Xi Jinping’s Presidential Car: బ్రిక్స్ సదస్సు కోసం చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ ఢిల్లీకి రావడంతో ఆయన ప్రయాణించే కారు కూడా వచ్చింది. షీ రాకకు ముందే ఆయన అధికారిక కాన్వాయ్‌కు చెందిన కొన్ని వాహనాలను నల్లటి కవర్లతో చుట్టి ఢిల్లీకి తీసుకొచ్చిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఆ కవర్ల వెనుక ఉన్న వాహనాలపై ఆసక్తి పెరిగింది.
విదేశీ పర్యటనలకు వెళ్లే సమయంలో దేశాధినేతల అధికారిక వాహనాలను ముందుగానే ఆతిథ్య దేశానికి తరలించడం సాధారణమే. వాటిని కార్గో విమానాలు, ప్రత్యేక క్యారియర్లు, ఇతర రవాణా మార్గాల ద్వారా తీసుకెళ్తారు. ఈ సమయంలో వాహనాలకు కవర్లు వేయడం వెనుక పలు కారణాలు ఉంటాయి. దుమ్ము, వర్షం, ఎండ లాంటి వాటి నుంచి కార్లను రక్షించడంతో పాటు, రవాణా సమయంలో చిన్నపాటి నష్టాలు జరగకుండా చూడటానికి కూడా ఇవి ఉపయోగపడతాయి. ముఖ్యంగా అత్యంత భద్రత కలిగిన ప్రభుత్వ వాహనాల విషయంలో వాటి వివరాలు ముందుగానే బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే, ఢిల్లీలో కనిపించిన ఈ దృశ్యం సాధారణ కార్లకు సంబంధించినది కాదు. షీ జిన్‌పింగ్ ఉపయోగించే ప్రత్యేకమైన హాంగ్‌కీ N701 కూడా ఈ ఆసక్తికి ప్రధాన కారణంగా మారింది.
హాంగ్‌కీ N701 చైనా లగ్జరీ కార్ల తయారీ సంస్థ హాంగ్‌కీ రూపొందించిన ప్రత్యేక లిమోసిన్. ‘హాంగ్ కీ’ అనే పేరుకు చైనీస్‌లో ‘ఎర్ర జెండా’ అనే అర్థం. ఈ సంస్థకు చైనా రాజకీయ నాయకత్వంతో చాలా కాలంగా అనుబంధం ఉంది. N701 సాధారణంగా మార్కెట్లో విక్రయించే కారు కాదు. చైనా అగ్ర నాయకత్వం కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ వాహనం గురించి పూర్తి వివరాలను ప్రభుత్వం, కంపెనీ బహిరంగంగా వెల్లడించలేదు. అందుకే దీన్ని ప్రపంచంలోని అత్యంత ప్రత్యేకమైన ప్రభుత్వ కార్లలో ఒకటిగా గుర్తింపు పొందింది.
అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం N701 సుమారు 5.5 మీటర్ల పొడవు ఉంటుంది. పెద్ద గ్రిల్, హాంగ్‌కీ చిహ్నాలతో ఉండే దీని డిజైన్ చాలా గంభీరంగా కనిపిస్తుంది. ఇది అత్యంత భద్రత కలిగిన లిమోసిన్‌గా భావిస్తున్నారు. బుల్లెట్లను తట్టుకునే గ్లాస్, బలమైన బాడీ, ప్రత్యేక టైర్లు వంటి రక్షణ వ్యవస్థలు ఇందులో ఉండొచ్చని పలు నివేదికలు చెబుతున్నాయి. పేలుళ్లు, రసాయన దాడుల నుంచి రక్షణ కల్పించే సదుపాయాలు ఉన్నాయి. అయితే, వీటిలో చాలా వివరాలను హాంగ్‌కీ అధికారికంగా ధృవీకరించలేదు. అలాగే 6.0 లీటర్ V12 ఇంజన్, సుమారు 408 హార్స్ పవర్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. కారు అసలు స్పెసిఫికేషన్లు పూర్తిగా రహస్యంగానే ఉన్నాయి.
షీ జిన్‌పింగ్ విదేశీ పర్యటనల్లో N701 కనిపించడం ఇదే మొదటిసారి కాదు. రష్యా, అమెరికా, ఈజిప్ట్, హాంకాంగ్ లాంటి ప్రాంతాల్లో ఆయన పర్యటనల సమయంలో ఈ లిమోసిన్ దృష్టిని ఆకర్షించింది. అధ్యక్షుడి కోసం విదేశీ లగ్జరీ బ్రాండ్ల కార్లను ఉపయోగించకుండా, చైనాలోనే తయారైన ప్రత్యేక వాహనాన్ని వినియోగించడం కూడా N701 ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ఇది చైనా ఆటోమొబైల్ సామర్థ్యాన్ని ప్రతిబింబించేలా రూపొందించబడిందనే అభిప్రాయాలు ఉన్నాయి.
Read Also: క్రెటా To అల్కాజార్.. హ్యుందాయ్ SUVలకు అదిరిపోయే లాంజ్ టచ్!