Hyundai Lounge Edition: హ్యుందాయ్ తన ప్రముఖ SUVలైన క్రెటా, క్రెటా ఎలక్ట్రిక్, అల్కాజార్ లో కొత్త లాంజ్ ఎడిషన్‌ను తీసుకొచ్చింది. టాప్ స్పెక్ వేరియంట్ల ఆధారంగా రూపొందించిన ఈ ప్రత్యేక ఎడిషన్ లో ప్రధానంగా వెనుక సీటు ప్రయాణికుల సౌకర్యం, ఎంటర్ టైన్‌మెంట్ పై దృష్టి పెట్టారు. మూడు SUVలలోనూ ఇప్పుడు వెనుక ప్రయాణికుల కోసం పెద్ద 11.6-అంగుళాల ఎంటర్ టైన్ మెంట్ స్క్రీన్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటి వరకు 6, 7 సీట్లతో మాత్రమే లభించిన అల్కాజార్‌లో లాంజ్ ఎడిషన్ ద్వారా తొలిసారి 5-సీటర్ లేఅవుట్‌ను కూడా తీసుకొచ్చారు.
లాంజ్ ఎడిషన్ లోని 11.6-అంగుళాల స్క్రీన్ సాధారణ ఎంటర్‌టైన్‌మెంట్ యూనిట్ లా కాకుండా పలు స్మార్ట్ ఫీచర్లను సపోర్ట్ చేస్తుంది. ఇందులో OTT కంటెంట్ ను నేరుగా స్ట్రీమ్ చేసుకోవచ్చు. ఫోన్ మిర్రరింగ్‌తో పాటు గేమింగ్‌కు కూడా సపోర్ట్ ఉంటుంది. అంతేకాకుండా ప్రత్యేక యాప్ స్టోర్ ద్వారా వివిధ అప్లికేషన్లను ఉపయోగించుకునే అవకాశం ఉంది. రియర్ సీట్ ప్రయాణికుల కోసం తెలుపు రంగు యాంబియంట్ లైటింగ్‌ను కూడా మూడు మోడళ్లలోనూ అందించారు.
లాంజ్ ఎడిషన్‌కు ప్రత్యేకమైన గోల్డెన్ బ్రాంజ్ ఎక్స్ టీరియర్ కలర్‌ను హ్యుందాయ్ పరిచయం చేసింది. ఇప్పటికే ఉన్న ఇతర రంగుల ఎంపికలు కూడా కొనసాగుతాయి. ఈ వెహికల్ కు మరింత స్పోర్టీ లుక్ ఇచ్చేందుకు పలు భాగాలను బ్లాక్ అవుట్ చేశారు. అల్లాయ్ వీల్స్, స్కిడ్ ప్లేట్లు, ORVMలు, రూఫ్ మౌంటెడ్ స్పాయిలర్, రూఫ్ రైల్స్, సీ పిల్లర్ గార్నిష్ లాంటి భాగాల్లో బ్లాక్ ఫినిష్ కనిపిస్తుంది. వీల్ సైజుల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. క్రెటా, అల్కాజార్‌లో 18-అంగుళాల వీల్స్ ఉండగా, క్రెటా ఎలక్ట్రిక్‌లో 17-అంగుళాల వీల్స్ కొనసాగుతాయి.
ఇంటీరియర్‌లో పూర్తిగా బ్లాక్ థీమ్‌ను తీసుకొచ్చారు. AC వెంట్ల చుట్టూ సిల్వర్ ఇన్సర్ట్‌లు ఇవ్వడం ద్వారా క్యాబిన్‌కు కొంత ప్రీమియం లుక్ వచ్చేలా చేశారు. సీట్లపై కూడా కొత్త లాంజ్ సీట్ డిజైన్ ప్యాటర్న్ ను ఉపయోగించారు. హెడ్ రెస్ట్ కుషన్లపై Lounge అని రాసి ఉంటుంది. మిగతా ఫీచర్లు ఆయా లాంజ్ ఎడిషన్లు టాప్ వేరియంట్లలో ఉన్నవే కొనసాగుతాయి.
ధర విషయానికి వస్తే, స్టాండర్డ్ మోడళ్లతో పోలిస్తే లాంజ్ ఎడిషన్ కోసం అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. క్రెటా లాంజ్ ఎడిషన్ పెట్రోల్ CVT, డీజిల్ AT వేరియంట్లలో సుమారు రూ.53,000 అదనపు ధరతో వస్తుంది. క్రెటా ఎలక్ట్రిక్ లాంజ్ ఎడిషన్ ధర స్టాండర్డ్ ఎక్సలెన్స్ LR వేరియంట్ కంటే రూ.67,000 ఎక్కువ. అల్కాజార్ లాంజ్ ఎడిషన్‌లో 5 సీటర్ లేఅవుట్ అందుబాటులో ఉండటం వల్ల ధర వ్యత్యాసం వేరియంట్‌ను బట్టి సుమారు రూ.71,000 నుంచి రూ.90,000 వరకు ఉంటుంది.
Read Also: అక్టోబర్‌లో కొత్త కార్ల జాతర.. హోండా నుంచి హ్యుందాయ్ వరకు అదిరిపోయే మోడళ్లు ఇవే!