Electric Scooter Sales May 2026: ఇండియన్ ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్లో మే 2026 నెలలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాల పోటీలో కొత్త మోడల్స్ దూసుకొచ్చాయి. ఒకప్పుడు మార్కెట్ లో ఆధిపత్యం కొనసాగించిన ఓలా ఎలక్ట్రిక్ ఇప్పుడు భారీగా సేల్స్ తగ్గి.. ఏకంగా ఐదవ స్థానానికి పడిపోయింది. అదే సమయంలో టీవీఎస్, బజాజ్ లాంటి కంపెనీలు స్థిరమైన అమ్మకాలతో టాప్ పొజిషన్ లో కొనసాగుతున్నాయి. ఇంతకీ ఈ నెలలో టాప్ లో నిలిచి 5 కంపెనీలు ఏవనేది ఇప్పుడు తెలుసుకుందాం..
మే నెలలో టీవీఎస్ మోటార్ కంపెనీ మొత్తం 40,711 ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించి మొదటి స్థానంలో నిలిచింది. టీవీఎస్ ఐక్యూబ్, ఆర్బిటార్ ఎలక్ట్రిక్, టీవీఎస్ X లాంటి మోడళ్లు సత్తా చాటడంతో ఈ సక్సెస్ అందుకుంది. దేశ వ్యాప్తంగా ఉన్న బలమైన డీలర్ నెట్ వర్క్, సర్వీస్ సపోర్ట్ టీవీఎస్ కు పెద్ద ప్లస్ గా మారింది.
రెండవ స్థానంలో బజాజ్ ఆటో నిలిచింది. కంపెనీ చేతక్ స్కూటర్ లైనప్ ద్వారా 36,727 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. టీవీఎస్ తో పోలిస్తే కేవలం కొన్ని వేల యూనిట్ల తేడాతో మాత్రమే వెనుకబడింది. కొత్త అప్ డేట్లు, పెరుగుతున్న డిమాండ్ కారణంగా బజాజ్ త్వరలోనే మొదటి స్థానానికి చేరే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
మూడవ స్థానంలో ఏథర్ ఎనర్జీ కొనసాగుతోంది. కంపెనీ మే నెలలో 26,478 స్కూటర్లను సేల్ చేసింది. ఏథర్ 450 సిరీస్, రిజ్టా మోడళ్లు ఈ అమ్మకాలలో కీలక పాత్ర పోషించాయి. ప్రీమియం సెగ్మెంట్ లో బలమైన బ్రాండ్ ఇమేజ్ ఉండటం వల్ల ఏథర్ తన స్థానాన్ని అలాగే కంటిన్యూ చేసింది.
నాలుగో స్థానంలో హీరో మోటోకార్ప్ కు చెందిన విడా బ్రాండ్ నిలిచింది. విడా మే 2026లో 17,963 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. విడా V2 సిరీస్, VX2 స్కూటర్లు ఈ వృద్ధికి కారణమయ్యాయి. బాటరీ యాజ్ ఎ సర్వీస్ (BaaS) స్కీమ్ ప్రారంభ ధరను తగ్గించడం వల్ల వినియోగదారులు ఎక్కువగా ఈ వాహనాలను కొనుగోలు చేస్తున్నారు.
ఆశ్చరకరంగా ఓలా ఎలక్ట్రిక్ ఐదవ స్థానానికి పడిపోయింది. మే నెలలో కంపెనీ 14,585 యూనిట్లను మాత్రమే విక్రయించింది. ఒకప్పుడు మార్కెట్ లో అగ్రస్థానంలో ఉన్న ఓలా ఇప్పుడు పోటీ పెరగడంతో వెనుకబడింది. సర్వీస్ సమస్యలు, ఇతర బ్రాండ్ల నుండి వచ్చిన బలమైన పోటీ ముందు ఓలా తట్టుకోలేకపోతోంది.
మొత్తంగా భారత ఈవీ స్కూటర్ మార్కెట్ ఇప్పుడు మరింత పోటీగా మారింది. టీవీఎస్, బజాజ్ లాంటి సంప్రదాయ తయారీదారులు నమ్మకమైన మోడల్స్, బలమైన సర్వీస్ నెట్ వర్క్ తో ముందుకు దూసుకెళ్తున్నారు. మరోవైపు ఏథర్ ప్రీమియం సెగ్మెంట్ లో తన స్థానాన్ని కొనసాగిస్తోంది. ఓలా పరిస్థితి మాత్రం గందరగోళంగా మారింది.
Read Also: భారత్ లో ఈవీ స్కూటర్ల జోరు.. మేలో 1.70 లక్షల అమ్మకాలతో సరికొత్త రికార్డు!