Maruti Brezza Creates New Sales Record: మారుతి సుజుకి బ్రెజ్జా భారత మార్కెట్లో మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ మొత్తం అమ్మకాలు 15 లక్షల యూనిట్ల మార్క్ ను దాటాయి. ఇటీవలే కంపెనీ 2026 బ్రెజ్జా ఫేస్ లిఫ్ట్ ను విడుదల చేసేంది. అదే సమయంలో ఈ అరుదైన గుర్తింపును కూడా ప్రకటించింది. దాదాపు పదేళ్లుగా భారత మార్కెట్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న బ్రెజ్జా ఇప్పటికీ అత్యధికంగా అమ్ముడవుతున్న కాంపాక్ట్ ఎస్‌యూవీలలో ఒకటిగా కొనసాగుతోంది.
ఇప్పటివరకు దేశీయ మార్కెట్లో 14,61,889 బ్రెజ్జా యూనిట్లు అమ్ముడయ్యాయి. అలాగే, విదేశీ మార్కెట్లకు 52,828 యూనిట్లను ఎగుమతి చేసింది. దీంతో మొత్తం అమ్మకాలు 15,14,717 యూనిట్లకు చేరుకున్నాయి. ఈ లెక్కలతో బ్రెజ్జా భారత్ లో అత్యధికంగా అమ్ముడైన కాంపాక్ట్ ఎస్‌యూవీగా నిలిచింది. అమ్మకాల పరంగా టాటా నెక్సాన్ ఇప్పటివరకు సుమారు 10.92 లక్షల యూనిట్లతో రెండో స్థానంలో ఉండగా, టాటా పంచ్ మూడో స్థానంలో కొనసాగుతోంది. ఈ సంఖ్యలు బ్రెజ్జా మార్కెట్లో ఎంత బలమైన స్థానం సంపాదించుకుందో స్పష్టం చేస్తున్నాయి.
2016లో బ్రెజ్జా తొలిసారి మార్కెట్లోకి వచ్చినప్పుడు ఇందులో కేవలం 1.3 లీటర్ డీజిల్ ఇంజిన్ మాత్రమే అందుబాటులో ఉండేది. ఆ సమయంలో డీజిల్ ఎస్‌యూవీలకు మంచి డిమాండ్ ఉండటంతో బ్రెజ్జాకు భారీ స్పందన లభించింది. వరుసగా నాలుగేళ్ల పాటు దేశంలో అత్యధికంగా అమ్ముడైన ఎస్‌యూవీగా నిలిచి రికార్డు సృష్టించింది. ఆ తర్వాత BS6 ఉద్గార నిబంధనలు అమల్లోకి రావడంతో కంపెనీ డీజిల్ ఇంజిన్ ను నిలిపివేసి, 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను పరిచయం చేసింది. ఆ తర్వాత కూడా బ్రెజ్జా మంచి అమ్మకాలను సాధిస్తూ వచ్చింది. అయితే 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో బ్రెజ్జా అమ్మకాలు కొంత తగ్గాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే సుమారు 20 శాతం తక్కువ యూనిట్లు అమ్ముడయ్యాయి. దీనికి ప్రధాన కారణం కొత్త ఫేస్‌లిఫ్ట్ మోడల్ కోసం చాలా మంది వినియోగదారులు ఎదురుచూడటమేనని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి.
కొత్త 2026 బ్రెజ్జాలో డిజైన్ లో మార్పులతో పాటు ఆధునిక ఇంటీరియర్, కొత్త ఫీచర్లు, టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్ లాంటి అప్ డేట్స్ అందుబాటులోకి వచ్చాయి. ఈ మోడల్‌కు 5 స్టార్ భారత్ NCAP భద్రతా రేటింగ్ కూడా లభించింది. దీంతో కొత్త బ్రెజ్జాపై వినియోగదారుల ఆసక్తి మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. గత పదేళ్లలో ఈ వెహికల్ మారుతున్న మార్కెట్ అవసరాలకు అనుగుణంగా అప్‌డేట్ అవుతూ తన స్థానాన్ని నిలబెట్టుకుంది. కొత్త ఫేస్‌లిఫ్ట్ మోడల్‌తో మరోసారి అమ్మకాలలో వేగం పెంచాలని మారుతి సుజుకి లక్ష్యంగా పెట్టుకుంది.
Read Also: థార్ రాక్స్ స్టైల్ స్క్రీన్లతో స్కార్పియో N.. లీక్‌లో బయటపడ్డ క్రేజీ డీటైల్స్!