New Maruti Swift Turbo Engine: మారుతి సుజుకి స్విఫ్ట్ అనగానే స్పోర్టీ లుక్, మంచి మైలేజ్ తో పాటు డ్రైవింగ్ లో ఫన్ అందించే హ్యాచ్ బ్యాక్ గా చాలామందికి గుర్తొస్తుంది. అయితే, న్యూ జెనరేషన్ స్విఫ్ట్ లో గతంలో ఉన్న నాలుగు సిలిండర్ల ఇంజిన్ స్థానంలో మూడు సిలిండర్ల యూనిట్ వచ్చింది. దీంతో మునుపటి మోడళ్లతో పోలిస్తే పవర్ విషయంలో కొంత మార్పు కనిపించింది. ఇప్పుడు స్విఫ్ట్ ను మరింత శక్తివంతంగా మార్చేందుకు మారుతి సుజుకి కొత్త టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను తీసుకురావడానికి రెడీ అవుతోంది.
సుజుకి కొత్త డైరెక్ట్ ఇంజెక్షన్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ను అభివృద్ధి చేస్తోంది. 1.2 లీటర్ సామర్థ్యంతో రూపొందుతున్న ఈ ఇంజిన్ సుమారు 125 బీహెచ్‌పీ పవర్, 230 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త యూనిట్ మూడు సిలిండర్ల ఇంజిన్‌గా ఉండనుంది. ముఖ్యంగా E100 ఫ్లెక్స్ ఫ్యూయల్ తో పాటు CNG, CBG లాంటి ప్రత్యామ్నాయ ఇంధనాలను కూడా ఉపయోగించుకునే విధంగా దీనిని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.
కొత్త టర్బో ఇంజిన్ ను కేవలం స్విఫ్ట్ కే పరిమితం చేయకుండా, మారుతి సుజుకి ఇతర మోడళ్లలోనూ ఉపయోగించే అవకాశం ఉంది. స్విఫ్ట్ తో పాటు డిజైర్, బాలెనో, బ్రెజ్జా లాంటి కార్లలో ఈ ఇంజిన్‌ను అందించే అవకాశాలపై చర్చ జరుగుతోంది. ఈ ఇంజిన్ కంపెనీకి ఇప్పటికే పరిచయం ఉన్న Z12E ఇంజిన్ ఆధారంగా అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం. అయితే ఏ మోడల్‌లో ఎప్పుడు ఈ ఇంజిన్ అందుబాటులోకి వస్తుందనే విషయంపై మారుతి సుజుకి నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
కొత్త ఇంజిన్ స్విఫ్ట్ లోకి వస్తే కారు పనితీరులో భారీగా మార్పులు కనిపించే అవకాశం ఉంది. ప్రస్తుతం టర్బో పెట్రోల్ హ్యాచ్‌బ్యాక్ విభాగంలో హ్యుందాయ్ ఐ20 ఎన్-లైన్ వంటి కార్లు బలమైన పనితీరును అందిస్తున్నాయి. ఐ20 ఎన్ లైన్ 118 బీహెచ్‌పీ పవర్, 172 ఎన్ఎమ్ టార్క్ ను అందిస్తుంది. కొత్త 1.2 లీటర్ టర్బో ఇంజిన్‌తో స్విఫ్ట్ 125 బీహెచ్‌పీ, 230 ఎన్ఎమ్ టార్క్‌ను అందిస్తే ఈ విభాగంలో పోటీ మరింత పెరిగే అవకాశం ఉంటుంది.
ఈ కొత్త ఇంజిన్ లో మరో ముఖ్యమైన అంశం ప్రత్యామ్నాయ ఇంధనాలలకు అనుకూలంగా ఉంటుంది. E100 ఫ్లెక్స్ ఫ్యూయల్, CNG, CBG లాంటి ఇంధనాలను ఉపయోగించుకునే సామర్థ్యం ఉంటుంది. మారుతి ఇప్పటికే CNG కార్ల విషయంలో పెద్ద స్థాయిలో పనిచేస్తోంది. భవిష్యత్తులో CNG కార్లలో బూట్ స్పేస్‌ను మెరుగుపరచేందుకు అండర్‌ఫ్లోర్ సిలిండర్ టెక్నాలజీపై కూడా కంపెనీ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. కొత్త 1.2 లీటర్ టర్బో ఇంజిన్‌పై ప్రస్తుతం ఆసక్తి పెరుగుతున్నప్పటికీ, దీన్ని స్విఫ్ట్ లో ఎప్పుడు తీసుకువస్తారనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Read Also: హోండా సిటీ vs హ్యుందాయ్ వెర్నా.. CVTలో ఏది బెస్ట్?