Honda ADV160 Delivery: భారత్‌లో కొత్త అడ్వెంచర్ స్కూటర్ కొనాలని ఎదురుచూస్తున్న వారికి హోండా నిరాశ కలిగించే వార్త చెప్పింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న హోండా ADV160 స్కూటర్ డెలివరీలు అనుకున్న సమయానికి ప్రారంభం కావడం లేదు. అక్టోబర్‌లో కస్టమర్లకు వాహనాలను అందిస్తామని గతంలో ప్రకటించిన హోండా.. ఇప్పుడు డెలివరీలను 2027కి వాయిదా వేసింది.
హోండా ఈ ఏడాది జూలైలో భారత్‌లో పది టూ వీలర్స్ ను ప్రదర్శించింది. వాటిలో ADV160 కూడా ఒకటి. ఆ తర్వాత కంపెనీ ADV160తో పాటు Rebel 300 ధరలను ప్రకటించి, ప్రీ బుకింగ్‌లను ప్రారంభించింది. అప్పుడు అక్టోబర్ నుంచి డెలివరీలు మొదలవుతాయని హోండా వెల్లడించింది. అయితే, ఇప్పుడు ఆ షెడ్యూల్ మారిపోయింది. ప్రస్తుత సమాచారం ప్రకారం కస్టమర్లు ADV160 కోసం మరికొంత కాలం వేచి చూడాల్సి ఉంటుంది.
డెలివరీలు ఎందుకు ఆలస్యమయ్యాయనే దానిపై హోండా నుంచి ఇప్పటివరకు స్పష్టమైన అధికారిక వివరణ రాలేదు. అయితే ఈ ఆలస్యం ఉత్పత్తికి సంబంధించిన పరిమితుల కారణంగా జరిగి ఉండొచ్చని తెలుస్తోంది. హోండా భారత్‌లో ప్రదర్శించిన పది వాహనాల ఉత్పత్తిని స్థానికంగా నిర్వహించేందుకు ప్రయత్నిస్తోంది. వాటిలో ఆరు మోడళ్లు భారత మార్కెట్ కు పూర్తిగా కొత్తవే. ఇలాంటి సమయంలో కొత్త మోడళ్ల ఉత్పత్తిని స్థానికంగా ఏర్పాటు చేయడం, అవసరమైన స్థాయిలో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం కంపెనీకి సవాలుగా మారే అవకాశం ఉంది. ADV160 డెలివరీలు ఆలస్యం కావడానికి ఇదే కారణం అయి ఉండొచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నప్పటికీ.. అధికారిక ధృవీకరణ వచ్చే వరకు దీనిని కచ్చితమైన కారణంగా చెప్పలేం.
ADV160 ప్రత్యేకత ఏమిటంటే.. భారత్‌లో ఈ తరహా అడ్వెంచర్ స్కూటర్ విభాగంలోకి హోండా ప్రవేశిస్తున్న తొలి ముఖ్యమైన మోడల్ ఇదే. డిజైన్‌తో పాటు ఫీచర్లు, పనితీరు విషయంలోనూ ఈ స్కూటర్‌పై ఆసక్తి నెలకొంది. మార్కెట్లో ఇప్పటికే యమహా Aerox 155, హీరో Xoom 160 వంటి మోడళ్లు ఉన్నాయి. ADV160 వీటికి నేరుగా పోటీ ఇచ్చేలా రూపొందించబడింది. ఈ స్కూటర్‌ను బిగ్ వింగ్, రెడ్ వింగ్ డీలర్‌షిప్‌ల ద్వారా అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ నిర్ణయించింది.
డెలివరీలు వాయిదా పడినప్పటికీ ADV160 ప్రీ బుకింగ్స్ కొనసాగుతున్నాయి. ఈ స్కూటర్‌పై కస్టమర్ల ఆసక్తి ఇంకా కొనసాగుతూనే ఉంది. భారత మార్కెట్లో కొత్త సెగ్మెంట్ ను లక్ష్యంగా చేసుకుని వచ్చిన ADV160కు డెలివరీ ఆలస్యం కొంత నిరాశ కలిగించినప్పటికీ, స్థానిక ఉత్పత్తి వ్యవస్థను హోండా ఎలా విస్తరిస్తుంది, చివరకు కస్టమర్లకు స్కూటర్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Read Also: టాటా ఏరిస్ బేస్ మోడల్ vs టాప్ మోడల్.. ఏ మోడల్ లో ఏం తేడాలున్నాయంటే?