MG Cyberster New Price: స్పోర్ట్స్ కారు అంటే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది భారీ ధర. అలాంటి కారును కొనాలంటే కోటి రూపాయలకు పైగా ఖర్చు చేయాల్సిందేనని అనుకుంటారు. కానీ, ఇప్పుడు ఆ లెక్క కాస్త మారింది. ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు ఎంజీ సైబర్‌స్టర్ (MG Cyberster) ధరను కొత్త BaaS పథకం ద్వారా దాదాపు రూ.10 లక్షలు తగ్గించారు. దీంతో ఖరీదైన స్పోర్ట్స్ కారు కొనే ఆలోచన ఉన్న వారికి ఈ మోడల్ బెస్ట్ ఆప్షన్ గా మారింది.
MG సైబర్‌స్టర్ ప్రస్తుతం MG Select డీలర్ షిప్‌ల ద్వారా అందుబాటులో ఉంది. దీని ఎక్స్‌షోరూమ్ ధర గతంలో రూ.82.50 లక్షలుగా ఉండేది. ఇప్పుడు బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ (BaaS) పథకం కింద కారు ధర రూ.72.49 లక్షలకు తగ్గింది. అంటే, ప్రారంభ ధరలోనే సుమారు రూ.10.01 లక్షల తేడా కనిపిస్తోంది. అయితే, ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. BaaS ఆప్షన్ లో బ్యాటరీ ధరను కారు మొత్తం ధరలో కలపరు. దానికి బదులుగా వినియోగాన్ని బట్టి బ్యాటరీ కోసం కిలోమీటరుకు రూ.8 చొప్పున ప్రత్యేకంగా చెల్లించాల్సి ఉంటుంది. ధర తగ్గినా సైబర్ స్టర్ లుక్ లో ఎలాంటి మార్పులు ఉండవు. రెండు సీట్లతో వచ్చే ఈ ఎలక్ట్రిక్ రోడ్ స్టర్‌కు సిజర్ డోర్లు ఇట్టే ఆకట్టుకుంటాయి. సాధారణ కార్లకు భిన్నంగా పైకి తెరుచుకునే ఈ డోర్లు కారుకు మరింత స్పోర్టీ లుక్‌ను ఇస్తాయి. రోజువారీ ప్రయాణాల కంటే వీకెండ్ డ్రైవ్‌లు, లాంగ్ డ్రైవ్‌లను ఇష్టపడేవారిని దృష్టిలో పెట్టుకుని ఈ కారును రూపొందించారు.
సైబర్‌స్టర్ కేవలం అందంగా కనిపించే కారు మాత్రమే కాదు. ఇందులో 77kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 580 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుందని కంపెనీ వెల్లడించింది. డ్యూయల్ మోటార్ ఆల్-వీల్ డ్రైవ్ సెటప్ ద్వారా 508 bhp పవర్, 725 Nm టార్క్ ఉత్పత్తి అవుతుంది. ఈ పవర్‌తో కారు కేవలం 3.2 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. అంటే యాక్సిలరేటర్ నొక్కిన వెంటనే వేగం పెరగడం ఈ కారు ప్రత్యేకత.
క్యాబిన్‌లో కూడా ప్రీమియం ఫీల్ వచ్చేలా ఫీచర్లను అందించారు. 10.25 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో పాటు రెండు 7 అంగుళాల డిజిటల్ డిస్‌ప్లేలు ఉన్నాయి. డ్యూయల్-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, PM2.5 ఫిల్ట్రేషన్, BOSE సౌండ్ సిస్టమ్, ప్యాడిల్ షిఫ్టర్లు లాంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. దీంతో డ్రైవింగ్ ఎక్స్ పీరియెన్స్ తో పాటు క్యాబిన్ సౌకర్యాలపైనా దృష్టి పెట్టారు.
Read Also: CNGతో పాటు AMT కూడా.. మారుతి డిజైర్, స్విఫ్ట్ కొత్త వెర్షన్లు విడుదల!