VinFast EV Showrooms: వియత్నాంకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ విన్ ఫాస్ట్ భారత మార్కెట్‌పై మరింత దృష్టి పెట్టింది. దేశ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ టూ వీలర్ల విక్రయాలను పెంచేందుకు కీలక అడుగు వేసింది. ఇందులో భాగంగా 15 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 34 నగరాల్లో 50కి పైగా ఎలక్ట్రిక్ టూ వీలర్ షోరూమ్‌లను ఏర్పాటు చేయడానికి డీలర్ భాగస్వాములతో ఒప్పందాలు చేసుకుంది. ఈ కొత్త నెట్ వర్క్ ద్వారా వినియోగదారులకు తన ఎలక్ట్రిక్ టూ వీలర్స్ ను మరింత దగ్గర చేయాలని కంపెనీ భావిస్తోంది.
ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్ల కోసం ప్రత్యేక డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ ను క్రియేట్ చేయాలనే లక్ష్యంతో విన్ ఫాస్ట్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం పలు ప్రాంతాలకు చెందిన డీలర్లతో లెటర్స్ ఆఫ్ ఇంటెంట్ పై సంతకాలు చేసింది. ఈ నెట్ వర్క్ దేశంలోని కీలక ప్రాంతాలకు విస్తరించనుంది. ఢిల్లీ-ఎన్‌సీఆర్, రాజస్థాన్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళలోనూ షోరూమ్‌లను ఏర్పాటు చేయాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. బెంగాల్, ఒడిశా కూడా ఈ లిస్టులో ఉన్నాయి.
దేశంలో ఎలక్ట్రిక్ టూ వీలర్లకు పెరుగుతున్న అవకాశాలను దృష్టిలో ఉంచుకుని ఈ విస్తరణ చేపడుతున్నట్లు విన్‌ఫాస్ట్ తెలిపింది. కొత్త షోరూమ్‌ల ద్వారా అమ్మకాలతో పాటు స్థానికంగా కస్టమర్లకు మెరుగైన సేవలు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకాకుండా, ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను అభివృద్ధి చేయడం, అమ్మకాల తర్వాత అందించే సర్వీస్‌ను బలోపేతం చేయడంపైనా దృష్టి పెట్టనుంది.
ఈ ఒప్పందాలు భారత మార్కెట్‌పై కంపెనీకి ఉన్న దీర్ఘకాలిక ప్లాన్ ను వెల్లడిస్తున్నాయని విన్‌ఫాస్ట్ ఇ-స్కూటర్స్ ఓవర్సీస్ మార్కెట్ మేనేజింగ్ డైరెక్టర్ వో థి కామ్ టు వెల్లడించారు. దేశవ్యాప్తంగా వినియోగదారులకు ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్లను అందుబాటులోకి తీసుకురావడంలో ఈ భాగస్వామ్యాలు కీలకంగా నిలుస్తాయని విన్‌ఫాస్ట్ ఇండియా ఇ-స్కూటర్స్ సీఈఓ అనురాగ్ సక్సేనా తెలిపారు.
విన్ ఫాస్ట్ 2025లో భారత ఎలక్ట్రిక్ మొబిలిటీ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటి వరకు ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు, తయారీ, అసెంబ్లీ కార్యకలాపాలపై దృష్టి పెట్టిన సంస్థ.. ఇప్పుడు ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ టూ వీలర్ విభాగంలోనూ తన ఉనికిని పెంచుకోవాలని భావిస్తోంది. 2025-26లో దేశంలో 2.141 కోట్ల టూ వీలర్లు రిజిస్టర్ అయ్యాయి. దీంతో భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన మార్కెట్‌గా నిలిచింది. అయితే, మొత్తం రిజిస్ట్రేషన్లలో ఎలక్ట్రిక్ వాహనాల వాటా 6.54 శాతంగా ఉంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఈవీల వినియోగం పెరుగుతుందనే అంచనాలతో విన్‌ఫాస్ట్ తన డీలర్ నెట్ వర్క్ ను పెంచేందుకు రెడీ అవుతోంది.
Read Also: సింగిల్ ఛార్జ్ తో 250 కి.మీ రేంజ్.. కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది!