Kawasaki Versys 900: ప్రముఖ బైక్ తయారీ సంస్థ కవాసకి తన అడ్వెంచర్ టూరర్ సిరీస్ లో కొత్త మోడళ్లను పరిచయం చేసింది. కవాసకి వెర్సిస్ 900, వెర్సిస్ 900 SE పేర్లతో ఈ బైక్‌లను ఆవిష్కరించింది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న Z900 ఆధారంగా వీటిని రూపొందించారు. వెర్సిస్ 650, వెర్సిస్ 1100 మోడళ్ల మధ్య ప్లేస్ దక్కించుకునేలా ఈ కొత్త బైక్‌ను తీసుకొచ్చారు. ముఖ్యంగా లాంగ్ రైడ్స్ చేసే వారిని ఆకట్టుకునేలా టూరింగ్ ఫీచర్లు, ఆధునిక ఎలక్ట్రానిక్స్ ను ఇందులో అందించారు.
కవాసకి వెర్సిస్ 900లో 948cc ఇన్లైన్ ఫోర్, లిక్విడ్ కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇదే ఇంజన్ Z900లోనూ ఉంటుంది. అయితే, వెర్సిస్ 900లో ఇది సుమారు 122–123hp పవర్, 97.3Nm టార్క్ ను అందిస్తుంది. ఇంజన్‌ను కొత్త ట్రెల్లిస్ ఫ్రేమ్‌లో అమర్చారు. రైడింగ్ సమయంలో మెరుగైన కంట్రోల్, స్టెబులిటీ అందించేలా దీనిని రూపొందించారు. ఈ బైక్‌లో USD ఫ్రంట్ ఫోర్క్, వెనుకవైపు లింకేజ్ మోనోషాక్ సస్పెన్షన్ ఉన్నాయి. సీట్ ఎత్తు 825mmగా ఉండగా, అవసరాన్ని బట్టి 845mm వరకు పెంచుకునే ఆప్షన్ కూడా ఉంది. లాంగ్ డిస్టెన్స్ రైడింగ్‌కు అనుగుణంగా ఈ సెటప్ ను రూపొందించారు.
వెర్సిస్ 900లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన ఫీచర్ అడ్వాన్స్డ్ రైడర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ARAS). ఇందులో ఫ్రంట్, రియర్ రాడార్ సిస్టమ్ ఆధారంగా పనిచేసే పలు సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్ వంటి ఫీచర్లు రైడర్‌కు అదనపు భద్రత కల్పించడంలో సాయపడుతాయి. అంతేకాకుండా రైడ్ బై వైర్, పవర్ మోడ్స్, ట్రాక్షన్ కంట్రోల్, స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్, బై డైరెక్షనల్ క్విక్ షిఫ్టర్ కూడా ఉన్నాయి. 6 యాక్సిస్ IMU, స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీతో కూడిన 5 అంగుళాల TFT డిస్ప్లేను అందించారు.
SE వేరియంట్లో LED ఫాగ్ ల్యాంప్స్, హ్యాండ్ గార్డ్స్, హీటెడ్ గ్రిప్స్, రేడియేటర్ గార్డ్, ఫ్రేమ్ ప్రొటెక్షన్ స్లైడర్స్, లోయర్ కౌల్, సెంటర్ స్టాండ్ లాంటి యాక్సెసరీలు స్టాండర్డ్ గా లభిస్తాయి. స్టాండర్డ్ మోడల్ బ్లాక్, వైట్ రంగుల్లో అందుబాటులో ఉండగా, SE వేరియంట్ లైమ్ గ్రీన్/బ్లాక్, రెడ్/గ్రే రంగుల్లో వస్తుంది.
యూకే మార్కెట్లో స్టాండర్డ్ వెర్సిస్ 900 ధర GBP 10,899గా, వెర్సిస్ 900 SE ధర GBP 11,799గా ప్రకటించారు. భారత కరెన్సీలో ఇవి సుమారు రూ.13.74 లక్షలు, రూ.14.87 లక్షలుగా ఉంటాయి. ఈ మోడళ్లు యూకేలో ఏప్రిల్ 2027 నుంచి అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం భారత్‌లో వెర్సిస్ X-300, 650, 1100 మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. వెర్సిస్ 900 కూడా 2027లో భారత మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని అంచనా. అయితే కంపెనీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Read Also: భారత్ పై విన్‌ఫాస్ట్ ఫుల్ ఫోకస్.. తెలంగాణ, ఏపీలోనూ షోరూమ్‌లు!