? లాంటి విషయాలకు సంబంధించిన డేటాను సెన్సర్లు, కంప్యూటర్ వ్యవస్థలు అందిస్తాయి. ఈ సమాచారం ఆధారంగా విమానం నిర్దేశించిన మార్గంలో కొనసాగేందుకు ఆటోపైలట్ సాయపడుతుంది. అయితే, విమానంలోని ఆటోమేషన్ ఉన్నప్పటికీ.. పైలట్ల మానిటరింగ్, నిర్ణయాలు కీలకంగా ఉంటాయి.
కారు అయినా విమానం అయినా.. ఆటోమేషన్ వెనుక ప్రధాన సూత్రం ఒకటే. సెన్సర్లు సమాచారాన్ని సేకరిస్తాయి, కంప్యూటర్లు దాన్ని విశ్లేషిస్తాయి. ఆ తర్వాత వ్యవస్థకు అనుగుణంగా నియంత్రణ చర్యలు కొనసాగుతయా. అయితే, రెండింటి బాధ్యతలు ఒకేలా ఉండవు. కారులో ADAS డ్రైవర్‌కు సాయం చేస్తే, విమానంలో ఆటోపైలట్ పలు కంట్రోల్ వ్యవస్థలను మేనేజ్ చేస్తుంది. అయినప్పటికీ రెండింటిలోనూ మనిషి పర్యవేక్షణ అనేది అత్యంత కీలకం. ఒకప్పుడు సినిమాల్లో మాత్రమే కనిపించిన ఈ తరహా టెక్నాలజీ ఇప్పుడు మన రోజువారీ జీవితంలోకి వస్తోంది. రోడ్డు మీద కారు అయినా.. ఆకాశంలో విమానం అయినా.. భవిష్యత్తు ప్రయాణాన్ని మరింత స్మార్ట్ గా మార్చడంలో సెన్సర్లు, కంప్యూటర్లు, ఆటోమేషన్ కీలక పాత్ర పోషిస్తున్నాయి.
Read Also: డాష్ బోర్డ్ లో ఈ లైట్లు వెలుగుతున్నాయా? అయితే, కచ్చితంగా అలర్ట్ అవ్వాల్సిందే!