D2M Technology: ఇకపై స్మార్ట్‌ఫోన్‌లో లైవ్ క్రికెట్ మ్యాచ్‌లు, వార్తలు చూడాలంటే తప్పనిసరిగా ఇంటర్నెట్ డేటా ఉండాల్సిన అవసరం లేకపోవచ్చు. నెట్‌వర్క్ సిగ్నల్ బలహీనంగా ఉన్నప్పుడు ఎదురయ్యే బఫరింగ్ సమస్యలకు కూడా చెక్ పడే అవకాశం ఉంది. ఇంటర్నెట్ కనెక్షన్, సిమ్ కార్డు అవసరం లేకుండానే నేరుగా మొబైల్ ఫోన్‌లో లైవ్ టీవీ ప్రసారాలను అందించే ‘డైరెక్ట్-టు-మొబైల్’ (D2M) సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రసార్ భారతి సిద్ధమవుతోంది. ఇప్పటికే దేశంలోని పలు నగరాల్లో ప్రయోగాత్మక పరీక్షలు నిర్వహించగా.. త్వరలోనే ఈ టెక్నాలజీకి సంబంధించిన వాణిజ్య ప్రక్రియను ప్రారంభించే దిశగా అడుగులు వేస్తోంది.
మన ఫోన్లలో FM రేడియో ఎలా పనిచేస్తుందో.. ఈ D2M సాంకేతికత కూడా దాదాపు అలాగే పనిచేస్తుంది. దీనికి మొబైల్ డేటా కానీ, Wi-Fi కానీ అవసరం లేదు. రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ ద్వారా నేరుగా ఫోన్‌కే వీడియో, ఆడియో కంటెంట్‌ను ప్రసారం చేస్తారు. టీవీ ఛానెల్స్, ప్రత్యక్ష ప్రసారాలు, తాజా వార్తలతో పాటు అత్యవసర హెచ్చరికలను కూడా ఈ టెక్నాలజీ ద్వారా ఉచితంగా పొందవచ్చు.
నెట్‌వర్క్ సిగ్నల్స్ సరిగ్గా లేని మారుమూల ప్రాంతాల్లో కూడా లైవ్ టీవీ ప్రసారాలను అంతరాయం లేకుండా చూడవచ్చు. తద్వారా మన డేటా ప్యాక్ అయిపోతుందనే భయం ఉండదు. అలాగే మొబైల్ టవర్లపై డేటా లోడ్ కూడా గణనీయంగా తగ్గుతుంది. మన దేశంలో టీవీ లేని కోట్లాది కుటుంబాలకు ఇదొక గొప్ప అవకాశంగా మారనుంది.
Also Read: Apple Pay వచ్చేసింది.. ఇక ఐఫోన్‌తో పేమెంట్స్ మరింత ఈజీ, ఎలా వాడాలో తెలుసా?
ఈ ప్రసారాలను అందుకోవడానికి ప్రస్తుతం మన దగ్గర ఉన్న ఫోన్లలో సరైన చిప్‌సెట్, యాంటెన్నా లేవు. ఫోన్లలో ఐఐటీ కాన్పూర్ సూచించిన కొత్త రకం సాంకేతికతను అమర్చాల్సి ఉంటుంది. అలాగే దేశవ్యాప్తంగా సీమ్‌లెస్ సిగ్నల్స్ ఇవ్వడానికి కొత్త రకం టవర్ల నెట్‌వర్క్ కూడా అవసరమవుతుంది. టెలికాం కంపెనీల నుంచి కూడా కొన్ని సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఐఐటీ కాన్పూర్, ప్రసార్ భారతి భాగస్వామ్యంతో ఢిల్లీ, బెంగళూరు సహా దాదాపు 19 నగరాల్లో ఈ ప్రయోగాలు విజయవంతంగా పూర్తయ్యాయి. ప్రసారాల వల్ల ఫోన్లు వేడెక్కడం గానీ, సిగ్నల్ సమస్యలు గానీ రావని నివేదికలు స్పష్టం చేశాయి.
త్వరలోనే ప్రసార భారతి ఈ టెక్నాలజీకి సంబంధించిన అధికారిక టెండర్లను పిలవనుంది. సాంకేతిక సవాళ్లను అధిగమిస్తే.. రాబోయే రోజుల్లో మొబైల్ రీఛార్జ్ లేకుండానే లైవ్ స్పోర్ట్స్, వార్తలను మన చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్ లోనే ఆస్వాదించవచ్చు.
Also Read: నెట్ లేకున్నా గూగుల్ మ్యాప్స్ వాడొచ్చు.. కానీ ఈ 3 ఫీచర్లు మాత్రం అస్సలు పనిచేయవు!