Kia PV5 Eectric Van: ఎలక్ట్రిక్ వెహికల్స్ మార్కెట్లో కియా సత్తా చాటుతోంది. కంపెనీ తొలిసారిగా తీసుకొచ్చిన ఎలక్ట్రిక్ వ్యాన్ కియా PV5 యూరప్ మార్కెట్లో దుమ్ము రేపుతోంది. ప్రస్తుతం యూరప్ లోని మినీ ఎలక్ట్రిక్ వ్యాన్ సెగ్మెంట్ లో PV5 ఏకంగా 37 శాతం వాటాను సంపాదించింది. దీంతో ఈ విభాగంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ వ్యాన్ గా గుర్తింపు తెచ్చుకుంది.
2025 చివర్లో యూరప్ లోకి ప్రవేశించిన PV5.. అతి తక్కువ సమయంలోనే కస్టమర్ల నుంచి మంచి ఆదరణ అందుకుంది. యూరోపియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ లెక్కల ప్రకారం, 12 దేశాల్లో చిన్న ఎలక్ట్రిక్ వ్యాన్ విభాగంలో PV5 అత్యధిక అమ్మకాలు సాధించింది. యూకేలో 3,361 యూనిట్లు, జర్మనీలో 2,206 యూనిట్ల అమ్మకాలతో PV5 మినీ ఎలక్ట్రిక్ వ్యాన్ సెగ్మెంట్ లో అగ్రస్థానంలో ఉంది. డెన్మార్క్ లో 1,222, నెదర్లాండ్స్ లో 1,196, నార్వేలో 739, స్వీడన్ లో 1,414 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ఈ దేశాల్లో కొన్ని చోట్ల అన్ని రకాల పవర్ ట్రెయిన్లను కలిపినా PV5 అత్యధికంగా అమ్ముడైన వ్యాన్ గా నిలవడం విశేషం.
2026 మొదటి ఆరు నెలల్లోనే ఐదు దేశాల్లో మినీ ఎలక్ట్రిక్ వ్యాన్ అమ్మకాలలో PV5 సగానికి పైగా వాటాను సాధించింది. డెన్మార్క్ లో 63 శాతం, ఐర్లాండ్‌లో 62 శాతం, స్వీడన్ లో 59 శాతం, ఫిన్లాండ్‌లో 58 శాతం, యూకేలో 54 శాతం మార్కెట్ వాటా దక్కించుకుంది. 2026 మొదటి ఆరు నెలల్లో కియా మొత్తం 13,166 PV5 వాహనాలను అమ్మింది. వ్యాపార అవసరాలతో పాటు వ్యక్తిగత వినియోగానికి అనుగుణంగా ప్యాసింజర్, కార్గో, ఛాసిస్ లాంటి వేరియంట్లలో ఇది అందుబాటులో ఉంది.
యూకే మార్కెట్లో PV5 కార్గో వేరియంట్ మంచి ఆదరణ పొందుతోంది. 2026లో ఇప్పటివరకు అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ వ్యాన్‌గా ఇది నిలిచింది. జూలైలో ఒక్క నెలలోనే కియా యూకేలో తొలిసారిగా 1,000కు పైగా ఎలక్ట్రిక్ వ్యాన్ లను విక్రయించింది. ఇందులో 784 PV5 కార్గో, 235 PV5 ప్యాసింజర్ మోడళ్లు ఉన్నాయి. జూలై వరకు యూకేలో 3,239 PV5 కార్గో, 1,141 PV5 ప్యాసింజర్ వాహనాలు రిజిస్టర్ అయ్యాయి. ఈ డిమాండ్ కారణంగా యూకే ఎలక్ట్రిక్ లైట్ కమర్షియల్ వెహికల్ మార్కెట్లో కియా మూడో స్థానానికి చేరింది.
PV5ను కేవలం సాధారణ వ్యాన్‌గా కాకుండా ఆధునిక టెక్నాలజీతో రూపొందించిన ఎలక్ట్రిక్ కమర్షియల్ వాహనంగా కియా అభివృద్ధి చేసింది. ఇందులో కంపెనీ ప్రత్యేక E-GMP.S ప్లాట్ ఫామ్‌తో పాటు అధునాతన సాఫ్ట్ వేర్ టెక్నాలజీని ఉపయోగించింది. PV5 కార్గో ఒకే ఛార్జ్ తో 693.38 కిలోమీటర్లు ప్రయాణించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించినట్లు కియా తెలిపింది.
Read Also: CNGపై కేంద్రం సంచలన నిర్ణయం.. 2028 నుంచి కొత్త ఇంధన విధానం అమలు!