Nissan Pixo EV Revealed: యూరప్ లో రోజువారీ ప్రయాణాలకు చిన్న ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. ఈ అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని నిస్సాన్ కొత్త సిటీ ఈవీ పిక్సోను ఆవిష్కరించింది. రెనాల్ట్ తో కలిసి అభివృద్ధి చేసిన ఈ కారు చిన్న కొలతల్లోనే మంచి స్థలం, అత్యాధునిక ఫీచర్లు, ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌ను అందించేలా రూపొందించారు. స్లోవేనియాలోని రెనాల్ట్ నోవో మెస్టో ప్లాంట్ లో దీనిని తయారు చేయనున్నారు.
పిక్సోను చూసిన వెంటనే ఆకట్టుకునేది దాని డిజైన్. క్యూబ్ తరహా నిష్పత్తులతో బాక్సీగా కనిపించే ఈ కారు, నిస్సాన్ కొత్త EV డిజైన్ లాంగ్వేజ్‌ను ప్రతిబింబిస్తుంది. ముందు భాగంలో పిక్సెల్ తరహా లైటింగ్, ప్రత్యేకమైన ‘రోబోట్ ఫేస్’ బంపర్ ఉన్నాయి. 18 అంగుళాల చక్రాలపై కూడా పిక్సెల్ స్టైల్ హైలైట్స్ కనిపిస్తాయి. ‘Wonder Purple’, ‘Gear Blue’ లావటి ప్రత్యేక రంగులు యువతను ఆకర్షించేలా ఉన్నాయి. కారు పొడవు 3,796 మిల్లీమీటర్లు, వెడల్పు 1,790 మిల్లీమీటర్లుగా ఉంది. 9.9 మీటర్ల టర్నింగ్ సర్కిల్ తో నగరాల్లో ఇరుకైన రోడ్లపై కూడా సులభంగా మలుపులు తీసుకునేలా దీనిని రూపొందించారు.
చిన్న సిటీ కారుగా ఉన్నప్పటికీ పిక్సోలో నలుగురు పెద్దలు ప్రయాణించేలా క్యాబిన్‌ను డిజైన్ చేశారు. నిలువుగా ఉండే డ్యాష్ బోర్డ్, టెక్చర్డ్ ఫినిష్, AC వెంట్ల చుట్టూ ఆరెంజ్ యాక్సెంట్లు ఇంటీరియర్‌కు ప్రత్యేకమైన లుక్ ఇస్తాయి. డ్యాష్‌బోర్డ్ పై 7 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ ప్లేతో పాటు 10 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ కోసం ఫిజికల్ బటన్లు, డయల్స్ ను కూడా కొనసాగించారు. వెనుక సీట్లను అవసరాన్ని బట్టి ముందుకు, వెనక్కి జరుపుకోవచ్చు. దీంతో ప్రయాణికుల స్థలం, బూట్ స్పేస్‌కు అనుగుణంగా క్యాబిన్‌ను మార్చుకోవచ్చు.
టెక్నాలజీ విషయంలోనూ పిక్సో దూకుడుగా ఉంది. ఇందులో గూగుల్ బిల్ట్ ఇన్ సదుపాయాలతో పాటు గూగుల్ జెమినిని అందిస్తున్నట్లు నిస్సాన్ తెలిపింది. ఇది 16 భాషలు, మాండలికాల్లో పనిచేస్తుందని కంపెనీ వెల్లడించింది. అంతేకాదు, వేర్వేరు డ్రైవర్లను గుర్తించి వారి వ్యక్తిగత సెట్టింగ్‌లను గుర్తుంచుకునే Face ID సదుపాయం కూడా ఉంది. భద్రత కోసం ADAS ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ డిపార్చర్ వార్నింగ్, హ్యాండ్స్ ఫ్రీ పార్కింగ్ లాంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. బూట్‌లో గరిష్ఠంగా 356 లీటర్ల వరకు సామాను పెట్టుకోవచ్చు. అయితే, ఛార్జింగ్ కేబుల్ కోసం సుమారు 50 లీటర్ల స్థలం వినియోగమవుతుంది.
పిక్సోలో 27.5kWh LFP బ్యాటరీని ఉపయోగించారు. దీనికి 82hp శక్తిని అందించే సింగిల్ ఎలక్ట్రిక్ మోటార్ యాడ్ చేశారు. టార్క్, ఇతర పనితీరు వివరాలను నిస్సాన్ ఇంకా వెల్లడించలేదు. అయితే పూర్తి ఛార్జ్‌పై 259 కిలోమీటర్ల వరకు రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ చెబుతోంది. ఛార్జింగ్ విషయంలోనూ ఈ చిన్న EVలో మంచి సదుపాయాలు ఉన్నాయి. 50kW DC ఫాస్ట్ ఛార్జింగ్ ద్వారా బ్యాటరీని 15 నుంచి 80 శాతం వరకు సుమారు 28 నిమిషాల్లో ఛార్జ్ చేయవచ్చు. 11kW బై-డైరెక్షనల్ AC ఛార్జింగ్‌కు కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. నిస్సాన్ పిక్సో ధరను ఇంకా ప్రకటించలేదు. అయితే, యూరప్‌లో ఈ కారు డెలివరీలు 2027 ప్రారంభంలో మొదలవుతాయని కంపెనీ తెలిపింది.
Read Also: కొత్త టయోటా ల్యాండ్ క్రూయిజర్ వచ్చేస్తోంది.. లుక్ చూస్తే మతిపోవాల్సిందే!