Ramachandra Rao: మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ రాజకీయాల్లో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాల ఎన్నిక ప్రక్రియ చట్టవిరుద్ధమంటూ ఖర్గే చేసిన విమర్శలపై భారతీయ జనతా పార్టీ నాయకత్వం తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఈ క్రమంలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఎక్స్ వేదికగా ఖర్గేకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
రేవంత్ రెడ్డి కూడా ఇల్లీగల్ సీఎమేనా?
మల్లికార్జున ఖర్గే వాదనను తిప్పికొడుతూ రామచంద్రరావు కొన్ని కీలక ప్రశ్నలు సంధించారు. ఖర్గే చెప్పిన సూత్రాలనే ప్రామాణికంగా తీసుకుంటే, తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి కూడా చట్టవిరుద్ధంగా ఎన్నికైన ‘ఇల్లీగల్ ముఖ్యమంత్రి’ అవుతారని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, రాష్ట్రంలోని కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా అక్రమంగానే ఎన్నికైనట్లు భావించాల్సి వస్తుందని ఎద్దేవా చేశారు.
మీరూ, మీ కుమారుడు కూడా ఇల్లీగల్ ఎంపీ, మినిస్టర్లే!
విమర్శల దాడిని మరింత తీవ్రతరం చేస్తూ ఖర్గే సొంత కుటుంబాన్ని కూడా ఇందులో ప్రస్తావించారు. ఇదే లెక్కన చూస్తే కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ఇల్లీగల్ ఎంపీ అవుతారని, ఆయన కుమారుడు ప్రియాంక్ ఖర్గే కూడా ‘ఇల్లీగల్ మినిస్టర్’ అవుతారని స్పష్టం చేశారు. ఆధారాల్లేని విమర్శలు చేయడం ద్వారా ఖర్గే తన సొంత పార్టీ నాయకుల పదవులనే ప్రశ్నించే స్థితికి దిగజారారని విమర్శించారు.
రాజీనామాలు చేయించే ధైర్యం ఉందా?
ఖర్గే గనుక తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటే.. ముందుగా తన కుమారుడితో పాటు తెలంగాణలోని కాంగ్రెస్ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలందరి చేత రాజీనామాలు చేయించాలని రామచంద్రరావు డిమాండ్ చేశారు. మాట్లాడే ముందు పరిణామాలను ఆలోచించుకోవాలని, ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే అది సొంత పార్టీకే చేటు తెస్తుందని హెచ్చరించారు.
Also Read: హుస్నాబాద్‌లో విషాదం.. ఆగి ఉన్న మున్సిపల్ ట్రాక్టర్‌ను ఢీకొన్న బైక్.. ఇద్దరు దుర్మరణం!